వనం దుర్గాప్రసాద్ : ఉపాధ్యాయ ఓటర్లను సానుకూలంగా మార్చుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఆయా అనుబంధ సంఘాలతో సంప్రదింపులు చేస్తున్నాయి. పరోక్ష సహకారం అందించాలని కోరుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ నేత హైదరాబాద్‌లో ఓ ఉపాధ్యాయ సంఘం నేతలకు పెద్దఎత్తున విందు ఏర్పాటు చేయడం వివాదమైంది.
ఈ విందు సందర్భంగా జిల్లాలవారీగా సంఘ నేతలను పరోక్ష ప్రచారంలోకి దించాలని నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఇదే మాదిరి ఇప్పుడు ఇతర పార్టీలూ తమ అనుబంధ సంఘాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నాయి. ఉపాధ్యాయ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఏయే హామీలివ్వాలనే దిశగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. ఇందులో 80 వేల మంది వరకూ ఎన్నికల విధుల్లో ఉంటారు. వీళ్లంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగిస్తారు. ఉపాధ్యాయ కుటుంబాల నుంచి దాదాపు 4 లక్షల ఓట్లు ఉంటాయి. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలున్నాయి.
ఓడీల తాయిలం...
ఉపాధ్యాయ సంఘాలు కొన్నేళ్లుగా ఆన్ డ్యూటీ కోసం పోరాడుతున్నాయి. గత ఏడాది ఏకంగా 14 సంఘాలకు ప్రభుత్వం ఓడీ ఇచ్చింది. కానీ గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయ్యింది. అప్పట్నుంచీ దీన్ని పొడిగించకపోవడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నికల సందర్భంగా నేతల వద్ద కూడా ఇదే అంశాన్ని ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు.
సంఘాల నేతలకు ఓడీ ఇస్తామన్న భరోసా ఉండాలని అన్ని సంఘాలు పార్టీలను కోరుతున్నాయి. ఓడీ ఇవ్వడం ద్వారా టీచర్ల సంఘ నేతలు విధులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎన్నికల ముందు కేవలం ఒకేఒక సంఘానికి ఓడీ లభించడం కూడా ఉపాధ్యాయ సంఘాల మధ్య భిన్న ధోరణికి కారణమైంది. ఓడీ ఇచ్చిన సంఘానికి వ్యతిరేకంగా ఓడీ రాని సంఘాలు ఏకమవ్వడాన్ని వివిధ పార్టీలు గుర్తిస్తున్నాయి. వీరిని సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
బదిలీలు, పదోన్నతులూ కీలకమే..
దీర్ఘకాలంగా బదిలీలు, పదోన్నతులపై టీచర్లు ఆశలు పెట్టుకున్నారు. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా 317 జీఓ అమలు చేశారు. ఇది కూడా కొంతమంది ఉపాధ్యాయుల్లో అసంతృప్తి కలిగించింది. సాధారణ బదిలీల్లో కొన్ని మార్పులుంటాయని టీచర్లు ఆశించారు. కానీ 2022లో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం భావించినా, కోర్టు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది.
ఈలోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. దీంతో బదిలీలు, పదోన్నతులపై పార్టీలు స్పష్టత ఇవ్వాలని మెజారిటీ టీచర్లు కోరుతున్నారు. దీన్ని గుర్తించిన పార్టీలు ఆ దిశగా అడుగులేసేందుకు సిద్ధపడుతున్నాయి. వీలైతే ఎన్నికల ప్రచారంలో ఎక్కడో చోట దీన్ని ప్రస్తావించి, టీచర్ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. దీంతో పాటు ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల నియామకంపై కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావన వచ్చే అవకాశముంది.
విందు, వినోద రాజకీయాలు మాతో వద్దు
టీచర్లకయినా వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. ఇదేమీ తప్పుకాదు. కానీ విధి నిర్వహణపై ప్రభావం చూపకూడదు. ఎన్నికలవేళ రాజకీయ పార్టీల విందులు, వినోదాలకు వెళ్లే చిల్లర రాజకీయాలు ఆమోదయోగ్యం కాదు. నాయకులే కాదు..ఓటర్లనూ ఇది ప్రలోభ పెట్టే చర్యగానే చూడాలి. ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడి పవిత్రతను అందరూ కాపాడాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వృత్తి గౌరవమే ముఖ్యం
ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వ్యక్తి. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘ నేతలూ గుర్తించాలి. ఓట్ల ప్రలోభాలకు టీచర్లను లక్ష్యంగా చేయొద్దు. ఉపాధ్యాయూలూ దీనికి దూరంగా ఉండాలి. వృత్తి గౌరవాన్ని భంగపరిచే చర్యలకు పాల్పడొద్దు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత సంఘ నేతలకు ఉంది. –సయ్యద్ షౌకత్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment