వీరఘట్టం/ శ్రీకాకుళం సిటీ: ఐ.పి.ఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బెట్టింగ్‌రాయుళ్లు రంగంలోకి దిగారు. పెద్ద మొత్తం సొమ్ము వస్తుందని ఆశ చూపుతూ అమాయక యువతను ముగ్గులోకి దింపుతున్నారు. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బెట్టింగ్‌లు నేడు గ్రామీణ ప్రాంతాలకు పాకడంతో రూ.లక్షల బెట్టింగ్‌లు కాస్తూ కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
పోలీసులు ఎంత నిఘా పెట్టిన చాపకింద నీరులా బెట్టింగ్ జోరు కొనసాగుతునే ఉంది. ముఖ్యంగా వీరఘట్టంలో రోజూ రూ.10 లక్షల మేర బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. వీరఘట్టం అంబేడ్కర్ జంక్షన్‌లో ఉదయం 7 నుంచి 9గంటల వరకూ ఇవే చర్చలు.
వెయ్యి, మూడు వేలకు పందాలు కాస్తూ బెట్టింగ్ బంగార్రాజులు చెలరేగిపోతున్నారు. చిన్నచిన్న కిరాణషాపులు, పకోడి బడ్డీలు, బంగారం షాపులు, పాన్‌షాపుల వద్ద ఈ తతంగం జరుగుతోంది. ఒక్క వీరఘట్టంలోనే కాకుండా దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
అరెస్టులు చేసినా..
ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి ఇక్కడ విధులు నిర్వహించిన సమయంలో బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బెట్టింగ్‌లతో సంబంధాలు ఉన్న వ్యక్తి జిల్లాకు చెందిన వాడు కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
ఆన్‌లైన్ల్ దారా రూ.కోట్లల్లో బెట్టింగ్‌లకు పాల్పడినట్లుగా ఈ ముఠా పోలీసులు గుర్తించారు. పట్టణంలో పుప్పాలవారివీధిలో ఓ వ్యక్తి నివాసంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి బెట్టింగ్ కిరణ్‌తో పాటు మరో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.18 లక్షల నగదు, 11 తులాల బంగారం, కేజీ వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
అంతా ఆన్‌లైన్‌లోనే..
గతంలో ముఖాముఖిగా బెట్టింగ్‌లు కాసేవారు. కంప్యూటర్ పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఆండ్రాయిడ్ ఫోన్లతో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు తెర తీశారు. పాలకొండ, తోటపల్లి, పార్వతీపురం, విశాఖపట్నం, బరంపురం తదితర పట్టణాల్లో క్రికెట్ మాఫియాతో కొంతమందికి సంబంధాలు ఉండడంతో బెట్టింగులు జోరందుకున్నాయి.
చర్యలు తప్పవు
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు చేపడతాం. యువత ఇటువంటి బెట్టింగ్‌ల జోలికి వెళ్లి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో నిఘా వేసి బెట్టింగ్ రాయుళ్లను అడ్డుకుంటాం. – స్వరూపారాణి, డీఎస్పీ, పాలకొండ
డయల్ 100కు సమాచారం ఇవ్వండి
బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు. ఆధారాలు లేవనుకుంటే పొరపాటే. మొబైల్ ఫోన్, ఆన్‌లైన్ ద్వారా ఇటువంటి బెట్టింగ్‌లకు పాల్పడితే ఆ సమాచారం క్షణాల్లో ముందుంటుంది. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. – టి.పనసారెడ్డి, అడిషనల్ ఎస్పీ, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment