save trees
-
చెట్టే కదా అని మేకు కొట్టేస్తే!
చెట్టుకు మేకు కొట్టడం.. ఇది చాలా కామన్.. ఎంత అంటే.. మన ఇంట్లో గోడకు కొట్టినట్లు వీధుల్లోని చెట్లకు కొట్టేస్తుంటాం.. మన చిన్న చిన్న అవసరాల కోసం చెట్టే కదా అని లైట్ తీసుకుంటుంటాం.. పోస్టర్లు, బ్యానర్లు కట్టాలన్నా లేదా ఇంట్లోని ఫంక్షన్‌కి టెంట్ కోసమైనా సపోర్టు కోసం చెట్లకు మేకులు కొట్టేస్తూనే ఉంటాం.. దీనికి పట్టణాలు, పల్లెలు అని తేడా లేదు.. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని బేధమూ లేదు.. ఎక్కడ చూసినా ఇదే తంతు.. అయితే.. ఇప్పుడు మన మనుగడకు చెట్లను నాటడం ఎంత అవసరమో.. అదే చెట్లకు కొట్టే మేకులను తీయడం కూడా అంత అవసరమంటున్నారు సామాజిక, పర్యావరణ వేత్తలు. ఇంతకీ చెట్లకు మేకులు ఎందుకు కొట్టకూడదు? పదే పదే మేకు కొడితే ఏమవుతుంది? చెట్లకు కొట్టేసే మేకులు వాటి ఎదుగుదలను దెబ్బతీసి, వాటికి ఆహారం, నీరు అందే వ్యవస్థను పాడు చేసి అవి క్రమంగా మోడు వారేలా చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అందుకే ‘నెయిల్ ఫ్రీ ట్రీస్’. విచ్చలవిడిగా చెట్లకు కొడుతున్న మేకులను తొలగించడం ఇప్పుడో ఉద్యమం. సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రాచుర్యం పొందుతోంది. నాలుగేళ్ల క్రితం పుణేలో మాధవ్ పాటిల్ అన్న సామాజిక కార్యకర్త ఈ ఉద్యమానికి విత్తనం నాటారు. ఆయనతో స్వచ్ఛంద సంస్థలు జత కూడటంతో పుణేలో ముమ్మరంగా కార్యక్రమం సాగింది. ఆ తర్వాత తుషార్ వరంగ్ అనే కార్యకర్త ముంబైలో దీన్ని ప్రారంభించారు. రెండేళ్లుగా సెలవు రోజుల్లో చెట్ల నుంచి మేకులు తొలగించే కార్యక్రమాన్ని ప్రకృతి ప్రేమికులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ముంబైలో ఈ ఉద్యమానికి అక్కడి మేయర్ పూర్తి సహకారం అందిస్తున్నారు. చెట్లకు మేకులు కొట్టడాన్ని నేరంగా పరిగణించేలా చట్టంలో మార్పులు తెచ్చేందుకు కృషి చేసే దిశగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి నుంచి బెంగళూరుకు పాకింది. వినోద్ కర్తవ్య అనే డీఆర్డీఓ అసిస్టెంట్ సైంటిస్ట్ ఆధ్వర్యంలో యువతీయువకులు ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ‘బృహత్ బెంగళూరు మహానగరపాలిక’జనవరి ఒకటిన తిరిగి ప్రారంభించిన ఉద్యమంలో స్వయంగా దాని కమిషనర్ మంజునాథ ప్రసాద్ పాల్గొని, చెట్లకు మేకులు కొట్టేవారి విషయంలో కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ప్రకటించారు. తర్వాత మైసూరు, తమిళనాడులోని పలు పట్టణాలు, కేరళ.. ఇలా ఉద్యమం పలుచోట్లకు పాకుతోంది. ఇప్పుడు మహారాష్ట్రలోని షోలాపూర్ సహా పలు చిన్న పట్టణాల్లోనూ మొదలైంది. మేకులు కొడితే ఏమవుతుంది? ‘ఓ మనిషి శరీరంలో బుల్లెట్ దిగి అది అలాగే ఉండిపోతే ఎలా ఉంటుందో చెట్లకు మేకులు దిగితే అలాగే ఉంటుంది. చెట్ల బెరడు లోపల ఉండే వల్కలం, కేమ్యం (అవిభాజ్య కణజాలం)లను అది దెబ్బతీస్తుంది. దీని వల్ల చెట్లు నీటిని తీసుకునే, ఆహారాన్ని పొందే వ్యవస్థ దెబ్బతిని దాని పెరుగుదల మందగిస్తుంది. మేకుతో ఏర్పడే గాయాల నుంచి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ప్రవేశించి చెట్టు నాశనానికి కారణం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రక్రియతో చెట్లు చాలా శక్తిని కోల్పోతాయి. పదేపదే జరిగితే అది నీరసించి వాడిపోవచ్చు. ఇక మేకుతో ఏర్పడే సందుల్లోంచి దాని ద్రవాలు లీకై కూడా నష్టం జరుగుతుంది. పెద్ద చెట్లకు ఎక్కువ మేకులు కొడితే.. అవి దెబ్బతింటాయి.. చిన్న చెట్లకు కొన్ని మేకులు కొట్టినా.. కొన్నాళ్లలో చనిపోవచ్చు.. అందుకే మేకులు కొట్టకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. మేకులు కొట్టేవారికి జరిమానాలు విధించాలి. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ వి.ఎస్.రాజు, కాకతీయ విశ్వవిద్యాలయం, వృక్షశాస్త్ర విశ్రాంత ఆచార్యులు ఇక్కడ చాలా అవసరం ఈ ఉద్యమం హైదరాబాద్‌కు మరింత అవసరం.. మేకులు కొట్టడం ఇక్కడ ఇష్టారాజ్యమే. ఇక్కడ నెయిల్ ఫ్రీ ట్రీస్ ఉద్యమం చాలా అవసరం. అంతేకాదు.. ఫుట్‌పాత్‌లపై చెట్ల మొదళ్లను ఆనుకుని కాంక్రీట్ చేస్తున్నారు. దీని వల్ల కూడా చెట్లు చచ్చిపోతాయి. – ఉదయకృష్ణ, వాటా ఫౌండేషన్ -
వివాహ ప్రక్రియలో నూతన ఒరవడి
పెరంబూరు: వివాహ వేడుకలోనూ పర్యావరణంపై తమ మక్కువ చాటుకున్నారో నవ దంపతులు. శుక్రవారం పెళ్లి చేసుకున్న ముత్యాల నవీన్, శ్రీజ జంట ఆ వేడుకలోనే ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని వివాహతంతులో అరుంధతి నక్షత్రాన్ని చూపించే సమయంలో ఎవెన్యూ ప్లాంట్‌ను నాటి, దాని సంరక్షణ బాధ్యతను చేపట్టడంతో పాటు, ఇదే విధంగా ప్రతి వార్షికోత్సవానికి ఒక మొక్క నాటి దాన్ని సంరక్షణా బాధ్యతలు చేపడతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం స్కాప్స్(హైదరాబాద్) స్వచ్ఛంద సంస్థ అధినేత ముత్యాల నరేంద్ర ఆధ్వర్యంలో బంధుమిత్రల సమక్షంలో పాలవాక్కమ్‌లోని గ్రీన్మెడాస్ రిసార్ట్స్‌తో జరిగింది. -
అడవిపై గొడ్డలి వేటు
సాక్షి, ఆదిలాబాద్ : అధికారుల నిర్లక్ష్యంతో రానురాను అడవులు మాయమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. జిల్లాలో 1,83, 210 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ఉండగా, ఇప్పటికే లక్ష హెక్టార్లకు పైగా క్షీణించిపోయింది. మిగిలిన భాగాన్నైనా కాపాడితేనే అడవుల జిల్లా అనే పేరు ఉంటుంది. లేదంటే ఒకప్పుడు అడవులు ఉండేవని చదువుకోవాల్సి వస్తుంది. క్షీణించిన అటవీలో గజ్వేల్ స్ఫూర్తితో సహజసిద్ధమైన అటవీని పెంచాలనే ప్రయత్నాలు ప్రారంభించినా..ఉన్న అటవీని రక్షించాలనే తపన అధికారుల్లో కనిపించకపోవడం గమనార్హం. దిగువ సిబ్బందిపైనే వేటు అటవీలో గొడ్డలివేటు వంటి అలజడి జరిగినప్పుడు అటవీశాఖ అధికారులు దిగువ సిబ్బందిపైనే వేటు వేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తాజాగా జరిగిన వాయిపేట్ సంఘటనలోనూ ఇలాంటి విమర్శలే వచ్చాయి. వాయిపేట్ ఘటనలో ఓ బీట్ ఆఫీసర్, ఓ సెక్షన్ ఆఫీసర్లపై సస్పెష్షన్ వేటు వేశారు. అయితే రేంజ్ ఆఫీసర్‌పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై యువ సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే సస్పెన్షన్ వేటు పడిన వారి స్థానంలో ఇతర సెక్షన్, బీట్ ఆఫీసర్లను నియమించారు. దీనిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు వాయిపేట్ అటవీ విధ్వంసం జరిగినప్పుడు అక్కడే పనిచేసిన ఈ అధికారులకు తిరిగి అక్కడే పోస్టింగ్ ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. అయితే గ్రామస్తులతో మమేకమయ్యే పరిస్థితి ఉండడంతోనే వారికి తిరిగి అక్కడే పోస్టింగ్ ఇచ్చినట్లు అటవీశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అధికారుల వైఫల్యం.. అటవీశాఖ పరంగా జిల్లాలో తొమ్మిది రేంజ్‌లు ఉండగా, 75 సెక్షన్లు, 170 బీట్లు ఉన్నాయి. సాధారణంగా సెక్షన్, బీట్ ఆఫీసర్లకు ద్విచక్ర వాహనాలను ప్రభుత్వమే కల్పించింది. నిరంతరం అటవీని పర్యవేక్షించాల్సిన వీరు విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. బీట్ ఆఫీసర్ నెలలో 30 రోజులు, సెక్షన్ ఆఫీసర్ నెలలో 20 రోజులు తమ విస్తీర్ణం పరిధిలో తిరిగి అటవీకి సంబంధించిన సమాచారాన్ని పైఅధికారులకు చేరవేస్తుండాలి. అలాగే డ్యూటీకి సంబంధించి నిరంతరంగా డైరీలో నమోదు చేస్తుండాలి. వీరిపై ఫారెస్టు రేంజ్ అధికారి పర్యవేక్షణ ఉండాల్సి ఉన్నా నామమాత్రం అవుతుంది. దీంతోనే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతుందన్న విమర్శలు ఉన్నాయి. వాయిపేట ఘటన ఒక్కరోజుతో జరిగింది కాదని, ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోని చెట్లను నరికివేయడానికి కొన్ని రోజులు పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం ఘటన జరిగే వరకు బీట్, సెక్షన్ అధికారులకు కనీసం సమాచారం లేకపోవడం ఇక్కడ విస్మయం కలిగిస్తోంది. దీన్నిబట్టి క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు పర్యవేక్షించడం లేదన్నది తేటతెల్లం అవుతోంది. కింది నుంచి పైవరకు అధికారులు పట్టణ ప్రాంతాల్లో ఉంటూ అడపాదడపా విధులకు వెళ్తుండడంతోనే ఇలాంటి సంఘటనలు జరిగినా సమాచారం ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అటు స్మగ్లర్లు కానీ, ఇటు గ్రామస్తులు గాని అనువైన సమయం కోసం ఎదురుచూసి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. వాయిపేట ఘటన దసరాకు ముందు జరిగినట్టు చెబుతున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు దృష్టి సారించకపోవడంతో ఈ నష్టం జరిగిపోయింది. పోస్టులు ఖాళీయే.. అటవీశాఖ క్షేత్రస్థాయిలో ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. ప్రతీ 400 హెక్టార్లకు ఒక బీట్ ఆఫీసర్ ఉండాల్సి ఉండగా ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 170 బీట్ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల వరకు కేవలం 35 మంది మాత్రమే పనిచేశారు. తాజాగా 65 మందిని ప్రభుత్వం నియమించింది. మరోపక్క సెక్షన్ ఆఫీసర్లకు సంబంధించి 75 పోస్టులకు 10 ఖాళీగా ఉన్నాయి. ఇక జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్ఓ) తర్వాత 3 ఎఫ్డీఓ పోస్టులు ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్‌కు ఉన్నాయి. వీరి కింద 9 మంది ఎఫ్ఆర్ఓలు ఉన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్.. ఇలా అటవీ శాఖలో అధికారుల పోస్టులు వికేంద్రీకృతమై ఉన్నాయి. నిరంతరం పర్యవేక్షణ సరిగ్గా జరిగితేనే అటవీని రక్షించే పరిస్థితి ఉంటుంది. లేదంటే అడవులు మైదానాలుగా తయారయ్యే పరిస్థితి లేకపోలేదు. -
200 ఏళ్ల నాటి రావి చెట్టు రక్షణ కోసం...
న్యూఢిల్లీ : ఇంగ్లండ్ ప్రభుత్వం ఒకప్పుడు చెట్లతోపాటు, వెలుతురు (ఎండ)కు ఎక్కువ ప్రాధాన్యతన ఇచ్చేది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మధ్య వెలుతురుకు బదులు చెట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా ఓ చెట్టును కొట్టివేస్తే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా, ఎక్కువ చెట్లను కొట్టివేస్తే అసాధారణ జరిమానా విధించే చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగించుకొని తన పెరంట్లోని చెట్టును రక్షించుకునేందుకు ఇంగ్లండ్‌లోని బర్న్లీ పట్టణ ప్రాంతంలోని 51 ఏళ్ల జిల్ సార్చెట్ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న సార్చెట్‌కు వృక్ష సంపద అంటే ఎంతో ఇష్టం. అందుకోసం ఆమె ప్రాచీన వృక్ష సంపద కలిగిన ఓ ఇంట్లో గత పదేళ్లుగా నివసిస్తున్నారు. ఆమె ఇంటి పెరట్లో వంద అడుగుల ఎల్తైన 200 ఏళ్ల నాటి రావి చెట్టు ఉంది. ఆ చెట్టు గత కొద్ది రోజులుగా గోధుమ రంగులోకి మారుతుండడం చూసి సార్చెట్‌కు అనుమానం వేసింది. దగ్గరికెళ్లి చూడగా, చెట్టు కాండం చుట్టూ ఐదు అంగుళాల లోతు చొప్పున 52 డ్రిల్లింగ్ చేసిన రంధ్రాలు ఉన్నాయి. వాటి వద్ద ముక్కు పెట్టి వాసన చూడగా, ఒక విధమైన విష రసాయనం వాసన వస్తోంది. ఇది పక్కింటావిట కుట్రేనని సార్చెట్ ఆరోపిస్తోంది. ఆ చెట్టు వల్ల తమ ఇంట్లోకి ఎండ రావడం లేదంటూ పక్కింటావిడ గత కొన్ని నెలలుగా గొడవ చేస్తోందని, దాన్ని కొట్టి వేయాల్సిందిగా సూచిస్తూ వచ్చిందని, అందుకు నిరాకరించడంతో ఆమె ఈ కుట్ర పన్ని ఉంటుందని సార్చెట్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో సార్చెట్‌కు బర్న్లీ కౌన్సిలర్, మాజీ లిబరల్ డెమోక్రట్ ఎంపీ గోర్దాన్ బర్ట్ విజిల్ మద్దతిస్తున్నారు. కొన్ని టన్నుల కొద్ది కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకొని టన్నుల కొద్ది ఆక్సిజన్‌ను ఈ రావి చెట్టు ఇస్తోందని, ఈ చెట్టుపై పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉందని, అలాంటి చెట్టును చంపేయడానికి ఎలా చేతులొచ్చాని సార్చెట్ ఆవేదన వ్యక్తం చేశారు. పక్కింటి వారు పెరట్లోకి ప్రవేశించకుండా సార్చెట్ 50 వేల రూపాయలతో కంచె నిర్మాణం చేపట్టారు. చెట్టును రక్షించేందుకు ఆమె వృక్ష శాస్త్రవేత్తలను కూడా పిలిపించారు. చెట్టును బతికించడం కష్టమేనని, అయినా తమ వంతు ప్రయత్నం చేస్తామని వారు చెప్పారు. ఇదే విషయమై పోలీసులను సంప్రతించగా, తాము ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేపట్టామని, ఇంకా పక్కింటి వారిపై కేసు దాఖలు చేయలేదని, కేసు దాఖలు చేయకుండా వారి వివరాలు బయట పెట్టడానికి వీల్లేదని చెప్పారు. అంతకుమించి మాట్లాడేందుకు వారు నిరాకరించారు. -
ప్రజా ఉద్యమానికి దిగిరావాల్సిందే!
సాక్షి, ముంబై : ఆదివాసీలు, విద్యార్థినీ విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులు, వివిధ వర్గాలకు చెందిన మధ్య తరగతికి చెందిన ప్రజలు దాదాపు వెయ్యి మంది తమ విధులను, పనులను ఎగ్గొట్టి జూలై ఎనిమిదవ తేదీన రోడెక్కారు. దొరికిన బస్సు, మెట్రో, రైలు పట్టుకొని బండ్రా–కుర్లా కాంప్లెక్స్‌లోని ఆడిటోరియంకు చేరుకున్నారు. ‘మెట్రో–3’ ప్రాజెక్ట్ కోసం కార్ షెడ్డును నిర్మించడం కోసం ముంబై ఆరే కాలనీలోని 2,702 చెట్లను నరికేయాలన్న మున్సిపల్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమ గొంతును వినిపించేందుకు వారంతా అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ముంబై నగరం పర్యావరణ పరిస్థితులు దెబ్బతిన్న నేపథ్యంలో పచ్చటి చెట్లను నరికి వేయడానికి మీకెలా చేతులు వస్తాయంటూ ప్లే కార్డులు పట్టుకొని వారు నినాదాలు చేశారు. అరపులు, కేకలలతో గోల చేస్తూ హంగామా సృష్టించారు. అసలు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేసిందే ‘బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్’. చెట్ల నరకివేతనకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ముంబై హైకోర్టు నేరుగా ప్రజల వాణిని తెలుసుకునేందుకు ఈ వేదికను ఏర్పాటు చేయాల్సిందిగా మున్పిపాలిటీకి సూచించింది. ఏడాది క్రితమే ఏడాది క్రితమే ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సి ఉండింది. అప్పుడు ఆడిటోరియంలోకి ప్రవేశించేందుకు ప్రజలకు అనుమతివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో నాటి కార్యక్రమం వాయిదా పడింది. నాటి నుంచి ప్రజలు అవిశ్రాంతంగా పోరాటం కొనసాగిస్తుండడంతో రెండోసారి ఇప్పుడు తగిన ముందస్తు చర్యలతో ప్రజావాణి వినే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరే కాలనీ చెట్లను కొట్టివేయడాన్ని ఆన్లైన్లో 82 వేల మంది వ్యతిరేకించారని మున్సిపల్ కార్పొరేషన్ స్వయంగా అంగీకకరించింది. అయితే వ్యతిరేకిస్తూ సంతకాలు చేసిన వారి సంఖ్య 1,93,865 మందైతే రెండు లక్షల మందికిపైగా వ్యతిరేకిస్తున్నారని సామాజిక కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఈ చెట్ల పరిరక్షణ కోసం మొట్టమొదట ప్రజాహిత వ్యాజ్యాన్ని, వ్యాపారవేత్త, చెట్ల పరిరక్షణ కార్యకర్త జోరు బతేనా దాఖలు చేశారు. అది కాస్త కాలక్రమంలో ప్రజా ఉద్యమంగా మారింది. ఈ ప్రజా ఉద్యమం ఊపిరి పోసుకుంది ఐదేళ్ల క్రితమే. 1886 ఎకరాల ఆరే అటవి ప్రాంతానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా ముప్పు ఏర్పడింది. 1949లో ఈ అటవి ప్రాంతంలో 3,162 ఎకరాల భూమి కాలక్రమంలో తరుగుతూ వచ్చింది. 1977లో రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్‌కు 108 ఎకరాలు, 1989లో ఫిల్మ్ సిటీకి 329 ఎకరాలు, 2009లో కమాండో ఫోర్స్‌కు 98 ఎకరాలు, కొంకన్ అగ్రికల్చర్ యూనివర్శిటీ 145 ఎకరాలు కేటాయించింది. ఇటీవలి కాలంలో నగరంలో జూకు 100 ఎకరాలు కేటాయించారు. నాడు పలుచగా మొదలైన ప్రజా ఉద్యమం నేడు ఊపందుకుంది. నాటి ఉద్యమాన్ని లెక్కచేయని ప్రభుత్వం నేడు పట్టించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఏ నాటికైనా, ఏ ప్రభుత్వంమైన ప్రజా ఉద్యమాలకు తలొంచాల్సిందే. -
చెట్ల నరికివేతపై ఢిల్లీలో ఆందోళన