శరీర దుర్వాసనతో...
కొందరికి కొద్దిపాటి ఎండలోకి వెళ్లినా చాలు, చెమటలు పట్టేస్తాయి. ఇలా అయితే పర్లేదు. కానీ శరీరం నుంచి దుర్వాసన వచ్చేస్తుంది. దాంతో మిగతావాళ్లు ఇలాంటి దుర్వాసన వచ్చే వారి నుంచి దూరంగా ఉంటుంటారు. పక్కవాళ్లు భరించలేనంత దుర్వాసన వస్తుండేవాళ్లు సామాజికంగా న్యూనతకు గురవుతారు. దాంతో అనేక ఇతర మానసిక సమస్యలకూ లోనవుతుంటారు. శరీరం నుంచి ఇలా దుర్వాసన రావడానికి కారణాలూ, ఆ సమస్యకు పరిష్కారాలను ఒకసారి పరిశీలిద్దాం.
డర్టీ స్మెల్ కీప్స్ ఫ్రెండ్స్ ఎ మైల్ ఎవే!
ఆహారం వల్ల... రోజూ తినే ఆహారంలో వేపుళ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, కొన్ని రకాల ఆకుకూరలు, కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
శరీరం నుంచి దుర్వాసన వెలువడటాన్ని వైద్య పరిభాషలో ‘బ్రామ్‌హిడరోసిస్’ అంటారు. చర్మంపై ఉండే చెమట గ్రంథుల నుంచి చెమట వెలువడుతుంది. చాలామంది చెమట నుంచే ఈ దుర్వాసన వస్తుందని అనుకుంటారు. కానీ చెమటలో ఎలాంటి దుర్వాసనా ఉండదు. మరి అలాంటప్పుడు చెమట పట్టినవారి నుంచి దుర్వాసన ఎందుకు వస్తుందో పరిశీలిద్దాం. మానవ శరీరంపై చెమటలనే స్రవించే గ్రంథులు రెండు రకాలుగా ఉంటాయి. అవి...
ఎక్రైన్ గ్లాండ్స్ : ఇవి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకూ అందరిలోనూ ఉంటాయి. మన జన్యుస్వభావాన్ని అనుసరించి శరీరంపై అంతటా వ్యాపించి ఉంటాయి. ముఖ్యంగా అరచేతులు, అరికాళ్లలో మరీ ఎక్కువగా ఉంటాయి. బయటి వాతావరణం వేడెక్కినప్పుడు వీటి నుంచి చెమట స్రవిస్తుంది. ఈ చెమట గాలి వీచినప్పుడు శరీరంలోని వేడిని గ్రహించి ఆ గాలికి ఆవిరైపోతుంది. అంటే ఆవిరయ్యే ప్రక్రియలో చెమట శరీరం నుంచి కొంతమేర వేడిమి గ్రహిస్తుంది.
కాబట్టి ఏమేరకు వేడిని తీసుకుంటుందో ఆ మేరకు శరీరం చల్లబడుతుంది. శరీర ఉష్ణోగ్రత బయట ఉన్న వాతావరణానికి వేడెక్కిపోకుండా, ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత (98.4 డిగ్రీల ఫారెన్‌హీట్) వద్ద స్థిరంగా ఉండేలా చేసేందుకు ప్రకృతి చేసిన ఏర్పాటిది. అందుకే చల్లని గాలి వీచినప్పుడు శరీరం చల్లబడి హాయిగా అనిపిస్తుంది.
అపోక్రైన్ గ్లాండ్స్: ఈ అపోక్రైన్ గ్లాండ్స్ అనేవి చిన్నప్పటి నుంచీ ఉండవు. యుక్తవయసు వచ్చాక ఇవి బాహుమూలాలతోపాటు శరీరంలోని మరికొన్ని ఇతర ప్రాంతాల్లోనూ పెరుగుతాయి. ఇవి ఆ ప్రాంతంలో ఉండే వెంట్రుకలు అంకురించే ప్రదేశంలో ఉండి, చెమటను స్రవిస్తుంటాయి. అందుకే యుక్తవయసులో ఉన్నవారికి బాహుమూలాలతో పాటు కొందరిలో ప్రైవేట్‌పార్ట్స్ వద్ద చెమటలు స్రవిస్తాయి.
దుర్వాసనకు కారణమయ్యే ఇతర అంశాలు...
చెమట గ్రంథులు శరీరంపై వ్యాపించే తీరు తల్లిదండ్రుల జన్యువుల నుంచి పిల్లలకు వస్తుంది. అందుకే తల్లి లేదా తండ్రి... వీరిలో ఎవరికైనా శరీరం నుంచి దుర్వాసన వచ్చే సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువ.
ఇక స్థూలకాయంతో ఉన్నవారు, ఇతర చర్మ సమస్యలు / ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి దుర్వాసన సమస్య అధికం. ముఖ్యంగా ఇంటెర్‌ట్రిగో, ట్రైకోమైసోసిస్ ఆగ్జిలరీస్, ఎరిత్మా సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య మరీ ఎక్కువ.
ఇక దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం, గౌట్, మూత్రపిండాలు, కాలేయం సమస్యలు, టైఫాయిడ్ ఉన్నవారి నుంచి కూడా చెడువాసన వస్తుంటుంది. అలాగే శుభ్రత విషయంలో బద్ధకంగా ఉండేవారిలోనూ, మద్యం సేవించేవారి దగ్గర్నుంచి, పెన్సిలిన్, బ్రోమైడ్స్ వంటి మందుల వాడకం వల్ల కూడా మేని నుంచి దుర్గంధం వెలువడటం అనే సమస్య తలెత్తవచ్చు.
చెమటకు వాసన లేకపోయినా... ఎందుకీ దుర్వాసన?
ఉక్కగా ఉన్నప్పుడు సాధారణంగా ఎవరికైనా చెమట ఎక్కువగా పడుతుంది. అదే యుక్తవయస్కుల్లో, మధ్యవయస్కుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యుక్తవయస్కులైప్పటి నుంచీ అటు ఎక్రైన్ గ్రంథులు, ఇటు అపోక్రైన్ గ్రంథులు ఈ రెండూ పనిచేస్తుండటం వల్ల చెమటలు ఎక్కువగా పడతాయన్నమాట.
దాంతో యుక్తవయస్కులు, పెద్దవయసు వారి చెమటలలో దుర్వాసన కలిగించే ప్రాపినీ బ్యాక్ట్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. చెమటలు ఎంతగా పడుతుంటే ఈ ప్రాపినీ బ్యాక్టీరియా అంతగా వృద్ధిచెందుతుంటాయి. అందుకే పిల్లల కంటే పెద్దల వద్దనే చెమట పట్టగానే వాసన రావడం ఎక్కువ.
దుర్వాసన తొలగించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేయడం బాహుమూలాలను సబ్బుతో శుభ్రపరుచుకోవడం చెమట అధికంగా పట్టే ప్రదేశాలను పొడిగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి తొడుక్కునే దుస్తులు చెమటను పీల్చుకునేవి, శుభ్రమైనవి, పొడిగా ఉండాలి బాక్టీరియా సంఖ్యను తగ్గించేది, చర్మతత్వానికి సరిపడే డియోడరెంట్స్ వాడాలి వాసనకు కారణమయ్యే బాహుమూలాల్లోని వెంట్రుకలను తొలగించుకోవాలి.
యాంటీసెప్టిక్ సబ్బులను స్నానానికి ఉపయోగించాలి తాజా ఆహారం తీసుకోవడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే దుర్వాసన సమస్యే కాకుండా, ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
శరీరానికి పూసే లేపనాలతో...
సాధారణంగా చెమటలు పట్టేవారు యాంటీపెర్‌స్పిరెంట్స్, డియోడరెంట్స్ అనే శరీరానికి పూసే లేపనాలతో తమ శరీర దుర్వాసనను తగ్గించుకుంటుంటారు. యాంటీ పెర్‌స్పిరెంట్స్ అన్నవి పేరును బట్టి చెమట పట్టడాన్ని తగ్గించవు. ఇందులో అల్యూమినియమ్ క్లోరోహైడ్రేట్, అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియమ్ ఫీనాల్ సల్ఫొనేట్, అల్యూమినియమ్ సల్ఫేట్, జిర్కోనియమ్ క్లోరో హైడ్రేట్స్ వంటి లవణాలు ఉంటాయి.
ఇవి చెమటగ్రంథి ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేసి, చెమట తక్కువగా పట్టేలా చేస్తాయి. వాటి ప్రభావం తగ్గాక మళ్లీ చెమటపడుతుంది. ఇలా తాత్కాలికంగా చెమటగ్రంథిని మూసేస్తుంది కాబట్టి దీన్ని యాంటీపెర్‌స్పిరెంట్స్ అంటారు.
ఎలా వాడాలి...?
యాంటీపెర్‌స్పిరెంట్స్‌ను రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, స్నానం చేశాక, ఒంటిని పొడిగా తుడుచుకున్న తర్వాత వాడాలి. ఎందుకంటే ఆ సమయంలో చెమట తక్కువగా ఉంటుంది. కాబట్టి చెమటగ్రంథులు వాటిని ఎక్కువగా గ్రహిస్తాయి. మళ్లీ పొద్దున్నే యాంటీపెర్‌స్పిరెంట్స్‌ను కడిగేసుకోవాలి.
ఇలా ఓ 15 రోజులు చేయాలి. ఆ తర్వాత రోజు విడిచి రోజు చొప్పున మరో నెలరోజులు వాడాలి. యాంటీ పెర్‌స్పిరెంట్స్‌ను నోరు, ముక్కు, కనురెప్పలు, మర్మావయవాల వద్ద అస్సలు వాడకూడదు. బాహుమూలాల్లోనూ అక్కడి రోమాలు తొలగించిన రోజున అస్సలు ఉపయోగించవద్దు.
* డియోడరెంట్స్‌ను రోజూ పొద్దున్నే స్నానం చేశాక బయటికి వెళ్లే ముందు శరీరంపై రాసుకోవాలి.
ఆర్. రాధిక, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్,
కాస్మటాలజిస్ట్, డెర్మటోసర్జన్,
నేషనల్ స్కిన్ సెంటర్, సికింద్రాబాద్
ఫ్రెండ్స్ దూరమవుతున్నారా?
Published Mon, Jun 1 2015 12:05 AM | Last Updated on Wed, Apr 3 2019 5:34 PM
Advertisement