పసి 'హృదయాలు' కూడా లయ తప్పుతున్నాయి.. కార‌ణం !? | - | Sakshi
Sakshi News home page

పసి 'హృదయాలు' కూడా లయ తప్పుతున్నాయి.. కార‌ణం !?

Published Tue, Jan 2 2024 12:30 AM | Last Updated on Tue, Jan 2 2024 11:42 AM

- - Sakshi

'పసిహృదయాలు లయ తప్పుతున్నాయి. చిన్నప్రాయంలోనే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మారిన జీవన విధానం.. ఆహారపు అలవాట్లు.. కారణం ఏదైతేనేమీ పసిహృదయాలు పట్టేస్తున్నాయి. గుండెపోటు(హార్ట్‌ఎటాక్‌)కు గురవుతున్నారు. ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ ముగిసిన తర్వాత క్రమంగా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి.'

ప్రాణాలు పోతున్నాయి..
ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. మన శరీరంలో అతి ప్రధాన అవయవం గుండె. దీన్ని కాపాడుకోవడంలో నిర్లక్ష్యం దరి చేరనీయొద్దు. గతంలో దీర్ఘకాలిక వ్యాధులబారిన పడిన వారు, వయస్సు మళ్లిన వారు గుండెపోటుకు గురైన సంఘటనలు చూశాం. కానీ కొన్నాళ్లుగా టీనేజ్‌ యువత గుండెపోటుతో మరణిస్తుండడం కలవరం కలిగిస్తుంది. మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధిక మద్యపానం, ధూమపానం, బీపీ, షుగర్‌, లావు పెరగడం, ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా గుండెపోటుకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

అవగాహన కల్పిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ
గుండెపోటుకు కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అవగాహన కల్పిస్తుంది. హఠాత్తుగా గుండెపోటుకు గురైన వారికి అందించాల్సిన అత్యవసర చికిత్స, టెక్నిక్స్‌పై గత మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో సీపీఆర్‌ అండ్‌ ఏఈడీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలోని మెడికల్‌ ఆఫీసర్స్‌(75), ఎంఎల్‌హెచ్‌పీ(63), సూపర్‌వైజర్లు(79), స్టాఫ్‌నర్సు(85), ఏఎన్‌ఎం(145), ఆశలు(475), ఫార్మసిస్టులు(5), ల్యాబ్‌టెక్నీషియన్స్‌(19), ఇతరులు(318) మొత్తంగా 1,264 మందికి వైద్యాధికారులు సీపీఆర్‌ శిక్షణ ఇచ్చారు. ప్రజలతో ఎక్కువగా మమేకమై ఉండే ఆర్టీసీ సిబ్బంది, జర్నలిస్టులు, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, పోలీస్‌, ప్రజాప్రతినిధులు తదితరులకు సీపీఆర్‌ విధానంతో గుండెపోటుకు గురైన వ్యక్తులను ప్రాణాపాయం నుంచి రక్షించేలా అవగాహన కల్పించారు.

గుండెపోటు లక్షణాలు..

  • హార్ట్‌ డిసీజ్‌కు గురయ్యే వారిలో ఎక్కువగా పోస్ట్‌ కోవిడ్‌ బాధితులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల వస్తున్న గుండె సమస్యల్లో కరోనా బాధితులే ఎక్కువ.
  • చాతిలో అసౌకర్యంగా ఉండడం, నొప్పి రావడం, పిండినట్లు అనిపించడం.
  • భుజం, చేయి, వీపు, మెడ, దవడకు వ్యాపించే నొప్పి, ఎగువ బొడ్డు వరకు నొప్పి అనిపించవచ్చు.
  • చెమటలు పట్టడం, అలసటగా ఉండటం, గుండెల్లో మంట, మైకము కమ్మడం.
  • వికారంగా ఉండటం, శ్వాస ఆడకుండా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పాటించాల్సిన జాగ్రత్తలు!

  • ముఖ్యంగా ఆహార నియమాల్లో మార్పు అవసరం. తీసుకునే ఆహారంలో పీచు(ఫైబర్‌) పదార్థం ఎక్కువగా ఉండాలి.
  • శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు అందేలా చూసుకోవాలి. విటమిన్‌ లోపాలు రాకుండా పౌష్టికాహారం తీసుకోవాలి.
  • కొలెస్ట్రాల్‌ పెంచే కొవ్వు పదార్థాలు, మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి.
  • మద్యపానం,ఽ ధూమపానం, పొగాకులకు దూరంగా ఉండాలి.
  • సరైన వ్యాయామం చేయాలి.
  • బీపీ, షుగర్‌, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనలు పాటించాలి.
  • జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఇంట్లో కూడా వేపుళ్లు, అధిక మాంసాహారం తీసుకోవద్దు.

- 'సిరిసిల్ల పట్టణానికి చెందిన పద్దెనిమిదేళ్ల విద్యార్థిని గత నెలలో హైదరాబాద్‌లోని కళాశాలలో తరగతిగదిలోనే కుప్పకూలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా గుండెపోటు(కార్డియక్‌ అరెస్ట్‌)కు గురైందని వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖమే మిగిలింది.'

- 'కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన పదమూడేళ్ల సుశాంత్‌ క్రిస్మస్‌ రోజున తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్లాడు. అక్కడే వేడుకల్లో అందరి ముందే హఠాత్తుగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. హుటాహుటిన సిరిసిల్లకు తరలించినప్పటికీ ప్రాణాలు గాలిలో కలిశాయి. అప్పటి వరకు తమతోపాటు సంతోషంగా గడిపిన కొడుకు గంటలోపే జీవచ్ఛవంలా మారడంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోయింది.'

నిర్లక్ష్యం చేయొద్దు..
చాతిలో నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గుండె వ్యాధిగా అనుమానం ఉంటే కార్డియాలజిస్టు వద్దకు వెళ్లాలి. సడన్‌ హార్ట్‌ఎటాక్‌తో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిని రక్షించడానికి కార్డియో పల్మనరీ రెసిపిటేషన్‌(సీపీఆర్‌), ఆటోమెటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్‌(ఏఈడీ) శిక్షణ ఇచ్చాం. – సుమన్‌ మోహన్‌రావు, డీఎంహెచ్‌వో

ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి..
గుండెపోటుకు గురైన వారికి ఇచ్చే మందు టెనెక్టప్లేస్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. శరీరంలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంతో గుండెపోటు వస్తుంది. అన్ని వయస్సుల వారు శరీరానికి సరైన వ్యాయామం అందించాలి. జంక్‌ఫుడ్‌ తినకుండా ఆరోగ్యాన్నిచ్చే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పౌష్టికాహారం తీసుకుంటూ.. బీపీ, షుగర్‌ పేషెంట్లు ఎప్పటికప్పుడు వైద్యుల సూచనలు పాటించాలి. – డాక్టర్‌ మురళీధర్‌రావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement