అనుమానంతో అపార్ట్మెంట్లో రచ్చ..70కార్లు ధ్వంసం
కోల్కతా: అకారణంగా అనుమానంతో దక్షిణ కోల్కతాలో కొందరు వ్యక్తులు నానా భీభత్సం చేశారు. దాదాపు 70 కార్లను ధ్వంసం చేశారు. అపార్ట్మెంట్ అద్దాలు పగులగొట్టారు. ఓ యువకుడు చనిపోవడానికి ఆ అపార్ట్ మెంట్ లోని వ్యక్తే కారణం అని అనుమానంతో ఈ రచ్చ సృష్టించారు. ఆదివారం తెల్లవారు జామున హజ్రా ఏరియాలో 2.55గంటల ప్రాంతంలో స్కూటీపై వెళుతున్న ముగ్గురు యువకులను ఓ మెర్సిడీస్ కారు ఢీకొట్టింది. వారిని ఆస్పత్రిలో చేర్పించగా అందులో 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఓ వందమంది అక్కడే ఉన్న ఓయాసిస్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వద్దకు వెళ్లారు.
కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అందులోనే ఉన్నాడని అనుమానించి అతడిని బయటకు పిలవాలని కేకలు పెడుతూ ఇటుకలు, రాళ్లు కర్రలతో దాడులు చేశారు. 70 కార్లను ధ్వంసం చేశారు. పలు ఇళ్ల అద్దాలు పగులగొట్టారు. ఇదేమిటని ప్రశ్నించినవారిపై చేయిచేసుకున్నారు. అయితే, చివరకు కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఆ అపార్ట్మెంట్కు చెందినవాడు కాదని తెలిసింది. కొన్ని కార్లపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించారట. ఆ సమయానికి పోలీసులు రావడంతో మరింత విధ్వంసం చోటుచేసుకోకుండా అడ్డుకోగలిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రచ్చ కొనసాగింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.