‘హైటెక్’ బెట్టింగ్‌కు చెక్ | 'High-tech' betting to the check | Sakshi
Sakshi News home page

‘హైటెక్’ బెట్టింగ్‌కు చెక్

Published Mon, May 30 2016 11:53 PM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM

‘హైటెక్’ బెట్టింగ్‌కు చెక్ - Sakshi

‘హైటెక్’ బెట్టింగ్‌కు చెక్

ఇంట్లో షోకేసు వెనుక బెట్టింగ్ డెన్
గుట్టు రట్టు చేసిన పోలీసులు

 

క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన రాజేష్ అగర్వాల్, పవన్ గుప్తాలు కొత్త పంథాలో కార్యకలాపాలు సాగించారు. వీరిద్దరూ మరో ఐదుగురితో కలిసి హైటెక్ పద్ధతిలో ఈ దందా ప్రారంభించారు. మంగళ్‌హాట్ ఠాణా పరిధిలోని న్యూ ఆగాపురలో అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో బెట్టింగ్ డెన్ ఏర్పాటు చేశారు. పోలీసు నిఘాకు చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అనుకోని పరిస్థితుల్లో పోలీసులకు ఉప్పంది ఇంటిపై దాడి చేసినా.. దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. ఇంటి హాలుకు అనుబంధంగా ఉన్న గదిలో డెన్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి తలుపు స్థానంలో ఓ షోకేస్‌ను ఏర్పాటు చేశారు. అద్దాలతో కూడిన దానికి ఎలాంటి హ్యాండిల్స్ సైతం లేకపోవడంతో అది తలుపని గుర్తించడం సాధ్యం కాదు. ఈ ఇంటిపై దాడి చేసిన ఈస్ట్‌జోన్ పోలీసులూ తొలుత అలానే భావించారు. అయితే అద్దాలతో చేసిన ఆ షోకేస్‌లో ఎలాంటి అలంకరణ వస్తువులు, బొమ్మలు లేకుండా ఖాళీగా ఉండటంతో అనుమానించి క్షుణ్నంగా పరిశీలించారు. దీంతో అది తలుపని గుర్తించి లోపలకు ప్రవేశించగా... ఏసీ, పరుపులు, దివాన్ దిళ్లు, ల్యాప్‌టాప్, హాట్‌లైన్ బాక్సులు, టీవీ తదితరాలు బయటపడ్డాయి. ఈ డెన్ నుంచి టాస్క్‌ఫోర్స్ టీమ్ ఉపకరణాలతో పాటు రూ.12.05 లక్షలు స్వాధీనం చేసుకుంది.    - సాక్షి, సిటీబ్యూరో

 

సిటీబ్యూరో: టీ-20 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో హైటెక్ పంథాలో బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలు చిక్కాయి. నలుగురు నిందితుల్ని పట్టుకున్నామని, మరో ఆరుగురు పరారీలో ఉన్నారని ఇన్‌చార్జి పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వీరి నుంచి రూ.20.07 లక్షల నగదు, ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డితో కలిసి కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా శృంగవరానికి చెందిన పీఎస్‌పీఆర్‌ఎస్ సోమరాజు, వి.వినోద్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరిద్దరూ విజయవాడకు చెందిన కుమార్‌తో కలిసి బెట్టింగ్ దందా ప్రారంభించారు. బుకీలుగా మారిన ఈ ముగ్గురూ సోమాజిగూడలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని పంటర్ల నుంచి ఫోన్ల ద్వారా పందేలు అంగీకరిస్తున్నారు. అలాగే నగరంలోని గోషామహల్, హుస్సేనిఆలం ప్రాంతాలకు చెందిన రాజేష్ అగర్వాల్, పవన్ గుప్తా మంగళ్‌హాట్‌లోని న్యూ ఆగాపురలో డెన్ ఏర్పాటు చేసుకున్నారు. బేగంజార్‌కు చెందిన మున్నా ధూట్, సుధీర్, అరుణ్‌రెడ్డి, ధర్మలతో పాటు మహారాష్ట్రకు చెందిన గోపాల్ వీరికి సహకరిస్తున్నాడు.


ఓ పక్క బాక్సులు.. మరోపక్క రికార్డర్లు...
కొన్నేళ్ళుగా ‘ఇదే వృత్తి’లో కొనసాగుతున్న ఈ బుకీలు నాలుగు హాట్‌లైన్ బాక్సులు సమీకరించుకున్నారు. ఒక్కో హాట్‌లైన్ బాక్సునూ కనిష్టంగా 16 నుంచి గరిష్టంగా 24 సెల్‌ఫోన్లకు అనుసంధానించే అవకాశం ఉంటుంది. ఆ ఫోన్లలో కేవలం పంటర్లతో మాట్లాడటానికి వినియోగించే సిమ్‌కార్డుల్ని మాత్రమే వేస్తారు. ఈ సిమ్‌కార్డుల్నీ బోగస్ పేర్లతో వివిధ ప్రాంతాల నుంచి సమీకరించారు. వీటిని ఓ స్పీకర్‌కు అనుసంధానించారు. ఒక్కోఫోన్ వస్తే అక్కడ ఉండే ఆపరేటర్ దీని ద్వారా సంభాషిస్తాడు. అన్ని సెల్‌ఫోన్లకూ ఒకేసారి ఫోన్లు వచ్చినా...సంభాషణలన్నీ హాట్‌లైన్ బాక్సులో రికార్డు అయిపోతాయి. ఎంత పందెం కాశారు? ఏ జట్టు వైపు కాశారు? అనేవి తెలుసుకోవడానికి, ఆట ముగిసిన తరవాత లావాదేవీల్లో ఆధారంగానూ ఆ రికార్డింగ్స్ ఉపకరిస్తాయని నిందితులు వెల్లడించారు. దీంతో పాటు వీరు ప్రముఖ కంపెనీకి చెందిన ఓ వాయిస్ రికార్డర్‌ను వాడుతున్నారు. పాత, కొత్త పంటర్ల నుంచి పందేలు అంగీకరిస్తున్న ఈ గ్యాంగ్ వారికి కొన్ని కోడ్‌వర్డ్స్ చెప్తుంది. దానికి సంబంధించిన కాల్స్‌ను రికార్డు చేయడానికి దీన్ని వినియోగిస్తున్నారు. ఈ వాయిస్ రికార్డర్‌ను కేవలం ఒక ఫోన్‌కు మాత్రమే కనెక్ట్ చేసే అవకాశం ఉంది. దాని ద్వారానే పంటర్లకు కాల్ చేస్తూ, వారి నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ ఆధారాలు భద్రపరుచుకోవడం ప్రారంభించారు. ఈ రెండు ముఠాలకూ మరో ప్రత్యేకత కూడా ఉంది. వీరు పంటర్ల (పందేలు కాసే వ్యక్తులు) జాబితాను భద్రపరచడానికి, లావాదేవీలు చేయడానికి ల్యాప్‌టాప్స్ వినియోగిస్తున్నారు. ఆట ముగిసిన తరవాత నగదు వసూలు, చెల్లింపులప్పుడు వీటి ఆధారంగానే లెక్కలు తేలుస్తున్నారు. ఈ రెండు గ్యాంగ్‌లపై టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఈస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం రాజేష్, పవన్‌లను, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలోని బృందం సోమరాజు, వినోద్‌కుమార్‌లను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

 
కుషాయిగూడలో...

కుషాయిగూడ: బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఎస్‌ఓటీ, కుషాయిగూడ పోలీసులు రట్టు చేశారు. స్థానిక వాసవీ శివనగర్‌లో కొంతమంది యువకులు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం తెల్లవారుజామునఆకస్మిక దాడులు జరిపి బుకీలు సచిన్, జగన్‌రెడ్డితో పాటుగా కలెక్షన్ ఎజెంట్ రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ: 1.15 లక్షల నగదు, 15 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటుగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న టి. సాయికిరణ్‌రెడ్డి, ఎం.శ్రీకాంత్‌రెడ్డి, సి.మణిశంకర్, ఎం.విశాల్, ఎం.దావల్, ఎం.జయరాజ్‌రెడ్డి, ఎ.కరణ్, ఎం.నర్సింగ్ అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement