అక్రమాలకు పాల్పడ్డ పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా?
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం
నివేదిక దాఖలుకు సమయం కోరిన ఏఏజీ.. విచారణ 20కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 2017లో దళితులపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులపై నమోదు చేసిన కేసు పురోగతి వివరాలను నెల రోజుల్లోగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బాధితులకు పరిహారం ఇచ్చారా? పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా? లాంటి వివరాలను అందులో పొందుపరచాలని స్పష్టం చేసింది.
తొలుత విచారణకు హాజరైన ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు వివరాలు తెలియకుండా, గడువు కోరడం కోసం ఎందుకు హాజరయ్యారంటూ మందలించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
ఇదీ కేసు నేపథ్యం..
చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి వందలాది ఇసుక లారీలు, టిప్పర్లు నడిచేవి. ఇసుకను తరలించే క్రమంలో జరిగిన 42 ప్రమాదాల్లో మొత్తం నలుగురు చనిపోయారు. ముఖ్యంగా 2017 జూలై 2న నేరెళ్లకు చెందిన ఎరుకల భూమయ్య అనే వ్యక్తిని ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఐదు ఇసుక లారీలను తగలబెట్టారు. దీంతో పోలీసులకు, స్థానికుల మధ్య ఉద్రిక్తత నెలకొనగా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండు రోజుల తర్వాత రాత్రి 11:30 గంటలకు నేరెళ్లకు చెందిన పెంట బానయ్య, కోలా హరీశ్, చెప్పాల బాలరాజు, పసుల ఈశ్వర్ కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన భక్తుల మహేశ్, జిల్లెళకు చెందిన కోరుకొండ గణేశ్, చీకోటి శ్రీనివాస్‌లను పోలీసులు అనుమానితులుగా అదుపులోకి తీసుకొని జూలై 7న అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
బాధితులకు పరిహారం ఇచ్చారా?
ఈ ఘటనలో దళితులు, బీసీ యువకులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని.. బాధ్యులైన ఎస్పీ విశ్వనాథ్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు పిల్‌లు దాఖలయ్యాయి. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
అక్రమాలకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకున్నారా? ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా? చార్జిషీట్ దాఖలు చేశారా? బాధితులకు పరిహారం ఇచ్చారా? అని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఏజీపీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆగ్రహంవ్యక్తం చేసింది. అదనపు అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడం కోసమే హాజరుకావడాన్ని తప్పుబట్టింది. దీంతో వెంటనే ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ విచారణకు హాజరయ్యారు.
పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని కోర్టుకు తెలిపారు. విచారణ ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించగా పూర్తి వివరాలతో స్థాయీ నివేదిక దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 20కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment