శాస్త్రవిజ్ఞాన విజయాలతో మానవాళి ఎప్పటికప్పుడు ముందడుగేయడం చరిత్రలో సంతోష సందర్భమే. గతవారం అలాంటి మరో సందర్భం ఎదురైంది. పుడమికి అతి సమీపంలో ఉండే గ్రహమైన చంద్రునిపై మరోసారి మానవ మేధ సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగింది. ఇప్పటి దాకా వివిధ దేశాల ప్రభుత్వాలు అధికారిక అంతరిక్ష పరిశోధనా సంస్థలతో అద్భుత విజయాలు సాధించడం చూశాం. ఈసారి ఓ ప్రైవేట్ సంస్థ చందమామపై జయకేతనం ఎగరేసింది. అమెరికాకు చెందిన ‘ఇన్‌ట్యూటివ్ మెషిన్స్’ (ఐఎం) సంస్థ ఫిబ్రవరి 22న ఓ రోబోటిక్ వ్యోమనౌకను చందమామపై సాఫ్ట్ ల్యాండ్ చేసింది.
ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం అయిదే దేశాలు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. అలా చూస్తే, ఒక ప్రైవేట్ సంస్థ ఆ అపురూప విన్యాసం చేయడం చెప్పుకోదగ్గ మైలురాయి. అయితే, చరిత్రలో రెండో పర్యాయం ఇప్పుడు మళ్ళీ జాబిల్లిపై వ్యోమయానం ఊపందుకున్న వేళ రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా నిర్దిష్టమైన అంతరిక్ష విధానం, ప్రత్యేక అంతరిక్ష చట్టం అవసరం ఉందని అర్థమవుతోంది.
అమెరికా అంతరిక్ష నౌక ఒకటి చంద్రమండల ఉపరితలంపై దిగడం గత 50 ఏళ్ళ పైచిలుకులో ఇదే ప్రథమం! అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ 1972లో అపోలో ప్రోగ్రామ్‌కు తెర దించిన తర్వాత మళ్ళీ ఆ దేశం చంద్ర మండల పునఃప్రవేశం మళ్ళీ ఇప్పుడే! చంద్రునిపై వ్యోమనౌక దిగడమనే సవాలులో మానవజాతి ఎన్నో ఏళ్ళుగా విజయాలు, వైఫల్యాలు – రెండూ చవిచూసింది. చంద్రునిపై దిగడంలో విఫలమైన ప్రతిసారీ వ్యోమనౌకల శకలాలు చంద్రోపరితలంపై చెల్లాచెదరై పడివుండడమూ చూశాం.
అంతెందుకు... గత నెలలో మరో అమెరికన్ సంస్థ ‘ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ’ సైతం ఓ ల్యాండర్‌ను చంద్రునిపైకి పంపాలని చూసింది. ఇంధనం లీకేజీతో ఆ యత్నాన్ని అర్ధంతరంగా ముగించింది. సదరు ల్యాండర్ భూవాతావరణంలోకి పునఃప్రవేశించి, పసిఫిక్ మహాసముద్రంపై దగ్ధమైంది. విఫలమైన ఆ ‘ఆస్ట్రోబోటిక్’, విజయవంతమైన ‘ఐఎం’ సంస్థ... రెండూ ‘నాసా’ అండతో వాణిజ్యపంథాలో చంద్రునిపైకి వ్యోమనౌకల్ని పంపే కృషిలో భాగమే. గగనాంతర సీమల గవేషణలో ప్రైవేట్ రంగ ప్రమేయం పెరుగుతున్న తీరుకు ఇది ఉదాహరణ.
చరిత్ర గమనిస్తే – 1966లోనే సోవియట్ యూనియన్ ‘లూనా9’ తొలిసారిగా చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. నాలుగు నెలల తర్వాత ‘సర్వేయర్1’తో అమెరికా విజయం సాధించింది. అది క్రమంగా చంద్రునిపైకి మానవయాత్రకు దారి తీసింది. 1969లో నాసా ‘అపోలో11’తో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్ద్రిన్‌లు చంద్రునిపై అడుగిడిన తొలి వ్యక్తులుగా చరిత్ర సృష్టించినప్పటి నుంచి ఇప్ప టికి అరడజనుకు పైగా యాత్రల్లో డజను మంది చంద్రునిపై కాలుమోపారు. 2026 చివరి కల్లా మరోసారి చంద్రునిపైకి మానవ యానానికి అమెరికా సిద్ధమవుతోంది.
మూడో దేశంగా చైనా, గత ఏడాది ‘చంద్రయాన్3’ ద్వారా రెండో ప్రయత్నంలో విజయం సాధించి నాలుగో దేశంగా భారత్ చంద్రునిపై ల్యాండింగ్ చేశాయి. ఈ జనవరిలో జపాన్ తప్పుదిశలో ల్యాండింగ్ జరిపినప్పటికీ, అసలంటూ చేసిన అయిదో దేశంగా ఆ జాబితాలో చేరింది. ఇప్పుడు ఐఎం విజయంతో చంద్రమండల యాత్రల్లో ప్రైవేట్ రంగ శక్తియుక్తులు హెచ్చనున్నాయి. మరిన్ని యాత్రలకు సన్నాహాలు సాగుతు న్నందున లోతైన అన్వేషణ, శాస్త్రీయ పరిశోధనలకు కలువలరేడు కేంద్రబిందువు కానున్నాడు.
నిజానికి, చంద్రునిపై దిగేందుకు ప్రైవేట్ సంస్థలు గతంలోనూ అనేక యత్నాలు చేశాయి. 2019లో ఇజ్రాయెల్ బెరేషీట్ చంద్రునిపై కుప్పకూలింది. 2023లో ఓ జపనీస్ సంస్థ తాలూకు ల్యాండర్ పడిపోయింది. తాజా ప్రైవేట్ ప్రయోగ విజయంలోనూ లోటుపాట్లు లేకపోలేదు. గ్రీకు పురాణా ల్లోని తెలివైన వీరుడు ‘ఒడిస్సియస్’ పేరు పెట్టుకున్న ఐఎం వారి వ్యోమనౌక ఆఖరుఘట్టంలో జాబిల్లి దక్షిణ ధ్రువానికి దగ్గరలో నేరుగా కాక అనుకున్నదాని కన్నా వేగంగా, పక్కవాటుగా దిగింది. దాంతో, ముందనుకున్నట్టు వారం కాకుండా, 2–3 రోజుల ముందే తట్టాబుట్టా సర్దుకుంటోంది.
అయితే, అసలంటూ ఐఎం విజయవంతం కావడంతో నాసా ‘కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్’ (సీఎల్పీఎస్) కార్యక్రమం కింద మరిన్ని ప్రైవేట్ ప్రయత్నాలు సాగుతాయి. 2020 నాటికి పూర్తయ్యేలా మరో 14 ప్రైవేట్ సంస్థలతో నాసా పెట్టుకున్న 260 కోట్ల డాలర్ల కాంట్రాక్టులే అందుకు తార్కాణం. ఇటీవలే భారత్ సైతం జాతీయ అంతరిక్ష రంగంలో నూరు శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టు బడులకు ద్వారాలు తెరిచింది. అంటే రానున్న రోజుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై భారం తగ్గి, ప్రైవేట్ రంగంలో భారతీయ అంకుర సంస్థల మధ్య పోటాపోటీ పెరగనుంది.
ప్రపంచమంతటా ఇలాంటి ప్రైవేట్ ప్రయత్నాలతో కష్టాలూ తప్పవు. 1967 నాటి ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ మినహా ఇప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష నిబంధనలేవీ లేవు. ఆ ఒడంబడిక సైతం అనుసరించాల్సిన విధుల జాబితాయే తప్ప, పాటించి తీరాల్సిన ఆదేశాలు కావు. తాజా ఒడిస్సియస్ దెబ్బతో వివిధ సంస్థలు చంద్రునిపైకి ఏవైనా పంపి, దాన్ని ఎలాగైనా నింపే వీలుంది. అందుకే, ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష, చంద్రమండల చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది.
లేదంటే, ఇప్పటికే ఉప గ్రహాలతో క్రిక్కిరిసిన దిగువ భూకక్ష్య లానే చంద్రమండలమూ నిండవచ్చని శాస్త్రవేత్తల జోస్యం. చంద్రునిపై నిర్ణీత ప్రాంతాలు శాస్త్రీయ పరిశోధనా శాలలకు కీలకం గనక అవాంఛనీయ పోటీ తప్పదు. విలువైన హీలియమ్3 కోసం చంద్రునిపై గనుల తవ్వకాలు జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. కాబట్టి, ఆచితూచి అడుగు వేయాల్సిన సందర్భమిది. నైతికతకు కట్టుబడి పరిశోధనలు సాగిస్తూనే, వెన్నెలరేడు వాతావరణాన్ని విధ్వంసం చేయనిరీతిలో చట్టాలు చేసుకోవాల్సిన సమయమిది.
ఆచితూచి అడుగేద్దాం!
Published Wed, Feb 28 2024 12:03 AM | Last Updated on Wed, Feb 28 2024 12:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment