చిక్కడు..దొరకడు!
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో సంచలనం సృష్టించిన ఏటీఎంలలో నగదు మాయం కేసు నిందితుడు ఏ ఒక్కచోటా రెండు రోజులకు మించి ఉండకుండా పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. రాష్ట్రాల సరిహద్దులు దాటి తలదాచుకుంటున్నాడు. ఈనెల 17న ఒంగోలులో పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
నగదు మాయం సూత్రధారి పూరిమిట్ల రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలన్న పోలీసులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తొలుత రవి బాబాయి పూరిమిట్ల శ్రీనివాసరావును పోలీసులు విచారించారు.
దీనికి మనస్తాపం చెందిన శ్రీనివాసరావు రెండో రోజు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కేసు విచారణ విషయంలో పోలీసులు కొంత స్పీడు తగ్గించారు. అతని ఆత్మహత్యకు పోలీసుల విచారణ కారణం కాదని, తన అన్న కొడుకు ప్రజల సొమ్ము కాజేశాడని తెలిసినవాళ్లంతా అడుగుతుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్న విషయం విదితమే. అప్పటి వరకూ రాష్ట్ర సరిహద్దుల్లో సంచరించిన రవి.. ఆ తర్వాత రాష్ట్రాల సరిహద్దులు దాటిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది.
సాంకేతిక పరిజ్ఞానంపై రవికి పట్టు
రవి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టుంది. తన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అక్రమాలకు పాల్పడటం అలవాటు చేసుకున్నాడు. ఏటీఎంలలో రెండో పాస్‌వర్డ్‌ను సైతం తస్కరించి గుట్టుచప్పుడు కాకుండా 40 లక్షలు కాజేసాడంటేనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అతడు ఏ విధంగా వినియోగించుకున్నాడో అర్థమవుతోంది.
క్రికెట్ బెట్టింగుల్లో కూడా చాలా నగదు పోగొట్టుకున్నట్లు సమాచారం. రవి వద్ద ఇంకా నగదు దండిగానే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్రికెట్ బెట్టింగుల్లో లక్షలకు లక్షలు పోగొట్టుకున్న విషయం బాబాయి శ్రీనివాసరావుకు కూడా తెలుసని పోలీసుల వద్ద సమాచారం ఉంది. క్రికెట్ బుకీలు, మధ్యవర్తుల సమాచారాన్ని కూడా పోలీసులు ఒక్కొక్కటిగా రాబడుతున్నారు.
నిందితుడు ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు పోలీసులకందిన సమాచారం. తరచూ సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు మారుస్తూ రెండు రోజులకు మించి ఎక్కడా ఉండటం లేదు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు పట్టుకుంటారని ముందే పసిగట్టి తరచూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాడు. దీంతో అతని ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఒంగోలు ఒన్‌టౌన్ సీఐ కేశన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుని కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.
ఇతరుల పాత్రపైనా అనుమానాలు
ప్రధాన సూత్రధారి రవి పోలీసులకు దొరికితేగానీ ఇతరుల పాత్ర ఏ మేరకు ఉందో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకరిద్దరికి ఈ నగదు మాయంతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. రవితో పాటు కస్టోడియన్‌గా పనిచేస్తున్న అశోక్ ప్రమేయంపై కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. అందుకే ప్రధాన సూత్రధారి కోసం వేట ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణతో క్రికెట్ బుకీల బండారం కూడా బయట పడే అవకాశం లేకపోలేదు.