ఎన్‌కౌంటర్‌లో దామోదర్ మృతిచెందారన్న ప్రచారం నేపథ్యంలో తమవారి కోసం మావోయిస్టు కుటుంబాల ఆవేదన
ఎక్కడ ఎన్‌కౌంటర్ అయినా వారి గుండెల్లో ఆందోళన
తమవాళ్లు ఎక్కడ అంటూవెతుకులాట.. ఒక్కసారైనా చూడాలని ఆరాటం
దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే సీనియర్ మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలు.. అజ్ఞాతంలోకి వెళ్లిన తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ మావోయిస్టుల జాడ నేటికీ తెలియలేదు. ఉడుకురక్తం.. విప్లవ భావాలతో 80, 90వ దశకంలో అడవిబాట పట్టిన ఆనాటి పట్టభద్రులు దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి దశ, దిశలా మారారు. కేంద్ర కమిటీ సభ్యులుగా.. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీల్లో నూ కీలకంగా వ్యవహరించారు.
తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల వేట తీవ్రం కావడంతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా దండకారణ్యాల్లోకి వలస వెళ్లారు. అక్కడ నుంచే ఉద్యమాన్ని నడుపుతున్నారు. అయితే కరోనా అనంతరం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొందరు కీలక నేతలు అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధాప్యం కారణంగా అడవిలోనే తనువు చాలిస్తుంటే.. మరికొందరు ఎదురుకాల్పుల్లో మరణిస్తున్నారు.
దీంతో మిగిలిన వారు ఎలా ఉన్నారో? అనే ఆందోళన ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్లో నెలకొంది. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ మరణించారన్న వార్తల నేపథ్యంలో కీలక నేతలందరి బంధువులు వారి క్షేమం గురించి ఆందోళన చెందుతున్నా రు. తాము చనిపోయేలోగా వారిని ఒక్కసారైనా కళ్లారా చూసుకోవాలని తాపత్రయపడుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే అధికం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీకి మాస్టర్‌మైండ్‌గా వ్యవహరిస్తున్నారు. 74 ఏళ్ల వయసులోనూ పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పోతుల కల్పన అలియాస్ సుజాత (65) అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం.
ఆమె మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ రాంజీ భార్య. పెద్దపల్లి జిల్లాకు చెందిన కంకణాల రాజిరెడ్డి, మల్లోజుల వేణుగోపాల్‌రావు, మల్లా రాజిరెడ్డి, పూల్లూరి ప్రసాదరావు, జగిత్యాలకు చెందిన తిప్పిరి తిరుపతి, కడారి సత్యనారాయణరెడ్డి (సిరిసిల్ల) వంటి నేతలు కేంద్ర కమిటీ సభ్యులుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే అధికంగా ఉన్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గాజర్ల రవి (జయశంకర్ భూపాలపల్లి), మోడెం బాలకృష్ణ (హనుమకొండ) సెంట్రల్ కమిటీ మెంబర్, కందగట్ల యాదగిరి (హనుమకొండ) స్టేట్ కమిటీ మెంబర్, ముప్పిడి సాంబయ్య (హనుమకొండ) స్టేట్ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నారు.
భర్త జాడ చెప్పండి
నా భర్త బెజ్జారపు కిషన్ 38 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆయన ఆచూకీ దొరకలేదు. దీనిపై ఎన్నోసార్లు మావోయిస్టు వర్గాలకు, పోలీసులకు విన్నవించినా ఫలితం దక్కలేదు. ఇప్పటికైనా నా భర్త ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో చెప్పాలి. ఆయన కోసమే ఇంకా బతికున్నా. – బెజ్జారపు పుష్ప
బడే దామోదర్‌కు ఏమైంది?
» సంఘటనా స్థలంలో మావోయిస్టు అగ్రనేత గాయపడినట్టుగాసమాచారం
» చనిపోయాడని అధికారికంగానిర్ధారించని పోలీస్ యంత్రాంగం
» ఫేక్ లేఖ అంటున్న దామోదర్ అనుచర వర్గాలు
ములుగు/ఎస్‌ఎస్ తాడ్వాయి: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌కు ఏమైందంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేర్– మారేడుపాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దా మోదర్ మృతి చెందాడని శనివారం మావోయిస్టుపార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట విడుదలైన లేఖ ఫేక్ అంటూ దామోదర్ అనుచరులు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో దామోదర్ అక్క డే ఉన్నారని, ఆ సమయంలో గాయాలపాలైన ఆయన్ను అనుచరులు భద్రంగా మరోచోటకు తరలించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం దామోదర్ ఆరో గ్యం నిలకడగా ఉందని, ఆయన ప్రాణానికి ఎలాంటి హాని లేదని సమాచారం. సాధారణంగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు కుటుంబాలకు పోలీస్‌శాఖ తరఫున మరణవార్త తెలపడంతోపాటు మృతదేహాన్ని అప్పగిస్తారు. దామోదర్ మృతి చెందినట్టు ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా పోలీస్‌శాఖ తరఫున కాల్వపల్లిలోని దామోదర్ తల్లి బతుకమ్మ, కుటుంబ సభ్యులకు, ములుగు జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో దామోదర్‌కు ఎలాంటి హాని జరగలేదని, కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాల్వపల్లివాసులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment