హాయ్, హలో ఎలా ఉన్నారు?
గుర్తున్నానా? లేదా రెండు వారాల గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోయారా? నిజాయితీగా మీ సమాధానం కామెంట్స్ లో చెప్పండి. సరే, ఈ రోజు టాపిక్ ఈ గ్యాప్ పైనే.
మొన్నా మధ్య మా కౌన్సెలింగ్ సెంటర్ కు ఓ జంట వచ్చారు. ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం క్లయింట్ల పేర్లు చెప్పకూడదు కాబట్టి అరుణ, సాగర్ అనుకుందాం. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ కలిసి నెలకు నాలుగైదు లక్షలు సంసాదిస్తున్నారు. గచ్చిబౌలి లో ఫ్టాట్, మంచి కారు, వీకెండ్ పార్టీలు, మంత్లీ ట్రిప్స్, ఏడాదికోసారి ఇంటర్నేషనల్ టూర్. హ్యాపీ లైఫ్. ఇది అందరికీ కనిపించే విషయం.
కానీ లోలోపల అగ్గి రగులుతోంది. ఇద్దరి మధ్యా వాదనలు పెరిగాయి. దూరం పెరిగింది. గత ఆరునెలలుగా తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం ఒక లాయర్ ను సజెస్ట్ చేయమని ఫ్రెండ్ ను అడిగారు. విడాకులకు అప్లయ్ చేశాక కూడా కౌన్సెలింగ్ కు వెళ్లాలని, దానికన్నా ముందే వెళ్లడం మంచిదని నా పేరు సజెస్ట్ చేశారు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు.
మొదటి సెషన్ లో వారిద్దరితో విడివిడిగానూ, కలివిడిగానూ మాట్లాడి సమాచారం తీసుకున్నా. వారిద్దరూ విడిపోవడానికి కారణం ప్రేమ లేకపోవడం కాదని, పెరుగుతున్న దూరమని అర్థమైంది. ఒకే ఇంట్లో ఉంటున్నా, శారీరికంగా కలుస్తున్నా, ఎమోషనల్ గా, సైకలాజికల్ గా దూరమవుతున్నారని వారి మాటల ద్వారా తెలిసింది. కౌన్సెలింగ్, మేరిటల్ థెరపీ, రిలేషన్షిప్ ఎక్సర్ సైజ్ ల ద్వారా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేశాను. దాంతో విడాకుల ఆలోచనకు స్వస్తి పలికి ఇద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో జంటల మధ్య ఏర్పడే వివిధ రకాల అంతరాలు, అదేనండీ గ్యాప్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
అంతరాలను అర్థం చేసుకోవడం...
పగలెలా ఉన్నా రాత్రికి ఒక్కటైతే చాలు, అన్ని సమస్యలూ మాయమవుతాయని పెద్దలు చెప్తుంటారు. అది ఆ కాలంలో నడిచిందేమో కానీ, ఈ కాలంలో వర్కవుట్ కాదు. జంట మధ్య శారీరక దూరంతో పాటు, ఎమోషనల్, సైకలాజికల్, ఇంటలెక్చువల్, స్పిరిచ్యువల్ గ్యాప్స్ కూడా ఏర్పడవచ్చు. వాటికి సకాలంలో అడ్రస్ చేయకపోతే ఇద్దరి మధ్య కనిపించని అగాధం ఏర్పడుతుంది. అందుకే వాటి గురించి తెలుసుకుని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఎమోషనల్ డిస్టెన్స్...
జంటలు తమ ఆలోచనలు, భావాలు, అనుభవాలు, భావోద్వేగాలు పంచుకోవడం తగ్గించినప్పుడు, మానివేసినప్పుడు ఎమోషనల్ గ్యాప్ ఏర్పడుతుంది. ఉదాహరణకు, అరుణ తన కెరీర్ పడుతున్న స్ట్రెస్ గురించి సాగర్ కు చెప్పినప్పుడు, అది అందరికీ ఉండేదేగా, ప్రత్యేకం ఏముంది? అంటూ కొట్టిపడేశాడు. ఒకటి రెండు సార్లు అలా అనేసరికి తన ఒత్తిళ్ల గురించి చెప్పడం మానేసింది. తన కష్టాల్లో సాగర్ అండగా లేడని బాధపడటం మొదలుపెట్టింది. అది వారిద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ కు కారణమైంది.
ఇంటలెక్చువల్ డిస్టెన్స్...
తమకు ఎక్సయిట్మెంట్, ఇంటలెక్చువల్ స్టిములేషన్ కలిగించిన విషయాల గురించి మాట్లాడుకోవడం మానేసినప్పుడు ఇది జరుగుతుంది. అరుణకు యద్దనపూడి నవలలంటే ఇష్టం. సాగర్ నాన్ ఫిక్షన్ చదువుతాడు. అది అతనిష్టం. కానీ ఈ కాలంలో యద్దనపూడి నవలలు చదవడమేంటని అరుణను వెక్కిరిస్తాడు. దాంతో వారిద్దరి మధ్య ఇంటలెక్చువల్ షేరింగ్ పూర్తిగా ఆగిపోయింది. దూరం పెరిగింది.
ఎక్స్ పీరియన్షియల్ డిస్టెన్స్...
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండకపోవడమే కాదు, జంట మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలా చేయనప్పుడు దూరం పెరుతుంది. అరుణ, సాగర్ బిజీ వర్క్ లో పడిపోయారు. కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం తగ్గిపోయింది. కలిసి వంట చేయడం సంగతి సరేసరి. ఎక్కువ సందర్భాల్లో స్విగ్గీ, జొమాటోలపైనే ఆధారపడుతున్నారు.
స్పిరిచ్యువల్ డిస్టెన్స్...
భాగస్వాముల నమ్మకాలు, ఆచారాలు ఏకోన్ముఖంగా లేనప్పుడు ఈ దూరం ఏర్పడుతుంది. అరుణకు ఓ గురువంటే అమితమైన భక్తి. సాగర్ నాస్తికుడు. ఆ గురువు మోసగాడని రోజూ విమర్థిస్తుంటాడు. కాలక్రమేణా, అది వారిద్దరి మధ్య నిశ్శబ్దానికి దారితీసింది.
ఫిజికల్ డిస్టెన్స్...
శారీరక దూరం అంటే సెక్స్ లేకపోవడం అని అర్థం కాదు, కానీ రోజువారీ పనుల్లో స్పర్శ, ఆప్యాయత లేకపోవడం. ఆప్యాయంగా అరుణ చేతులు పట్టుకోవడం, సున్నితంగా కౌగిలించుకోవడం సాగర్ పూర్తిగా మర్చి పోయాడు.
దూరాలను తగ్గించుకోవాలి...
- అరుణ, సాగర్ లానే మీ మధ్య కూడా ఇలాంటి దూరాలు, అంతరాలు ఉన్నాయా? భయపడాల్సిన అవసరమేం లేదు. ఆ అంతరాలను తగ్గించుకోవడానికి మీరిద్దరూ ప్రయత్నం చేస్తే చాలు. అరుణ, సాగర్ లకు చెప్పిన కొన్ని టిప్స్ ఇప్పుడు మీకు కూడా చెప్తా.
- మీ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రతిరోజూ సమయాన్ని కేటాయించండి. గంటలు గంటలు అవసరం లేదు. కాఫీ తాగుతూ కూడా మాట్లాడుకోవచ్చు. అయితే ఆ సమయంలో మొబైల్ చూడకుండా పార్టనర్ చెప్పేది వినాలి.
మీ మీ వ్యక్తిగత అభిరుచులను అలాగే ఉంచుకుంటూ, ఇద్దరికీ ఇష్టమైన ఇంటలెక్చువల్ అంశం కనుక్కోండి, తరచూ దాని గురించి చర్చించుకోండి. - మీరిద్దరూ ఎంజాయ్ చేసే వనులకు తప్పనిసరిగా సమయాన్ని కేటాయించండి. ఇది కలిసి వంట చేయడం, నడవడం లేదా అడ్వంచర్ ట్రిప్ లాంటిది ఏదైనా కావచ్చు.
- ఒకరి ఆధ్యాత్మిక విశ్వాసాలను మరొకరు గౌరవించుకోండి. మీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, కలిసి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయండి.
- శారీరక సాన్నిహిత్యం అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. దగ్గరగా కూర్చోవడం, చేతులు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం, కౌగలించుకోవడం లాంటి చిన్న చిన్న పనులు ఫిజికల్ ఇంటిమసీని పెంచుతాయి.
- కొన్ని జంటలు ఈ పనులన్నీ చేస్తున్నా గ్యాప్ పెరుగుతూనే ఉంటుంది. ఇరువురి మధ్య పరిష్కరించుకోని వైరుధ్యాలు, కనిపించని ఒత్తిళ్లు, కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్, ఫియర్ ఆఫ్ వల్నరబిలిటీ అందుకు కారణం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగేకంటే కౌన్సెలింగ్ సెంటర్ కు వెళ్లడం మంచిదని గుర్తించండి. విష్ యూ హ్యాపీ లైఫ్.
-సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
Psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment