పోస్టల్ బ్యాలెట్‌లో రాష్ట్రపతి ఓటు!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సంప్రదాయానికి భిన్నంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న తొలి రాష్ట్రపతిగా ఆయన నిలవనున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రపతులుగా పనిచేసిన 13 మంది నేతలు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పోలింగ్ కేంద్రంలోనో లేక నిర్మాణ్ భవన్‌లోనో ఓటు హక్కు వినియోగించుకోగా ప్రణబ్ మాత్రం తన ఓటు దక్షిణ కోల్‌కతా లోక్‌సభ స్థానం పరిధిలోని 160, రాష్‌బిహారీలో ఉండటంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే ఆయన పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తును పూరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నియోజకవర్గానికి వెళ్లి ఓటేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలంటూ అధికార యంత్రాంగంపై ఒత్తిడి తేవ డం ఇష్టం లేకనే ప్రణబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించా యి. దక్షిణ కోల్‌కతా స్థానానికి మే 12న పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో బహుముఖ పోటీ నెలకొంది.