అత్యవసరంలో ఉన్నామంటూ ఫేక్ మెసేజ్‌లు.. నేరుగా సంప్రదించకుండా ఆన్‌లైన్‌లో డబ్బులు పంపొద్దని హెచ్చరిస్తున్న పోలీసులు
ప్రొఫైల్ క్లోనింగ్‌తో చీటింగ్
సోషల్ మీడియా ఖాతాల్లోని వివరాలతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు
‘నాకు యాక్సిడెంట్ అయ్యింది అక్కా..ఆసుపత్రిలో ఉన్నాను..అర్జెంట్‌గా బిల్లు కట్టాలని అంటున్నారు..నేను తర్వాత వివరంగా మాట్లాడతాను. ముందు నేను పంపిన నంబర్‌కు గూగుల్ పే చెయ్యి’అని మలక్‌పేట్‌కు చెందిన ఓ గృహిణికి వాట్సప్ కాల్ వచ్చింది. వాట్సప్ ప్రొఫైల్ ఫొటో తన సోదరుడిదే..మాట కొంచెం తేడాగా ఉన్నా..నంబర్ కూడా తనదే ఉంది. నిజంగానే ఆసుపత్రిలో ఉన్నాడనుకుని రూ.50 వేలు ఫోన్‌పే చేసింది. తర్వాత తెలిసింది అది సైబర్ మోసగాళ్ల పని అని.. ఇది కేస్ 01.
కేస్–02
మనోజ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆఫీస్‌లో ఉన్న సమయంలో వాట్సప్ మెసెంజర్‌లో ఓ మెసేజ్ వచ్చింది. ‘నేను మా అమ్మను ఆసుపత్రికి తీసుకువచ్చాను. హడావుడిలో పర్స్ తీసుకురాలేదు. నేను చెప్పిన అకౌంట్‌కి ఆసుపత్రి వాళ్లకు రూ.75 వేలు పంపించు. నేను నీతో కాసేపటి తర్వాత ఫోన్‌లో వివరంగా మాట్లాడతాను..’అని ఆ మెసేజ్ సారాంశం. ప్రొఫైల్ ఫొటో, వివరాలు తన కొలీగ్ ప్రశాంత్‌వే..నిజంగానే స్నేహితుడు ఆపదలో ఉన్నాడేమో అని ఆన్‌లైన్‌లో డబ్బులు పంపాడు మనోజ్. ‘అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది’ అని సాయంత్రం ప్రశాంత్‌కి ఫోన్ చేస్తేగానీ మనోజ్ కు తెలియదు తాను సైబర్‌మోసానికి గురయ్యానని.
ప్రొఫైల్ క్లోనింగ్ అంటే..?
ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్, స్నాప్‌చాట్.. ఇలాంటి సోషల్ మీడియా వేదికలలో పలువురు పంచుకునే వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు, అందులో పేర్కొంటున్న సమాచారం, అభిరుచులు ఇలా అన్ని వివరాలు సేకరించి కొద్దిపాటిగా పేర్లు మార్చి నకిలీ ప్రొఫైల్స్‌ను తయారు చేయడమే ప్రొఫైల్ క్లోనింగ్. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు ఇలా అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతారు. ఆ తర్వాత మోసానికి తెరతీస్తారు. ఆపదలో ఉన్నానని, అత్యవసరంగా కొంత డబ్బు అవసరం ఉందని, ఇలా మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో మోసాలకు పాల్పడతారు.
ఎలా గుర్తించాలి.. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
మనకు బాగా తెలిసిన వ్యక్తుల ఫొటో లు, ప్రొఫైల్స్‌తో ఉన్న ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాల నుంచి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్‌గానీ, మెసేజ్ కానీ వస్తే.. అది సైబర్ నేరగాళ్ల పనే అయిఉండొచ్చని అనుమానించాలి. కంగారుపడిపో యి వెంటనే డబ్బులు పంపవద్దు. అసలు విషయం ఏంటన్నది నేరుగా వాళ్ల ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో వ్యక్తి గత సమాచారం అవసరానికి మించి పంచుకోకపోవడమే మేలు. కుటుంబసభ్యు లు, స్నేహితులతో ఉన్న సన్నిహితమైన ఫొ టోలు, వీడియోలు పంచుకోవద్దు. మనం సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టే సమాచారమే సైబర్ నేరగాళ్లు వినియోగించుకుని మోసాలకు తెరతీస్తున్నారన్నది గుర్తించాలి. ప్రొఫైల్ లాక్ ఉపయోగించకపోతే మోసాలకు అవకాశం ఉంది. కాబట్టి ప్రైవసీ సెట్టింగ్‌లు తప్పక పెట్టుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment