![Sakshi Editorial On Technologies digital world](/styles/webp/s3/article_images/2025/01/7/digital.jpg.webp?itok=lgsFE0T6)
కాలం మారుతున్నకొద్దీ, సాంకేతికతలు విస్తరిస్తున్నకొద్దీ కొత్త భయాలు పుట్టుకొస్తాయి. తమ పిల్లలు సోషల్ మీడియా వ్యామోహంవల్ల చెడిపోతున్నారని కొన్నాళ్లుగా తల్లిదండ్రుల్లో బెంగ పట్టు కుంది. అక్కడ తారసపడే విశృంఖల పోకడలు, తప్పుడు భావాలు పిల్లల మెదళ్లపై దుష్ప్రభావం కలగ జేస్తున్నాయి. వారి బాల్య, కౌమార దశలను కొల్లగొడుతున్నాయి. పిల్లలకు మాదకద్రవ్యాలు అల వాటు చేయడంలో సామాజిక మాధ్యమాల పాత్ర కాదనలేనిది.
నిజానికి సోషల్ మీడియా దుర్వ్యసనంగా మారిన వైనమూ, దాని పర్యవసానాలూ చెదురుమదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినప్పుడు కొత్త తలనొప్పులు సహజమే. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరవటానికి తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం ముసాయిదా నిబంధనలను కేంద్రం రూపొందించింది. అభ్యంతరాలు, సూచనలు వచ్చే నెల 18లోగా తెలియజేయాలని కోరింది.
డేటా పరిరక్షణ కోసం, వ్యక్తిగత గోప్యత భద్రత కోసం ఒక చట్టం అవసరమన్న సంగతిని మన పాలకులు గ్రహించటంలో అలవిమాలిన జాప్యం చోటుచేసుకుంది. పౌరుల వేలిముద్రలు, బ్యాంకు ఖాతాలతో సహా సమస్త వివరాలనూ సేకరించే ఆధార్ వ్యవస్థ తీసుకొచ్చిన ఏడెనిమిదేళ్ల వరకూ ఆ డేటా పరిరక్షణకు ఎలాంటి కట్టుదిట్టాలు అవసరమన్నది ఎవరికీ తట్టలేదు.
2017లో జస్టిస్ పుట్టస్వామి పిటిషన్‌పై ఇచ్చిన తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను తొలిసారి ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మరో ఆరేళ్ల తర్వాత 2023 ఆగస్టులో డీపీడీపీ చట్టం వచ్చింది. దాని అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పనకు మళ్లీ ఇన్ని నెలలు పట్టింది. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్న వర్త మానంలో ఈ అంశంపై ఇప్పటికైనా ముసాయిదా నిబంధనలు రావటం హర్షించదగ్గది.
ప్రస్తుతం ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని వాతావరణంలో ప్రపంచం మనుగడ సాగిస్తోంది. గోడలకు చెవులుంటాయన్నది పాత సామెత. స్మార్ట్ ఫోన్లకు చెవులే కాదు... కళ్లు కూడా ఉంటున్నాయి. మనం పక్కవారితో సాగించే పిచ్చాపాటీని సైతం వినే సదుపాయం ఆ ఫోన్లలో ఉంటున్నదని, మన ఇష్టాయిష్టాలు తెలుసుకోవటం, వాటి ఆధారంగా డేటా రూపొంది క్షణాల్లో ఎవరెవరికో చేరిపోవటం రివాజైందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌లు వినియోగించనప్పుడు సైతం వాటి కెమెరాలు కళ్లు తెరిచే సాంకేతికత ఉన్నదంటున్నారు.
ఇలాంటి ఫోన్‌లు తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలకు ఎంత చేటు తీసుకురాగలవో ఊహించటానికి కూడా భయం వేస్తుంది. అందువల్లే ఎప్పుడెప్పుడు తగిన నిబంధనలు వస్తాయా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తమ డేటా, బ్యాంకు ఖాతాల సమాచారం బయటకెలా పోతున్నదో తెలియక పెద్దలు కంగారు పడుతుంటే సామాజిక మాధ్యమాల్లో దుండగుల బారినపడి పిల్లలు తల్లడిల్లు తున్నారు.
వినియోగదారుల డేటా సేకరణలో పారదర్శకతనూ, ఎందుకోసం సేకరిస్తున్నారో వెల్ల డించటాన్నీ నిబంధనలు తప్పనిసరి చేస్తున్నాయి. ఒకవేళ సంస్థల అజాగ్రత్త వల్ల లేదా ఉద్దేశపూర్వక చర్యవల్ల డేటా లీకైతే ఫిర్యాదు చేయటానికి కూడా ఏర్పాట్లున్నాయి. అలాగే సంస్థల్లో డేటా సేకర ణకు అనుసరిస్తున్న విధానాలను సవాలు చేయటానికి, వివరణ కోరటానికి అవకాశం ఉంది.
నిబంధనల అమలును పర్యవేక్షించటానికి ప్రభుత్వం డేటా పరిరక్షణ బోర్డు (డీపీబీ) ఏర్పాటు చేస్తుంది. ఇదిగాక ప్రతి సంస్థా తమ ఖాతాదార్ల గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు, వినియోగదారుల నుంచి అవసరమైన అనుమతులు పొందేందుకు డేటా పరిరక్షణ ప్రత్యేక అధికారిని నియమించు కోవటం, నిఘా పెట్టడం తప్పనిసరవుతుంది. డేటా లీక్‌ను అరికట్టడంలో విఫలమయ్యే సంస్థకు రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు.
మొత్తంగా మనం పౌరుల డేటా పరిరక్షణలో వెనకబడినట్టే, సామాజిక మాధ్యమాల దుష్ప్ర భావాల నుంచి పిల్లల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న విషయంలోనూ వెనకబడ్డాం. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో 137 దేశాలు చాన్నాళ్ల క్రితమే డేటా పరిరక్షణ చట్టాలు తెచ్చాయి. అమెరికాలో పదమూడేళ్లలోపు పిల్లలు ఆన్‌లైన్ వీక్షణపై కఠిన నిబంధనలున్నాయి. యూరప్‌లో పదహారేళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల అనుమతి అవసరం.
ఆస్ట్రేలియా సామాజిక మాధ్యమాల్లో పదహారేళ్లలోపు పిల్లల ప్రవేశంపై ఇటీవలే పూర్తి నిషేధం విధించింది. మన దేశంలో లేదుగానీ... టిక్‌టాక్ వల్ల విదేశాల్లో ఎన్నో సమస్యలొస్తున్నాయి. టీనేజ్ పిల్లల్లో 58 శాతంమంది దాన్ని చూస్తు న్నారని ఒక సర్వే చెబుతోంది. పసిహృదయాలకు ఉండాల్సిన అమాయకత్వం మాయమై అవాంఛ నీయ పోకడలు ప్రవేశించి వారిలో విషబీజాలు నాటుతున్నాయి. తప్పుడు భావాలూ, అభిప్రా యాలూ వ్యాపిస్తున్నాయి.
పిల్లల సంగతలావుంచి... పెద్దలే వాటి మాయలో పడి తప్పుడు నిర్ణ యాలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా కలిగే నష్టం నేరుగా కనబడుతుంది. కానీ మానసికంగా అది కలగజేసే ప్రభావం లెక్కకు అందనిది. ఇప్పుడు ఏఐ సైతం వచ్చి ప్రమాద తీవ్రతను పెంచింది.
పిల్లల ముచ్చట కాదనకూడదని కార్లు, టూ వీలర్లు అందించి కొందరు తల్లిదండ్రులు పరోక్షంగా వారి చావుకు కారణమవుతున్నారు. ప్రజలకు ముప్పు కలిగిస్తున్నారు. అందువల్ల సామాజిక మాధ్య మాల్లో పొంచి వుండే ప్రమాదాలపై ముందు తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. పిల్లల సంరక్షణకు ఇది తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment