south kolkata
-
మనసు కుదుట పడింది కాఫీ తాగండి
ఆ కేఫ్‌కి కష్టమర్లు మంచి రేటింగే ఇచ్చారు. ఫేస్బుక్ 5కు 5 పాయింట్లు ఇచ్చింది. కోల్‌కతా ప్రజలకు తెలుసు తమకు ఆ కేఫ్‌ను ప్రోత్సహించాలని. అందుకే అక్కడకు వెళతారు. మాక్టైల్స్ తాగుతారు. పఫ్‌లు తింటారు. బేకరి ఐటమ్స్ పార్శిల్ కట్టించుకుంటారు. 7 నుంచి 9 మంది స్త్రీలు ఎప్పుడూ అక్కడ చిరునవ్వుతో పని చేస్తూ ఉంటారు. కూర్చోవడానికి అనువుగా ఉండి ప్రశాంతంగా ఉండే బేకరి కేఫ్ పేరు ‘క్రస్ట్ అండ్ కోర్’. దక్షిణ కోల్‌కతాలోని ‘చేట్ల’ ప్రాంతంలో ఉంటుంది. ఏమిటి దాని విశేషం? మానసిక సమస్యల నుంచి బయటపడిన ఏ ఆధారం లేని స్త్రీలు అక్కడ పని చేస్తారు. ఇలా వారి కోసమే నడిచే బేకరి దేశంలో ఇదే కావచ్చు. మానసిక హింస భౌతిక హింసలో గాయం అయితే మందు రాస్తే తగ్గిపోవచ్చు. కాని మానసిక హింస తాలూకు దుష్ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. అవి క్రమేపి మానసిక రుగ్మతలుగా మారతాయి. వాటికి వైద్యం చేయించుకోవాలని చాలామంది మహిళలకు తెలియదు. ఒకవేళ తెలిసినా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకువెళతారు కాని సైకియాట్రిస్ట్‌ల దగ్గరకు వెళ్లరు. చివరకు ఆ రుగ్మతలు ముదిరిపోతాయి. ఏమీ తెలియని స్థితిలో ఇళ్ల నుంచి బయటపడి సమాజం దృష్టిలో ‘పిచ్చివాళ్లు’ అన్న ముద్ర పడి తిరుగుతుంటారు. ఇలా తిరిగే స్త్రీల కోసం కోలకతాలో ‘ఈశ్వర సంకల్ప’ అనే ఎన్.జి.ఓ పని చేస్తోంది. వీళ్లు ‘సర్బరి షెల్టర్’ అనే ఒక హోమ్‌ను నడుపుతున్నారు. ఇందులో అచ్చంగా మానసిక సమస్యలతో రోడ్ల మీద తిరిగే స్త్రీలను తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తారు. వీరికి వైద్యం చేయించి బేకింగ్‌లో శిక్షణ ఇచ్చి ఈ బేకరిలో ఉపాధి కల్పిస్తున్నారు. 2018లో ఇలా మానసిక సమస్యల నుంచి బయటపడిన స్త్రీల కోసం ‘క్రస్ట్ అండ్ కోర్’ బేకరినీ తయారు చేశారు. గత మూడేళ్లుగా ఈ బేకరి విజయవంతంగా నడుస్తూ ఉంది. గృహహింసతో మానసిక సమస్యలు ‘సర్బరి షెల్టర్’లో ఆశ్రయం పొంది బేకరిలో పని చేస్తున్న మహిళలందరూ దారుణమైన గృహహింసకు పాల్పడిన వారే. భర్త, అత్తింటివారు పదేపదే భౌతికదాడికి పాల్పడటం, మానసికంగా భయభ్రాంతం చేయడం వల్ల అదీ ఒకరోజు రెండు రోజులు కాదు మూడునాలుగేళ్లు వరుసగా చేయడం వల్ల మతి చలించి ముఖ్యంగా ‘స్క్రిజోఫోబియా’ బారిన పడి ఇళ్లు వదిలినవాళ్లే అంతా. వీరు చాలారోజులు రైల్వేస్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ చివరకు ఈ హోమ్‌కు పోలీసుల ద్వారా చేరుతారు. ‘వాళ్లకు ఒక్కొక్కరికి సంవత్సరం నుంచి రెండేళ్ల పాటు వైద్యం చేయిస్తాం. అప్పుడు నార్మల్ అవుతారు. ఆ తర్వాత కూడా మందులు తప్పనిసరిగా కొనసాగిస్తూ పని చేసుకోవాల్సి ఉంటుంది’ అని హోమ్ నిర్వాహకులు చెప్పారు. కొత్త జీవితం ‘నేను బిస్కెట్లు బాగా చేస్తాను. కేక్‌లు అవీ చేయడం రాదు’ అని ఈ కేఫ్‌లో పని చేసే ఒక మహిళ చెప్పింది. ‘నేను కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను. నాదంటూ ఒక ఇల్లు ఉండాలి’ అందామె. మిగిలిన వారిలో ముంబై నుంచి తప్పిపోయి వచ్చినవారు, అస్సాం వైపు నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీరి వయసులో 26 నుంచి 45 వరకూ ఉన్నాయి. ‘మీ కేఫ్‌లో ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి’ అనే చిన్న మాటకు వాళ్లు చాలా బ్రైట్‌గా నవ్వుతారు. ఆ చిన్న ప్రశంస వారికి పెద్ద ఆరోగ్యహేతువుతో సమానం. ‘మానసిక సమస్యల నుంచి బయటపడిన వారు కొంత బెరుకుగా, ఎదుటివారి మీద ఆధారపడేలా ఉంటారు. వీరిని సమాజం కలుపుకుని మద్దతు ఇవ్వకపోతే తమలో తాము ముడుచుకుపోతారు. నలుగురిలో కలవడానికే భయపడిపోతారు. కేఫ్ పెట్టడం ద్వారా వీరు నలుగురినీ కలిసేలా చేసి వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాం’ అని కేఫ్‌లో సూపర్వైజర్గా పని చేసే మహిళ చెప్పారు. ఈ సూపర్వైజర్ మాత్రం ‘నార్మల్’ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ. ఈమె తనతో పని చేసే ఈ మహిళలను కనిపెట్టుకుని ఉంటుంది. ఈ కేఫ్‌కు వెళితే బయట ‘మేము ప్రతికూలతలను జయించాం. మేము చాంపియన్స్’ అని ఉంటుంది. నిజమే. వారు చాంపియన్స్ మనసు చీకటి గుయ్యారాల్లో జారి పడిపోయినా తిరిగి వెలుతురు వెతుక్కుంటూ దానిని దారికి తెచ్చుకున్నారు. సమస్యలు, సవాళ్లు తద్వారా మానసిక బలహీనత ఎవరికైనా సహజం. దానికి వైద్యం తీసుకోవాలి. స్నేహితుల సపోర్ట్ తీసుకోవాలి. అన్నింటిని దాటి కొత్త జీవితం మొదలెట్టాలి. క్రస్ట్ అండ్ కోర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. – సాక్షి ఫ్యామిలీ -
స్కూల్లో బాలిక ఆత్మ'హత్య'?
కోల్‌కతా రాణికుతి ప్రాంతంలోని ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక శుక్రవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. స్కూల్ వాష్‌రూమ్‌లో పడి ఉన్న ఆ బాలిక మొహం చుట్టూ ప్లాస్టిక్ కవర్ చుట్టి ఉంది. ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాలిక ఎడమ మణికట్టు దగ్గర చిన్న గాయాలు ఉన్నాయని, అయితే ఆ గాయాల కారణంగా బాలిక మృతి చెందలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాష్‌రూమ్‌లో బాలిక మృతదేహానికి దగ్గరలో కొన్ని పేజీల నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నోట్లో ‘మూడు నెలల నుంచి సదరు బాలిక నిద్రపోలేనంత ఒత్తిడికి గురైందని’ ఉంది. అయితే బాలిక తన క్లాస్‌లో టాపర్ అని, చదువులో ముందుండేదని, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి వెళ్లడానికి ఆసక్తి కనబర్చేదని తెలిసింది. మృతిచెందిన బాలికది ఆత్మహత్యానా? లేక హత్యనా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకొన్ప ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. స్కూల్ సీసీటీవి ఫుటేజిని చెక్ చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
అనుమానంతో అపార్ట్మెంట్లో రచ్చ..70కార్లు ధ్వంసం
కోల్‌కతా: అకారణంగా అనుమానంతో దక్షిణ కోల్‌కతాలో కొందరు వ్యక్తులు నానా భీభత్సం చేశారు. దాదాపు 70 కార్లను ధ్వంసం చేశారు. అపార్ట్మెంట్ అద్దాలు పగులగొట్టారు. ఓ యువకుడు చనిపోవడానికి ఆ అపార్ట్ మెంట్ లోని వ్యక్తే కారణం అని అనుమానంతో ఈ రచ్చ సృష్టించారు. ఆదివారం తెల్లవారు జామున హజ్రా ఏరియాలో 2.55గంటల ప్రాంతంలో స్కూటీపై వెళుతున్న ముగ్గురు యువకులను ఓ మెర్సిడీస్ కారు ఢీకొట్టింది. వారిని ఆస్పత్రిలో చేర్పించగా అందులో 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఓ వందమంది అక్కడే ఉన్న ఓయాసిస్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వద్దకు వెళ్లారు. కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అందులోనే ఉన్నాడని అనుమానించి అతడిని బయటకు పిలవాలని కేకలు పెడుతూ ఇటుకలు, రాళ్లు కర్రలతో దాడులు చేశారు. 70 కార్లను ధ్వంసం చేశారు. పలు ఇళ్ల అద్దాలు పగులగొట్టారు. ఇదేమిటని ప్రశ్నించినవారిపై చేయిచేసుకున్నారు. అయితే, చివరకు కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఆ అపార్ట్‌మెంట్‌కు చెందినవాడు కాదని తెలిసింది. కొన్ని కార్లపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించారట. ఆ సమయానికి పోలీసులు రావడంతో మరింత విధ్వంసం చోటుచేసుకోకుండా అడ్డుకోగలిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రచ్చ కొనసాగింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రణబ్ ముఖర్జీ ఓటేయరా?
దేశంలో అందరినీ ఓటేయమంటోంది ప్రభుత్వం. కానీ దేశ రాష్ట్రపతి ఓటేస్తారా వేయరా? ఈ సందేహం అందరికీ రావచ్చు. కానీ మన దేశంలో రాష్ట్రపతి ఇప్పటి వరకూ ఓటేయలేదు. ఎందుకంటే రాష్ట్రపతికి రాజకీయం ఉండదు. పార్టీ ఉండకూడదు. అందుకే తాము నిస్పక్షపాతంగా ఉంటున్నామని చెప్పేందుకే రాష్ట్రపతి ఇప్పటి వరకూ ఓటేయలేదు. అయితే ఈ సారి ఎలాగైనా ఓటేద్దామనుకున్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఓటు బెంగాల్ లోని సౌత్ కోల్ కతా నియోజకవర్గంలోని రాస్ బిహారీ పోలింగ్ బూత్ లో ఉంది. అక్కడ మే 12 న పోలింగ్ ఉంది. దక్షిణ కోల్ కతాలో కాంగ్రెస్ తరఫున మాలా రాయ్, తృణమూల్ తరఫున సిట్టింగ్ ఎంపీ సుబ్రత బాగ్చీ, సీపీఎం తరఫున నందినీ ముఖర్జీ, బిజెపి తరఫున తథాగత రాయ్ లు పోటీలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి ఆయన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేశారు. అయితే ఆఖరి నిమిషంలో ఆయన ఓటేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ పదముగ్గురు రాష్ట్రపతులు చేసినట్టే ఆయన కూడా నిస్పాక్షికంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.