న్యూఢిల్లీ : ఇంగ్లండ్ ప్రభుత్వం ఒకప్పుడు చెట్లతోపాటు, వెలుతురు (ఎండ)కు ఎక్కువ ప్రాధాన్యతన ఇచ్చేది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మధ్య వెలుతురుకు బదులు చెట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా ఓ చెట్టును కొట్టివేస్తే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా, ఎక్కువ చెట్లను కొట్టివేస్తే అసాధారణ జరిమానా విధించే చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగించుకొని తన పెరంట్లోని చెట్టును రక్షించుకునేందుకు ఇంగ్లండ్‌లోని బర్న్‌లీ పట్టణ ప్రాంతంలోని 51 ఏళ్ల జిల్ సార్చెట్ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు.
ఓ ప్రైవేటు కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న సార్చెట్‌కు వృక్ష సంపద అంటే ఎంతో ఇష్టం. అందుకోసం ఆమె ప్రాచీన వృక్ష సంపద కలిగిన ఓ ఇంట్లో గత పదేళ్లుగా నివసిస్తున్నారు. ఆమె ఇంటి పెరట్లో వంద అడుగుల ఎల్తైన 200 ఏళ్ల నాటి రావి చెట్టు ఉంది. ఆ చెట్టు గత కొద్ది రోజులుగా గోధుమ రంగులోకి మారుతుండడం చూసి సార్చెట్‌కు అనుమానం వేసింది. దగ్గరికెళ్లి చూడగా, చెట్టు కాండం చుట్టూ ఐదు అంగుళాల లోతు చొప్పున 52 డ్రిల్లింగ్ చేసిన రంధ్రాలు ఉన్నాయి. వాటి వద్ద ముక్కు పెట్టి వాసన చూడగా, ఒక విధమైన విష రసాయనం వాసన వస్తోంది. ఇది పక్కింటావిట కుట్రేనని సార్చెట్ ఆరోపిస్తోంది.
ఆ చెట్టు వల్ల తమ ఇంట్లోకి ఎండ రావడం లేదంటూ పక్కింటావిడ గత కొన్ని నెలలుగా గొడవ చేస్తోందని, దాన్ని కొట్టి వేయాల్సిందిగా సూచిస్తూ వచ్చిందని, అందుకు నిరాకరించడంతో ఆమె ఈ కుట్ర పన్ని ఉంటుందని సార్చెట్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో సార్చెట్‌కు బర్న్‌లీ కౌన్సిలర్, మాజీ లిబరల్ డెమోక్రట్ ఎంపీ గోర్దాన్ బర్ట్ విజిల్ మద్దతిస్తున్నారు. కొన్ని టన్నుల కొద్ది కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకొని టన్నుల కొద్ది ఆక్సిజన్‌ను ఈ రావి చెట్టు ఇస్తోందని, ఈ చెట్టుపై పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉందని, అలాంటి చెట్టును చంపేయడానికి ఎలా చేతులొచ్చాని సార్చెట్ ఆవేదన వ్యక్తం చేశారు. పక్కింటి వారు పెరట్లోకి ప్రవేశించకుండా సార్చెట్ 50 వేల రూపాయలతో కంచె నిర్మాణం చేపట్టారు. చెట్టును రక్షించేందుకు ఆమె వృక్ష శాస్త్రవేత్తలను కూడా పిలిపించారు. చెట్టును బతికించడం కష్టమేనని, అయినా తమ వంతు ప్రయత్నం చేస్తామని వారు చెప్పారు.
ఇదే విషయమై పోలీసులను సంప్రతించగా, తాము ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేపట్టామని, ఇంకా పక్కింటి వారిపై కేసు దాఖలు చేయలేదని, కేసు దాఖలు చేయకుండా వారి వివరాలు బయట పెట్టడానికి వీల్లేదని చెప్పారు. అంతకుమించి మాట్లాడేందుకు వారు నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment