లగచర్ల ఘటనపై పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో సంబంధం ఉందంటూ అరెస్టు చేసిన నలుగురు రైతులను విడుదల చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వారి వద్ద రూ.25 వేల వ్యక్తిగత బాండ్ తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా జైలు సూపరింటెండెంట్‌కు సూచించింది. ఒకే అంశంపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాది (పీపీ)కి స్పష్టం చేస్తూ, తదుపరి విచారణ వచ్చే నెల 12కు వాయిదా వేసింది.
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనకు సంబంధించి బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో రైతులు ముదావత్ రమేశ్, గోపాల్ నాయక్, మదారయ్య, మంగ్యా నాయక్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొలి ఎఫ్‌ఐఆర్ 153లో వీరిని అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ 154, 155లోనూ వీరు నిందితులని పేర్కొంటూ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించారు.
ఒకే అంశంపై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని, కావాలని పోలీసులు మరో రెండు కేసులు పెట్టారని పేర్కొన్నారు. 154, 155లను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టారు.
పేర్లు తప్ప వారి పాత్రపై వివరాలు ఏవీ?
ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ.. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 154, 155 ఎఫ్‌ఐఆర్‌లలో పిటిషనర్లను పోలీసులు నిందితులుగా చేర్చారని చెప్పారు. అయితే పిటిషనర్ల పేర్లు ప్రస్తావించడం తప్ప వారికి వ్యతిరేకంగా ఏమీ పేర్కొనలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
పిటిషనర్ల పాత్ర ఏంటో వివరించలేదన్నారు. పిటిషనర్లు వ్యవసాయదారులని, దాదాపు మూడు నెలలుగా జైల్లో ఉంటున్నారని గుర్తు చేశారు. వారి వద్ద వ్యక్తిగత బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment