హలో ఫ్రెండ్స్,
గతవారం సారా గురించి మాట్లాడుకున్నాం కదా. బాల్యంలో పేరెంట్స్, గార్డియన్స్, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం జీవితానికి ఒక పునాదిలా పనిచేస్తుంది. ఆ తర్వాత వివిధ వ్యక్తులతో సాన్నిహిత్యం, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం, సంఘర్షణలను పరిష్కరించుకునే సామర్థ్యాకు బ్లూప్రింట్ లా ఉంటుంది. వీటినే అటాచ్మెంట్ స్టైల్స్ అంటారు. జీవితంలో బలమైన కనెక్షన్ లను నిర్మించుకోవాలంటే వీటిని అర్థం చేసుకోవడం అవసరం.
నాలుగు రకాలు...
Secure Attachment: బాల్యంలో అనేక అవసరాలు ఉంటాయి. అన్నీ పిల్లలు చేసుకోలేరు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అవసరం ఉంటుంది. ఆ అవసరాలను వెంటనే గుర్తించి, స్పందించి, సంరక్షించే పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లల్లో భద్రంగా ఉన్నామనే ఫీలింగ్ ఏర్పడుతుంది. అలా సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఏర్పడుతుంది. వయసుతో పాటు అదీ పెరుగుతూ ఇతరులతో బంధాలను ఏర్పరచుకోవడంలో దిక్సూచిలా పనిచేస్తుంది.
ఈ అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు తమకు ఏ కష్టం వచ్చినా తన జీవిత భాగస్వామి అందుబాటులో ఉంటారని నమ్ముతారు. తమ మనసులోని భావాలు ఎలాంటివైనా నేరుగా కమ్యూనికేట్ చేస్తారు. తన లైఫ్ పార్టనర్ తో సాన్నిహిత్యంగా, సుఖంగా ఉంటారు. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు.
Anxious Attachment: బాల్యంలో పేరెంట్స్ లేదా గార్డియన్స్ అందుబాటులో లేకపోవడం, ఉన్నా పట్టించుకోకపోవడం, అవసరాలను గుర్తించకపోవడంతో... తనను ఎవరూ పట్టించుకోవడంలేదు, వదిలేస్తారనే భయం, ఆతృత ఏర్పడుతుంది. ఆ భయం వారి జీవితాంతం ఉంటుంది. అందుకే మనసులోని భావాలను నేరుగా చెప్పలేరు. చెప్తే తమను వదిలివేస్తారనే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. పార్టనర్ మౌనంగా ఉంటే అది తిరస్కారంగా భావిస్తారు. ‘నేనంటే ఇష్టంలేదా?’ అని పదే పదే అడుగుతారు. చాలా ఇష్టమని చెప్పినా సంతృప్తి చెందరు. వదిలేస్తారేమోనని భయపడుతుంటారు. దాంతో మరింత దగ్గరగా అతుక్కుపోతారు. మరోవైపు పార్టనర్ చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. అసూయ, అభద్రత వంటి వారిని కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడుతుంటారు. ఇలాంటివారికి భరోసా ఇవ్వడం పార్టనర్ కు తలకు మించిని భారమవుతుంది. సారా సమస్య ఇదేనని గుర్తొచ్చిందా?
Avoidant Attachment: కొందరు పేరెంట్స్ పిల్లలను పట్టించుకోరు, దూరంగా పెడుతుంటారు. వాళ్లేం చేసినా నిరుత్సాహపరుస్తుంటారు. అందువల్ల పిల్లలు వారితో సాన్నిహిత్యంగా ఉండలేరు. ఎమోషన్స్ ను వ్యక్తం చేయలేరు. అలా వ్యక్తంచేయడం అసౌకర్యంగా భావిస్తారు. స్వతంత్రంగా ఉండలేరు. ఒంటరిగా ఫీలవుతుంటారు. అలా ఈ అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు ఏదీ ఓపెన్ గా మాట్లాడలేరు. మానసికంగా దూరంగా ఉంటారు. తరచూ పోట్లాడుతుంటారు. ఒంటరిగా ఫీలవుతుంటారు. వీరితో ఎలా వ్యవహరిస్తే ఏమవుతుందోనని పార్టనర్ గందరగోళానికి గురవుతారు.
Disorganized Attachment: కొందరు పేరెంట్స్ లో తెలియని భయాలు ఉంటాయి. దాంతో వారి ప్రవర్తన ఎప్పడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లల్లో ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. వీరు ఇతరులతో సాన్నిహిత్యం కోరుకుంటారు. కానీ వాళ్లను విశ్వసించాలంటే తీవ్రమైన భయం. దాంతో వారి బంధాలు, అనుబంధాలు అస్థిరంగా ఉంటాయి. వారి భావోద్వేగ ప్రతిస్పందనలు అనూహ్యంగా ఉంటాయి. వీరికి ఎమోషనల్ సెక్యూరిటీ అందించడంలో పార్టనర్స్ ఇబ్బందులు పడుతుంటారు.
మరేం చెయ్యాలి?
సరే సర్. అటాచ్మెంట్ స్టైల్స్ రిలేషన్ షిప్ డైనమిక్స్ ను ప్రభావితం చేస్తాయంటున్నారు సరే, ఇప్పుడేం చెయ్యాలి? అని మీరు అనిపించవచ్చు. బాల్యంలో ఏర్పడిని అటాచ్మెంట్ స్టైల్స్ అలాగే శిలేసుకుని కూర్చోవు. వాటిపట్ల అవగాహన పెంచుకుని, మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తే మారతాయి. సైకాలజిస్ట్ సహాయంతో సురక్షితమైన అటాచ్మెంట్ స్టైల్ ను అభివృద్ధి చేసుకోవచ్చు. గతవారం సారా కేసులో జరిగింది ఇదే. అందుకోసం ముందుగా మీరేం చేయాలో చెప్తా.
• మీ అటాచ్‌మెంట్ శైలిని గుర్తించడం అనేది హెల్తీ కనెక్షన్‌లను నిర్మించుకోవడంలో తొలి అడుగు. మీ శైలిని అర్థం చేసుకోవడం వల్ల మీ ప్రవర్తనకు మూల కారణాలను గుర్తించవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు సైకాలజిస్ట్ సహాయపడతారు.
• మనం మొదటివారం చెప్పుకున్నట్లు అన్ని బంధాలూ మీ సెల్ఫ్ ఎస్టీమ్ పైనే ఆధారపడి ఉంటాయి. మీపై మీకు గౌరవం, విశ్వాసం ఉంటే ఇతరులపై ఆధారపడటం తగ్గిస్తుంది. సురక్షితమైన అనుబంధాన్ని సులభతరం చేస్తుంది
• నిజాయితీతో కూడిన ఓపెన్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రిలేషన్స్ లో వచ్చే సంఘర్షణలను సమర్థంగా పరిష్కరించుకునేందుకు, మీ అవసరాలను నేరుగా వ్యక్తీకరించేందుకు ఉపయోగపడుతుంది.
• బంధాలలో ఏది ఓకేనో, ఏది నాట్ ఓకేనో స్పష్టమైన సరిహద్దులను సెట్ చేయడం మీ ఎమోషనల్ వెల్ బీయింగ్ ను కాపాడుతుంది. పరస్పరం గౌరవప్రదంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది.
• రిలాక్సేషన్ టెక్నిక్స్, మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్ వంటివి మీ భావోద్వేగ నియంత్రణను మెరుగుపరుస్తాయి. నెగెటివ్ ఎమోషన్స్ మీ సంబంధాలను దెబ్బతీయకుండా కాపాడతాయి.
• బంధాలకు సంబంధించిన నెగెటివ్ ఆలోచనా విధానాలకు గుర్తించడానికి, వాటిని మార్చుకోవడానికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT) ఉపయోగపడుతుంది. మీ ఎమోషనల్ రెగ్యులేషన్ కు, సెల్ఫ్ కంపాషన్ పెంపొందించడానికి కోపింగ్ మెకానిజమ్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment