క్రికెట్ బెట్టింగు
పెళ్లకూరు : జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లెలకు సైతం పా కింది. యువతను లక్ష్యంగా చేసుకుని బుకీలు బెట్టింగులు నిర్వహిస్తున్నారు. నగదు సంపాదించవచ్చనే ఆశతో యువత బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని గాడి తప్పుతున్నారు. నగదు కోసం చోరీలకు సైతం పాల్పడుతూ తల్లిదండ్రులకు తలవంపులు తెస్తున్నారు.
బెట్టింగ్‌ల నిర్వహణ ఇలా..
ప్రస్తుతం ఐపీఎల్ టీ 20 క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. రాత్రి వేళ మ్యాచ్‌లు జరిగే సమయంలో యువత టీవీల ముందు కూర్చుని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఓవర్‌లో బ్యాట్స్‌మెన్ సిక్స్, ఫోర్లు కొడతాడా..అవుటవుతాడా, సెంచరీ చేస్తాడా.. బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు..మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారు..తదితర అంశాలపై వేల రూపాయల బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. నగదు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుని అప్పుల పాలవుతున్నారు. చోరీలకు సైతం పాల్పడుతూ బెట్టింగ్‌లు కాస్తున్నట్లుగా సమాచారం.
దారితప్పుతున్న యువత
పెళ్లకూరు మండలంలోని శిరసనంబేడు, రాజుపాళెం గ్రామాల్లో సుమారు నాలుగు వందలకుపైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వ్యవసాయం, మూగజీవాల పోషణపై ఎక్కువ మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ పల్లెల్లో కొందరు యువకులు బెట్టింగులు నిర్వహిస్తున్నారు. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి నగదు కోసం చోరీలకు పాల్పడుతున్నారు. పెద్దలకు తెలియకుండా మూగజీవాలను విక్రయించి తద్వారా వచ్చే సొమ్ముతో బెట్టింగులు కాస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏమి చేయాలో తోచక ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డలు ఉన్నత చదువులు చదువుతున్నారని రోజంతా కాయకష్టం చేసి కూడబెట్టిన డబ్బును అందిస్తున్న తల్లిదండ్రులకు యువత తీరు వేదన కలిగిస్తోంది.
ఒకరిని చూసి ఒకరు క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి చదువును నిర్లక్ష్యం చేస్తుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ యువకుడు తన ఇంట్లో దాచిన నగదును అదే గ్రామానికి చెందిన మరొకరితో కలిసి బెట్టింగుల కోసం చోరీ చేశాడు. విషయం తెలుసుకుని యువకుని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా పరారయ్యాడు. భవిష్యత్తుపై అవగాహన లేని యువకులు బెట్టింగ్‌ల కోసం చోరీలకు పాల్పడడం, ఆపై పరారవడంతో తమ బిడ్డల భవిష్యత్తు ఏమిటంటూ పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి బెట్టింగ్‌లు నిర్వహించే వారిపై చర్యలు తీసుకుని గాడితప్పుతున్న యువతకు జీవితం అవగాహన కల్పించి సరైన మార్గంలో వెళ్లేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తల్లిదండ్రులే బిడ్డలను మార్చుకోవాలి
క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడిన యువకులను తల్లిదండ్రులే మార్చుకోవాలి. చదువుల కోసం పట్టణాలకు వెళుతున్న బిడ్డలు ఏమి చేస్తున్నారు..ఎలా చదువుతున్నారని తల్లిదండ్రులు నిఘా ఉంచాలి.
–కే గోపి, రాజుపాళెం
క్రమశిక్షణతో ఎదగాలి
పిల్లలు చిన్నతనం నుంచి క్రమశిక్షణతో మెలగాలి. బిడ్డలు చేస్తున్న చిన్నపాటి తప్పులను తల్లిదండ్రులు గుర్తించి వాటిని ప్రాథమిక దశలోనే ఖండించి వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. -రమణయ్య రాజుపాళెం
బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లోని యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. యువత దారితప్పి ప్రవర్తిస్తే వారిని సరైన మార్గంలో పెట్టుకోవాలి. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
–మల్లికార్జున్‌రావు, నాయుడుపేట సీఐ
Comments
Please login to add a commentAdd a comment