Consultant Dermatologist
-
ఫ్రెండ్స్ దూరమవుతున్నారా?
శరీర దుర్వాసనతో... కొందరికి కొద్దిపాటి ఎండలోకి వెళ్లినా చాలు, చెమటలు పట్టేస్తాయి. ఇలా అయితే పర్లేదు. కానీ శరీరం నుంచి దుర్వాసన వచ్చేస్తుంది. దాంతో మిగతావాళ్లు ఇలాంటి దుర్వాసన వచ్చే వారి నుంచి దూరంగా ఉంటుంటారు. పక్కవాళ్లు భరించలేనంత దుర్వాసన వస్తుండేవాళ్లు సామాజికంగా న్యూనతకు గురవుతారు. దాంతో అనేక ఇతర మానసిక సమస్యలకూ లోనవుతుంటారు. శరీరం నుంచి ఇలా దుర్వాసన రావడానికి కారణాలూ, ఆ సమస్యకు పరిష్కారాలను ఒకసారి పరిశీలిద్దాం. డర్టీ స్మెల్ కీప్స్ ఫ్రెండ్స్ ఎ మైల్ ఎవే! ఆహారం వల్ల... రోజూ తినే ఆహారంలో వేపుళ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, కొన్ని రకాల ఆకుకూరలు, కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. శరీరం నుంచి దుర్వాసన వెలువడటాన్ని వైద్య పరిభాషలో ‘బ్రామ్‌హిడరోసిస్’ అంటారు. చర్మంపై ఉండే చెమట గ్రంథుల నుంచి చెమట వెలువడుతుంది. చాలామంది చెమట నుంచే ఈ దుర్వాసన వస్తుందని అనుకుంటారు. కానీ చెమటలో ఎలాంటి దుర్వాసనా ఉండదు. మరి అలాంటప్పుడు చెమట పట్టినవారి నుంచి దుర్వాసన ఎందుకు వస్తుందో పరిశీలిద్దాం. మానవ శరీరంపై చెమటలనే స్రవించే గ్రంథులు రెండు రకాలుగా ఉంటాయి. అవి... ఎక్రైన్ గ్లాండ్స్ : ఇవి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకూ అందరిలోనూ ఉంటాయి. మన జన్యుస్వభావాన్ని అనుసరించి శరీరంపై అంతటా వ్యాపించి ఉంటాయి. ముఖ్యంగా అరచేతులు, అరికాళ్లలో మరీ ఎక్కువగా ఉంటాయి. బయటి వాతావరణం వేడెక్కినప్పుడు వీటి నుంచి చెమట స్రవిస్తుంది. ఈ చెమట గాలి వీచినప్పుడు శరీరంలోని వేడిని గ్రహించి ఆ గాలికి ఆవిరైపోతుంది. అంటే ఆవిరయ్యే ప్రక్రియలో చెమట శరీరం నుంచి కొంతమేర వేడిమి గ్రహిస్తుంది. కాబట్టి ఏమేరకు వేడిని తీసుకుంటుందో ఆ మేరకు శరీరం చల్లబడుతుంది. శరీర ఉష్ణోగ్రత బయట ఉన్న వాతావరణానికి వేడెక్కిపోకుండా, ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత (98.4 డిగ్రీల ఫారెన్‌హీట్) వద్ద స్థిరంగా ఉండేలా చేసేందుకు ప్రకృతి చేసిన ఏర్పాటిది. అందుకే చల్లని గాలి వీచినప్పుడు శరీరం చల్లబడి హాయిగా అనిపిస్తుంది. అపోక్రైన్ గ్లాండ్స్: ఈ అపోక్రైన్ గ్లాండ్స్ అనేవి చిన్నప్పటి నుంచీ ఉండవు. యుక్తవయసు వచ్చాక ఇవి బాహుమూలాలతోపాటు శరీరంలోని మరికొన్ని ఇతర ప్రాంతాల్లోనూ పెరుగుతాయి. ఇవి ఆ ప్రాంతంలో ఉండే వెంట్రుకలు అంకురించే ప్రదేశంలో ఉండి, చెమటను స్రవిస్తుంటాయి. అందుకే యుక్తవయసులో ఉన్నవారికి బాహుమూలాలతో పాటు కొందరిలో ప్రైవేట్‌పార్ట్స్ వద్ద చెమటలు స్రవిస్తాయి. దుర్వాసనకు కారణమయ్యే ఇతర అంశాలు... చెమట గ్రంథులు శరీరంపై వ్యాపించే తీరు తల్లిదండ్రుల జన్యువుల నుంచి పిల్లలకు వస్తుంది. అందుకే తల్లి లేదా తండ్రి... వీరిలో ఎవరికైనా శరీరం నుంచి దుర్వాసన వచ్చే సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువ. ఇక స్థూలకాయంతో ఉన్నవారు, ఇతర చర్మ సమస్యలు / ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి దుర్వాసన సమస్య అధికం. ముఖ్యంగా ఇంటెర్ట్రిగో, ట్రైకోమైసోసిస్ ఆగ్జిలరీస్, ఎరిత్మా సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య మరీ ఎక్కువ. ఇక దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం, గౌట్, మూత్రపిండాలు, కాలేయం సమస్యలు, టైఫాయిడ్ ఉన్నవారి నుంచి కూడా చెడువాసన వస్తుంటుంది. అలాగే శుభ్రత విషయంలో బద్ధకంగా ఉండేవారిలోనూ, మద్యం సేవించేవారి దగ్గర్నుంచి, పెన్సిలిన్, బ్రోమైడ్స్ వంటి మందుల వాడకం వల్ల కూడా మేని నుంచి దుర్గంధం వెలువడటం అనే సమస్య తలెత్తవచ్చు. చెమటకు వాసన లేకపోయినా... ఎందుకీ దుర్వాసన? ఉక్కగా ఉన్నప్పుడు సాధారణంగా ఎవరికైనా చెమట ఎక్కువగా పడుతుంది. అదే యుక్తవయస్కుల్లో, మధ్యవయస్కుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యుక్తవయస్కులైప్పటి నుంచీ అటు ఎక్రైన్ గ్రంథులు, ఇటు అపోక్రైన్ గ్రంథులు ఈ రెండూ పనిచేస్తుండటం వల్ల చెమటలు ఎక్కువగా పడతాయన్నమాట. దాంతో యుక్తవయస్కులు, పెద్దవయసు వారి చెమటలలో దుర్వాసన కలిగించే ప్రాపినీ బ్యాక్ట్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. చెమటలు ఎంతగా పడుతుంటే ఈ ప్రాపినీ బ్యాక్టీరియా అంతగా వృద్ధిచెందుతుంటాయి. అందుకే పిల్లల కంటే పెద్దల వద్దనే చెమట పట్టగానే వాసన రావడం ఎక్కువ. దుర్వాసన తొలగించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేయడం బాహుమూలాలను సబ్బుతో శుభ్రపరుచుకోవడం చెమట అధికంగా పట్టే ప్రదేశాలను పొడిగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి తొడుక్కునే దుస్తులు చెమటను పీల్చుకునేవి, శుభ్రమైనవి, పొడిగా ఉండాలి బాక్టీరియా సంఖ్యను తగ్గించేది, చర్మతత్వానికి సరిపడే డియోడరెంట్స్ వాడాలి వాసనకు కారణమయ్యే బాహుమూలాల్లోని వెంట్రుకలను తొలగించుకోవాలి. యాంటీసెప్టిక్ సబ్బులను స్నానానికి ఉపయోగించాలి తాజా ఆహారం తీసుకోవడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే దుర్వాసన సమస్యే కాకుండా, ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. శరీరానికి పూసే లేపనాలతో... సాధారణంగా చెమటలు పట్టేవారు యాంటీపెర్స్పిరెంట్స్, డియోడరెంట్స్ అనే శరీరానికి పూసే లేపనాలతో తమ శరీర దుర్వాసనను తగ్గించుకుంటుంటారు. యాంటీ పెర్స్పిరెంట్స్ అన్నవి పేరును బట్టి చెమట పట్టడాన్ని తగ్గించవు. ఇందులో అల్యూమినియమ్ క్లోరోహైడ్రేట్, అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియమ్ ఫీనాల్ సల్ఫొనేట్, అల్యూమినియమ్ సల్ఫేట్, జిర్కోనియమ్ క్లోరో హైడ్రేట్స్ వంటి లవణాలు ఉంటాయి. ఇవి చెమటగ్రంథి ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేసి, చెమట తక్కువగా పట్టేలా చేస్తాయి. వాటి ప్రభావం తగ్గాక మళ్లీ చెమటపడుతుంది. ఇలా తాత్కాలికంగా చెమటగ్రంథిని మూసేస్తుంది కాబట్టి దీన్ని యాంటీపెర్స్పిరెంట్స్ అంటారు. ఎలా వాడాలి...? యాంటీపెర్స్పిరెంట్స్ను రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, స్నానం చేశాక, ఒంటిని పొడిగా తుడుచుకున్న తర్వాత వాడాలి. ఎందుకంటే ఆ సమయంలో చెమట తక్కువగా ఉంటుంది. కాబట్టి చెమటగ్రంథులు వాటిని ఎక్కువగా గ్రహిస్తాయి. మళ్లీ పొద్దున్నే యాంటీపెర్స్పిరెంట్స్ను కడిగేసుకోవాలి. ఇలా ఓ 15 రోజులు చేయాలి. ఆ తర్వాత రోజు విడిచి రోజు చొప్పున మరో నెలరోజులు వాడాలి. యాంటీ పెర్స్పిరెంట్స్ను నోరు, ముక్కు, కనురెప్పలు, మర్మావయవాల వద్ద అస్సలు వాడకూడదు. బాహుమూలాల్లోనూ అక్కడి రోమాలు తొలగించిన రోజున అస్సలు ఉపయోగించవద్దు. * డియోడరెంట్స్ను రోజూ పొద్దున్నే స్నానం చేశాక బయటికి వెళ్లే ముందు శరీరంపై రాసుకోవాలి. ఆర్. రాధిక, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మటాలజిస్ట్, డెర్మటోసర్జన్, నేషనల్ స్కిన్ సెంటర్, సికింద్రాబాద్ -
తలరంగు జాగ్రత్తలు : హెయిర్ డై... హౌ అండ్ వై!
యౌవనం చాలాకాలం పాలు అలా నిలిచి ఉండేలా చేయడానికి చాలా మార్గాలున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి. ఇవన్నీ దీర్ఘకాలం తర్వాత యౌవనాన్ని ఇచ్చి... దాన్ని అలా కొనసాగిస్తాయేమోగానీ... జుట్టుకు రంగేయడం అనే ఒక ప్రక్రియ తర్వాత యౌవనం షార్ట్‌కట్ లో మనకు దక్కేస్తుంది. షార్ట్‌కట్ కాబట్టి కొన్ని ప్రమాదాలూ ఉంటాయి కాబట్టి వాటిని నివారించడం ఎలాగో తెలుసుకుందాం. ఒకప్పుడు జుట్టుకు రంగేసుకోవడం ఏ నలభై ఐదూ, యాభై ఏళ్లు దాటినవారో చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. త్వరగా జుట్టు నెరిసిపోవడంతో చిన్న వయసులోనే రంగు వేసుకోవాల్సిన పరిస్థితి కొందరిది. మరికొందరిదేమో మంచి లుక్స్ కోసం, మాడ్రన్‌గా కనిపించడం కోసమూ జుట్టుకు రంగేసుకోవడంపరిపాటి అయిపోయింది. మీకు అనువైన హెయిర్‌డై ఏదో ఎంపిక చేసుకోవడం ఎలా? ⇒ ఈ ఎంపిక అన్నది మీరు ఎందుకు హెయిర్ డై ఉపయోగిస్తున్నారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ జుట్టు తెల్లబడినందువల్ల దాన్ని నల్లగా కనిపించేలా చేసుకోవడం కోసం రంగేసుకుంటున్నారా లేక మీ జుట్టు నల్లగానే ఉన్నా... ఫ్యాషన్ కోసం జుట్టు చివర్లు (ఒంబ్రే పాట్రన్) కోసం వేసుకుంటున్నారా లాంటి అంశాలు మీ హెయిర్‌డై ఎంపికను నిర్ణయిస్తాయి. ⇒ సాధారణంగా భారతీయులు స్వాభావికమైన నల్ల రంగు నుంచి కొందరు తమ అభిరుచిని బట్టి బ్రౌన్ లాంటి రంగు వేసుకుంటారు. ⇒ ఏ బ్రాండ్ కొనాలన్న విషయం మీరు దానిపై ఖర్చు పెట్టదలచుకున్న అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ ధర మొదలుకొని చాలా ఎక్కువ ధర వరకు అనేక బ్రాండ్లు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. హెయిర్ డైతో ప్రమాదాలిలా... ⇒ హెయిర్ డైలో ఉండే అనేక రసాయనాలలో కొన్ని మీ చర్మానికి సరిపడకపోవచ్చు. ఇప్పుడు చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిగా వాపు వంటివి కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో తలకు రంగు పెట్టినా కళ్లు, పెదవులు లేదా మొత్తం శరీరం వాచిపోవడం వంటి దుష్ర్పభావాలు కనిపించవచ్చు. అలాంటప్పుడు వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ను సంప్రదించండి. ఈ రసాయనాల్లో ఉండే వాయువులు కళ్లను మండించడం, కళ్ల నుంచి నీరుకారేలా చేయడం, గొంతులో ఇబ్బంది కలిగించడం, తుమ్ములు వచ్చేలా చేయడం, ఒక్కోసారి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలిగించి, ఆస్తమాకు దారితీయడం జరగవచ్చు. ఎన్నో ఏళ్లు వాడాక కూడా ఇలాంటి పరిణామాలు ఒక్కోసారి అకస్మాత్తుగా కనిపించవచ్చు. అందుకే మనకు ఏది సరిపడదో ముందే తెలుసుకొని, దానికి దూరంగా ఉండటం మేలు. ⇒ హెయిర్ డై ఒకవేళ గోళ్లకు అంటుకుంటే, గోరు పెరుగుతున్న కొద్దీ, క్రమంగా మనం కట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఒకనాటికి పూర్తిగా తొలగిపోతుంది తప్ప చర్మంపైన తొలగిపోయినట్లుగా ఇది పోదు. ఎందుకంటే మన గోరూ, హెయిరూ... ఈ రెండూ ఒకే రకమైన పదార్థంతో (కెరొటిన్)తో తయారవుతాయి. కాబట్టి గోళ్లకు రంగు అంటనివ్వకండి. ⇒ హెయిర్ డైను కొద్ది కొద్ది మోతాదుల్లో తీసుకుంటూ జుట్టుకు రాయండి. బ్రష్ మీద పెద్దమొత్తంలో తీసుకోకండి. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకుంటే అది కంటిలోకి కారే ప్రమాదం ఉంది. హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేస్తాయి. హెయిర్‌డై కళ్లలోకి స్రవిస్తే... కళ్లు మండటం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడం కూడా జరగవచ్చు. ఒక్కోసారి అంధత్వానికీ దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంటి విషయంలో మరింత అదనపు జాగ్రత్త అవసరం. ⇒ హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. దాంతో ఆ రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలా చేస్తాయి. ఫలితంగా చాలాకాలం రంగువేసుకుంటూ ఉన్నవారిలో వెంట్రుక కాస్త రఫ్‌గానూ, తేలిగ్గా చిట్లిపోయేదిగానూ (బ్రిటిల్గానూ) మారుతుంది. ఇక మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవారిలో ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది. ⇒ కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ తారు (కోల్తార్), పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్- ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటికి బదులు స్వాభావికమైన కాలీ మెహందీ, అప్పటికప్పుడు కలుపుకున్న హెన్నా వంటివి సురక్షితం (అయితే ఇందులోని చాలా కొద్దిపాళ్లలో పీపీడీ ఉండే అవకాశాలున్నాయి). ⇒ హెయిర్‌డై వల్ల యౌవనంగా కనిపించడమన్నది తక్షణం ఒనగూరే ప్రయోజనమే. అయితే అది ప్రమాదకరం కాకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. కాబట్టి పైన పేర్కొన్న సురక్షిత చర్యలు అవలంబిస్తూ... యూత్‌ఫుల్‌గా కనిపించండి. జాయ్‌ఫుల్‌గా జీవించండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే... ♦ మీరు తొలిసారిగా తలకు రంగు వేసుకుంటున్నారా? మొదటిసారి ఇంటి వద్ద కాకుండా పార్లర్లో ప్రొఫెషనల్స్ దగ్గర ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోండి ♦ రంగు వేసుకునే ముందుగా చెవి వెనక ఒక పాయకు రంగు వేసి, 48 గంటల పాటు పరిశీలించి చూసుకోండి. ఆ సమయంలో ఎలాంటి అనర్థమూ, దుష్ర్పభావమూ (సైడ్ ఎఫెక్ట్) కనిపించపోతే... ఇక రంగేసే ప్రక్రియను కొనసాగించండి. ♦ మీకు సురక్షితమని తేలిన బ్రాండ్‌నే ఎప్పుడూ కొనసాగించండి ♦ మీరు రంగు అంటకూడదని అనుకుంటున్న శరీర భాగాలపై పెట్రోలియం జెల్లీని పూయండి ♦ రంగు అంటకూడదని భావించే మెడ వెనక భాగంపై పాత టవల్‌ను చుట్టండి ♦ రంగును ఒకే తరహాలో (యూనీఫామ్గా) అంటేలా బ్రష్‌ను ఉపయోగించండి. అంతే తప్ప ఒకచోట ఎక్కువ, మరోచోట తక్కువ పూయకండి. దీంతో తెరపలు తెరపలుగా రంగు కనిపించే ఆస్కారం ఉంది ♦ రంగు పూసే సమయంలో చేతులకు గ్లౌవ్స్ తప్పక ధరించండి ♦ వెంట్రుక పెరుగుతున్న కొద్దీ కుదుళ్ల వద్ద తెల్లగా కనిపించే చోట మాత్రమే రంగు పూయదలచినప్పుడు, మిగతా నల్లగా ఉన్న వెంట్రుకల వరకు కండిషనర్ పూసి, తెల్లని చోట టచప్ చేయండి ♦ మీరు ఎంపిక చేసుకున్న షేడ్ ఏదో అదే వేసుకోండి. అంతేగానీ... రెండు షేడ్ల రంగులు తీసుకొని ఈ రెండింటినీ కలపకండి రంగు వేసే సమయంలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకండి. ఈ జాగ్రత్తను తప్పక పాటించండి ♦ రంగు వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం లేదా ఆయాసం రావడం జరుగుతుంటే వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోండి ♦ హెయిర్‌డై అన్నది కేవలం తలకు మాత్రమే వేసుకోండి. కనుబొమలకూ, కనురెప్పలకూ ఉన్న వెంట్రుకలకు ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్‌డై వాడకూడదు ♦ మీరు కొన్ని బ్రాండ్‌లోని జాగ్రత్తలను, అందులో ఉపయోగించిన పదార్థాలను ఒకసారి చదవండి. అందులో కోల్తార్, లెడ్ ఎసిటేట్, రెసార్సినాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు రాసి ఉంటే దాన్ని వాడకండి ♦ అమోనియా వంటి రసాయనాలు ఉన్న బ్రాండ్స్ ఉపయోగించడం వల్ల మీకు ఏవైనా దుష్ర్పభావాలు కనిపిస్తే... అమోనియా లేని బ్రాండ్లలో మోనో ఈథేనొలమైన్ (ఎమ్ఈఏ) వంటి సురక్షితమైన ఏజెంట్స్ ఉన్న బ్రాండ్స్ వాడుకోండి ♦ గర్భిణులు... తాము ప్రెగ్నెన్నీతో ఉన్న టైమ్‌లో హెయిర్‌డై ఉపయోగించకపోవడమే మంచిది. డాక్టర్ రాధా షా కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ -
డర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 22. అయినా నా చర్మం ఎండిపోయినట్లుగా ఉంటోంది. ఆహారంలో మార్పులతో మేను మెరిసేలా చేయడానికి సూచనలు ఇవ్వండి. - సౌమ్య, జనగామ చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి మేను మెరిసేలా చేస్తాయి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ. ఈ పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. వైటమిన్-బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో వల్ల హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను నివారించవచ్చు. అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ అనే విషాలను తొలగించి మేనిని మెరిసేలా చేస్తాయి. నేను కాస్త చాయనలుపుగా ఉంటాను. మార్కెట్లో దొరికే ఫెయిర్‌నెస్ క్రీములు వాడాలనుకుంటున్నాను. అవి వాడేముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? - శ్వేత, హైదరాబాద్ సాధారణంగా తెల్లగా కనిపించడం కోసం ఉపయోగించే ఫెయిర్‌నెస్ క్రీమ్‌లతో చాలా వరకు ప్రమాదం ఉండదు. కానీ వాటిని వాడే ముందర మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి వాడబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను చర్మంపై ఎక్కడైనా (చేతికి అయితే మంచిది) కొద్దిగా ప్యాచ్‌లాగా రాసి... దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని తెలుసుకున్న తర్వాతే వాడండి ఏదైనా క్రీమ్ ఎంపిక తర్వాత ఇలా టెస్ట్ చేసుకోకపోతే కొన్నిసార్లు కొందరిలో కాంటాక్ట్ డర్మటైటిస్, అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. ఇలా ప్యాచ్‌లా రాసుకొని పరీక్షించడం వల్ల కొన్ని ప్రమాదాలను ముందే నివారించవచ్చని తెలుసుకోండి. - డాక్టర్ మేఘనారెడ్డి కె. కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్,హైదరాబాద్