AP: పోలీసు ఉద్యోగ పరీక్షలో దొడ్డిదారి యత్నం! | Man Cheating Fake hall ticket In Police Exam | Sakshi
Sakshi News home page

AP: పోలీసు ఉద్యోగ పరీక్షలో దొడ్డిదారి యత్నం!

Published Wed, Jan 22 2025 1:39 PM | Last Updated on Wed, Jan 22 2025 1:53 PM

Man Cheating Fake hall ticket  In Police Exam

నకిలీ హాల్‌ టికెట్‌ సృష్టించి దొరికిపోయిన వైనం 

 చీటింగ్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు

కర్నూలు: ఎలాగైన పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొంతకాలంగా సాధన చేసిన ఓ అభ్యర్థి ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిల్‌ కావడంతో దొడ్డిదారిలో యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అధికారులను మోసగించే క్రమంలో అక్కడ సాంకేతికత ద్వారా గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని 4వ పట్టణ పోలీసు స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్‌ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో డిసెంబరు 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. 

అందులో భాగంగా మంగళవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్‌ గ్రామానికి చెందిన పి.నరసింహుడు కుమారుడు పబిత తిరుమల బయోమెట్రిక్‌కు హాజరయ్యాడు. అయితే, అతను ఎత్తు, ఛాతి కొలతల్లో ఫెయిల్‌ కావడంతో వె నక్కి పంపారు. అయితే క్వాలిఫై అయినట్లుగా హాల్‌ టికెట్‌ను కలర్‌ జిరాక్స్‌ తీసుకొని.. క్వాలిఫై అయినట్లు టిక్‌ మార్క్‌ వేసుకొని 1600 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు వరుస క్రమంలో నిలబడి మోసగించేందుకు ప్రయత్నించగా...స్టాటింగ్‌ పాయింట్‌ బందోబస్తు డ్యూటీలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ నాగభూషణం గుర్తించి అభ్యర్థి మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. 

పాడ్‌ క్యారియర్‌ లేకుండా 1600 మీటర్ల పాయింట్‌ వద్ద ఆర్‌ఎప్‌ఐడీ రిజిస్ట్రేషన్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ జయరాం దగ్గరకు వెళ్లి పరిశీలించగా...సిస్టమ్‌లో అభ్యర్ధి పేరు చూపడం లేదని, హాల్‌ టికెట్‌లో మాత్రం క్వాలిఫై అయినట్లుగా నకిలీ తయారు చేసి టిక్‌ మార్క్‌ వేసుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ బింధుమాదవ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. 4వ పట్టణ పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు అభ్యర్థి పబిత తిరుమలపై చీటింగ్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ గోపీనాథ్‌ తెలిపారు.కాగా 11 రోజు మంగళవారం పోలీసు కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలకు మొత్తం 600 మందిని ఆహ్వానించగా... 412 మంది వచ్చారు. వీరిలో ప్రధాన పరీక్షకు మంగళవారం 267 మంది ఎంపికయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement