ఎన్టీఆర్, సాక్షి: సొంత ఊళ్లకు వెళ్లి ఓట్లేసిన ఏపీ ఓటర్లు.. తిరిగి తెలంగాణ బాట పట్టారు. దీంతో హైదరాబాద్ వచ్చే రహదారుల్లో వాహనాల రద్దీ నెలకొంది. సోమవారం సాయంత్రం ఉదయం నుంచే ఇది మొదలుకాగా.. మంగళవారం ఉదయానికి అది మరింతగా పెరిగింది.
ఆంధ్రా నుంచి పెద్ద ఎత్తున్న ఓటర్లు తిరిగి తెలంగాణకు వస్తున్నారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. పతంగి టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు ఒక అంచనా.
ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్‌గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. అయితే.. సోమవారం మాత్రం సాయంత్రం 6.30 గంటలకు వీటి సంఖ్య 35 వేలకు పైగా చేరింది. ఈ ఉదయం ఆ రద్దీ అంతకంతకు పెరుగుతోంది.
ఇక.. ఏపీలో పోలింగ్ కోసం ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటేశారు. సాయంత్రం సైతం క్యూ లైన్లలో చాలామంది వేచి ఉండడం గమనార్హం. ఏపీలో భారీగా పోలింగ్ జరిగిందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించగా, కడపటి వార్తలు అందేసరికి అది 78.36 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం ఇంకా ఎక్కువే నమోదు కావొచ్చని సీఈవో ఎంకే మీనా ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment