2016 ఎన్నికల్లో స్వయంగా మెయిల్ ఇన్ విధానంలో ఓటు వేశారు ఈ సారి మెయిల్ ఇన్ అంటే మోసాలకు చిరునామా అంటున్నారు పోస్టల్ బ్యాలెట్‌కి నిధులు ఆపేశారు, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్‌ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? ఈ పద్ధతి ద్వారా అవకతవకలు జరిగే అవకాశం ఉందా ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు కోవిడ్–19 చుట్టూ తిరుగుతున్నాయి. 62 లక్షల కేసులు, 2 లక్షలకు చేరువలో మృతులతో అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా భయంతో నవంబర్ 3 నాటి అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ బూత్‌లకి వెళ్లకుండా మెయిల్ ఇన్ ఓటింగ్ (పోస్టల్ బ్యాలెట్) ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈ పద్ధతిలో ఎన్నికల అధికారులు రిజిస్టర్డ్ ఓటర్లకు బ్యాలెట్ పేపర్లను అందిస్తారు.
సదరు ఓటరు దానిని నింపి తిరిగి అధికారులకి పంపించడం ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికల్లో విదేశీ జోక్యం పెరిగిపోతుందని, రిగ్గింగ్‌కి అవకాశం ఉంటుందని, అక్రమాలతో దేశం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఈసాకుతో ఎన్నికలు వాయిదా వేయాలని చూశారు కానీ కుదరకపోవడంతో పోస్టల్ బ్యాలెట్‌కు అవసరమయ్యే నిధుల విడుదల నిలిపవేశారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కి అత్యవసరంగా 2,500 కోట్ల డాలర్లు కేటాయించాలంటూ డెమోక్రాట్లు పెట్టిన బిల్లుని కాంగ్రెస్‌లో ట్రంప్ అడ్డుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 24% మంది మెయిల్ ఇన్ ఓట్లు వేస్తే, ఈసారి 64% మంది వరకు ఈ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలున్నాయి. మెయిల్ ఓన్ ఓట్లు పెరిగే కొద్దీ డెమోక్రటిక్ పార్టీ్టకే ప్రయోజనమనే అంచనాలున్నాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో చతికిలబడిపోయి, ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టలేక చేతులెత్తేసిన ట్రంప్ ప్రçస్తుతం ఎన్నికల సర్వేల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కంటే వెనుకబడి ఉన్నారు. అందుకే తన ఓటమికి దారి తీసే ఏ చిన్న అవకాశాన్నయినా గట్టిగా ఎదుర్కోవడానికే ట్రంప్ పోస్టల్ బ్యాలెట్‌ను వ్యతిరేకిస్తున్నారనే విశ్లేషణలున్నాయి.
అవకతవకలకు ఆస్కారం లేదు
మెయిల్ ఇన్ ఓటింగ్ విధానం ద్వారా అవకతవకలు జరగడానికి ఆస్కారమే లేదని ఎన్నికల విశ్లేషకుడు రిచర్డ్ ఎల్ హసన్ అంటున్నారు. బ్రెన్నన్ సెంటర్ ఫర్ జస్టిస్ 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం మెయిల్ ఇన్ ఓటింగ్‌లో పొరపాట్లకు ఆస్కారం 0.00004% నుంచి 0.00009% మాత్రమే ఉంటుందని తేలింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోస్టల్ ఓటింగ్ తప్పుడు కేసు కేవలం ఒక్కటే నిర్ధారణ అయింది. అయితే, పోస్టల్ బ్యాలెట్‌తో ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. న్యూయార్క్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో సాధారణంగా నమోదయ్యే మెయిల్ ఇన్ ఓట్ల కంటే 10 రెట్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో ఫలితాల వెల్లడికి వారాల సమయం పట్టింది. ప్రతీ అయిదు ఓట్లలో ఒకటి చెల్లుబాటు కావడం లేదని అధికారులంటున్నారు. ఓటు ముద్ర సరిగ్గా వేయకపోవడం, ఓటర్లు సంతకం పెట్టకపోవడం వంటివి జరిగాయని తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్‌కి 6 రాష్ట్రాలు సై
కరోనా ఉధృతరూపం దాలుస్తున్న నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల దగ్గర జన సందోహా న్ని నివారించడానికి ఇప్పటికే కాలిఫోర్నియా, ఉటా, హవాయి, కొలరాడో, ఒరెగాన్, వాషిం గ్టన్ రాష్ట్రాలు మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్నే అనుసరిస్తామని స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే అత్యంత సురక్షితమని సగానికిపైగా రాష్ట్రాలు భావిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు వెయ్యాలంటే కచ్చితమైన కారణం చెప్పాలి. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో కదల్లేని స్థితిలో ఉంటేనే వీరికి అనుమతి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment