ప్రణబ్ ముఖర్జీ ఓటేయరా?
దేశంలో అందరినీ ఓటేయమంటోంది ప్రభుత్వం. కానీ దేశ రాష్ట్రపతి ఓటేస్తారా వేయరా? ఈ సందేహం అందరికీ రావచ్చు. కానీ మన దేశంలో రాష్ట్రపతి ఇప్పటి వరకూ ఓటేయలేదు. ఎందుకంటే రాష్ట్రపతికి రాజకీయం ఉండదు. పార్టీ ఉండకూడదు. అందుకే తాము నిస్పక్షపాతంగా ఉంటున్నామని చెప్పేందుకే రాష్ట్రపతి ఇప్పటి వరకూ ఓటేయలేదు.
అయితే ఈ సారి ఎలాగైనా ఓటేద్దామనుకున్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఓటు బెంగాల్ లోని సౌత్ కోల్ కతా నియోజకవర్గంలోని రాస్ బిహారీ పోలింగ్ బూత్ లో ఉంది. అక్కడ మే 12 న పోలింగ్ ఉంది. దక్షిణ కోల్ కతాలో కాంగ్రెస్ తరఫున మాలా రాయ్, తృణమూల్ తరఫున సిట్టింగ్ ఎంపీ సుబ్రత బాగ్చీ, సీపీఎం తరఫున నందినీ ముఖర్జీ, బిజెపి తరఫున తథాగత రాయ్ లు పోటీలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి ఆయన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేశారు. అయితే ఆఖరి నిమిషంలో ఆయన ఓటేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ పదముగ్గురు రాష్ట్రపతులు చేసినట్టే ఆయన కూడా నిస్పాక్షికంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.