అమాయకంగా చూస్తున్న చిన్నారులు, రవి (ఫైల్)
గుండెపోటుతో తండ్రి మృతి
దిక్కులు చూస్తున్న పిల్లలు
కరీంనగర్: ‘అమ్మా.. నాన్నకు ఏమైంది..? నాన్నాను ఎక్కడికి తీసుకెళ్తన్నారు.. ? మళ్లీ ఎప్పుడొస్తాడు..? అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా..’ అంటూ ఆ చిన్నారులిద్దరూ అమాయకంగా అడుగుతుంటే ఏమని చెప్పాలో తెలియక అక్కడున్న వారందరూ గుండెలవిసేలా రోదించారు. నాన్న దూరమై చిన్నారులు.. కట్టుకున్న వాడు దూరమై భార్య, వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు దూరమై గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.
స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూగల రవి (35) ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి మూడు నెలల క్రితమే ఇంటికొచ్చాడు. ప్రస్తుతం స్థానికంగా కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. అప్పటివరకూ అందరితో కలివిడిగా గ్రామంలో తిరిగిన రవి గుండెనొప్పి బారిన పడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు.
రవికి భార్య జ్యోతి (29), కూతుళ్లు శాన్వి (7), సమన్వి (4) ఉన్నారు. రవి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. చివరి దశలో ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు దూరమై తల్లిదండ్రులు, తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త మధ్యలోనే వదిలేసి వెళ్లడంతో వారి రోదనలు మిన్నంటాయి. తండ్రికి ఏమైందో తెలియని ఆ చిన్నారులు అమాయకంగా చూస్తుండడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment