చేతిలోని కత్తిని మంచికి వాడవచ్చు, చేయాలనుకుంటే చెడు కూడా చేయవచ్చు. మరి, ప్రపంచాన్ని చేతిలోకి తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్‌నీ, అందులోని సోషల్ మీడియా వేదికల్నీ ఇప్పుడు మనం దేనికి వాడుతున్నట్టు? దాని దుర్వినియోగం, విషప్రచారం తాలూకు విపరిణామాల ఫలితం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రత్యక్షంగా అనుభవిస్తోంది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, విభిన్న వర్గాల మధ్య అనుమానాలు సహా ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ సోషల్ మీడియా సాక్షిగా తీవ్రతర మితవాద బృందాల అసత్య ప్రచారం వల్ల అల్లర్లు, దహనాలతో అట్టుడుకుతోంది.
మనసును కదిలించే ముగ్గురు పసిపిల్లల పాశవిక హత్య కారణంగా వారం క్రితం మొదలైన ఈ హింసాత్మక నిరసనల్ని అదుపు చేయడానికి పాలనా యంత్రాంగం కిందా మీదా అవుతోంది. చివరకు యూకేలో ‘అంతర్యుద్ధం అనివార్యం’ అంటూ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు దుందు డుకు వ్యాఖ్యలు చేస్తుంటే, బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించాల్సిన పరిస్థితి. ఇటీవలే పగ్గాలు పట్టిన లేబర్ పార్టీ ప్రభుత్వానికి తాజా పరిణామాలు సవాలుగా మారాయి.
ఇంగ్లండ్ వాయవ్య ప్రాంతంలోని సౌత్‌పోర్ట్‌లో జూలై 29న ఓ డ్యాన్స్ క్లాస్‌లో ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేసి చంపిన దారుణ సంఘటన చివరకు దేశమంతటా కార్చిచ్చుకు దారి తీయడం నమ్మశక్యం కాని నిజం. దాడి చేసిన వ్యక్తి వలసదారు, మైనారిటీ మతస్థుడు, గత ఏడాదే ఒక చిన్న పడవలో బ్రిటన్‌లో ప్రవేశించాడు అంటూ అంతర్జాలంలో అసత్యాలు ప్రచారమయ్యాయి.
అదే అదనుగా వలసదారులకూ, ముస్లిమ్‌లకూ వ్యతిరేకంగా నిరస నలు చేయాలంటూ తీవ్రతర మితవాద బృందాలు సామాజిక మాధ్యమ వేదికలైన ‘ఎక్స్’ వగైరాల్లో పిలుపునిచ్చాయి. నిజానికి, పిల్లలపై కత్తి దాడికి పాల్పడింది ముస్లిమ్ వలసదారు కాదనీ, రువాండాకు చెందిన తల్లితండ్రులకు జన్మించిన ఓ 17 ఏళ్ళ క్రైస్తవ టీనేజర్ అనీ అధికారులు గుర్తించారు. ఆ పసిపాపల్ని చంపడమే కాక, గతంలోనూ కనీసం పదిసార్లు ఆ కుర్రాడు హత్యాయత్నాలకు పాల్పడి నట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టు కూడా చేశారు.
అయితే, నిజం ఇంటి గడప దాటే లోపల అబద్ధం ఊరంతా షికారు చేసింది. హంతకుడి గురించి పుకార్లు, విద్వేష నిరసనల పిలుపులు విస్తృతంగా విషాన్ని విరజిమ్మాయి. సోషల్‌మీడియా లోని వివాదాస్పద ఇన్‌ఫ్లుయెన్సర్ల తప్పుడు కథనాలతో మసీదులు, శరణార్థులకు నీడనిచ్చిన హోటళ్ళే లక్ష్యంగా దాడులు సాగాయి.
చివరకు గడచిన దశాబ్ద కాలం పైచిలుకుగా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో ఎన్నడెరుగని స్థాయిలో అల్లర్లు, దహనకాండ, లూటీలకు ఆజ్యం పోశాయి. జూలై 30 నుంచి దేశవ్యాప్తంగా సాగుతున్న ఘర్షణల్లో ఇప్పటికి కనీసం 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా పరిస్థితులు చక్కబడలేదు. చివరకు లండన్‌లోని భారత హైకమిషన్ సైతం బ్రిటన్‌కు వచ్చే భారత జాతీయులు జాగ్రత్తగా ఉండాలని మంగళవారం సూచనలు జారీ చేయాల్సి వచ్చింది. నైజీరియా, మలేసియా, ఇండొనేషియా సహా పలు దేశాలు అదే పని చేశాయి.
ప్రపంచమంతటా సత్వర సమాచార, వ్యాఖ్యా ప్రసారానికి ఉపయోగపడాల్సిన వాట్సప్ మొదలు ‘ఎక్స్’ దాకా సోషల్ మీడియా వేదికలన్నీ తుంటరుల చేతిలో అదుపు లేని ఆయుధాలుగా మారడం విషాదం. వాటిలోని విద్వేషపూరిత అసత్యాలు, రెచ్చేగొట్టే మాటలకు ఎవరు, ఎక్కడ, ఎలా అడ్డుకట్ట వేయగలరో అర్థం కాని పరిస్థితి. బ్రిటన్‌లో సాంకేతిక శాఖ మంత్రి సైతం గూగుల్, ఎక్స్, టిక్‌టాక్, మెటా సంస్థల ప్రతినిధులతో సమావేశమై, అసత్య సమాచారం వ్యాపించకుండా ఆపడంలో ఆ సంస్థల బాధ్యతను మరోసారి నొక్కిచెప్పాల్సి వచ్చింది.
అసలు అలాంటి అంశాలను తొలగించే బాధ్యత, భారం ఆ యా సోషల్ మీడియా సంస్థలదేనని బ్రిటన్ సర్కార్ కొంత కాలంగా ఒత్తిడి పెట్టాలని చూస్తోంది. తాజా ఘర్షణలతో ప్రభుత్వం ఆగి, తన వంతుగా తానూ బాధ్యత తీసుకోక తప్పదు. నిజానికి, ‘బ్రెగ్జిట్’ తర్వాత నుంచి బ్రిటీషు సమాజం నిలువునా చీలిపోయింది. ఈ చీలిక లకు మునుపటి కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాలు హ్రస్వ దృష్టితో అనుసరించిన విధానాలు తోడయ్యే సరికి పెను ప్రభావం పడింది. అన్నీ కలసి తాజా దాడులుగా విస్ఫోటించాయి.
ఈ హింసను అదుపు చేసి, శాంతిభద్రతల్ని పునరుద్ధరించడం స్టార్మర్ సర్కారుకు సవాలే. కానీ, తీవ్రతర మితవాదులు రేపుతున్న విద్వేషం, విదేశీయుల పట్ల వైముఖ్యానికి కళ్ళెం వేయడం అసలు సిసలు ఛాలెంజ్. మొత్తం వచ్చిన ఓట్ల రీత్యా బ్రిటన్ తాజా ఎన్నికల్లో తీవ్రతర మితవాద రాజకీయ పార్టీ ‘రిఫార్మ్ యూకే’ మూడోస్థానంలో నిలిచింది. అంటే, దేశంలోని రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల మధ్య దానికి ఆ మేరకు మద్దతుందన్న మాట. అదే సమయంలో పాలనలో మార్పు కోరిన జనం బ్రిటన్ పునర్నిర్మాణ వాగ్దానం చూసి స్టార్మర్‌కు ఓటేశారు.
పాత పాలన సమస్యలకు తోడు ప్రస్తుత పరిస్థితుల్లో వలసలు, మితవాద జనాకర్షక విధానాల లాంటి సంక్లిష్ట అంశాలపై ఆయన ఆచితూచి అడుగేయక తప్పదు. చరిత్రలో వలసరాజ్య పాలనకు పేరొందిన బ్రిటన్‌లో ఇప్పుడు వలసదారులపై రచ్చ రేగడమే వైచిత్రి. పొట్ట చేతబట్టుకొని శరణు కోరి వచ్చినవారినే అన్నిటికీ కారణమని నిందించడం, అకారణ శత్రుత్వం వహించడం బ్రిటన్‌కు శోభనివ్వదు.
అసత్య కథనాల పట్ల జనచైతన్యంతో పాటు జనజీవన స్రవంతిలో వలసజీవులు కలిసిపోయే విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం ముఖ్యం. వాటివల్లే అపోహలు, ప్రతికూలభావాలు పోతాయి. విధ్వంసకారులపై కఠిన చర్యలు తీసు కుంటూనే సరైన నాయకత్వం, సహానుభూతితో వ్యవహరించాలి. మతవైరాలకు తావివ్వక న్యాయం, సమానత్వానికి నిలబడడమే ఇప్పుడు బ్రిటన్ మరింత పటిష్ఠంగా ముందుకు నడవడానికి మార్గం.
విషప్రచారపు కోరల్లో...
Published Wed, Aug 7 2024 6:59 AM | Last Updated on Wed, Aug 7 2024 6:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment