మొదట కొనేది ఇల్లే.. ఆ తర్వాతే పెళ్లి, ఫ్యూచర్‌ | Youth interested to investing in real estate | Sakshi
Sakshi News home page

మొదట కొనేది ఇల్లే.. ఆ తర్వాతే పెళ్లి, ఫ్యూచర్‌

Jan 12 2025 12:45 PM | Updated on Jan 12 2025 1:20 PM

Youth interested to investing in real estate

చదువు పూర్తయ్యిందా.. మంచి ఉద్యోగం, తర్వాత పెళ్లి, పిల్లలు, రిటైర్‌మెంట్‌ నాటికి ఓ సొంతిల్లు.. మన నాన్నల ఆలోచనలివే కదూ! కానీ, ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులూ మారాయి. చదువు కొనసాగుతుండగానే ఉద్యోగావకాశాలు నడిచొస్తున్నాయి. దీంతో యువత ముందుగా స్థిరమైన నివాసానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి, విదేశీ ప్రయాణాలు, ఫ్యూచర్‌ ఇతరత్రా వాటి కోసం ప్లానింగ్‌ 
చేస్తున్నారు.  – సాక్షి, సిటీబ్యూరో

విరివిగా రుణాల లభ్యత, బహుళ ఆదాయ మార్గాలు, మంచి ప్యాకేజీతో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు యువత ఆసక్తి చూపిస్తోంది. 2018లో గృహ కొనుగోలుదారుల్లో మిలీనియల్స్‌ (25–35 ఏళ్ల వయస్సు గలవారు) వాటా 28 శాతంగా ఉండగా.. గతేడాదికి 37 శాతానికి పెరిగింది. 2030 నాటికి 60 శాతానికి చేరుతుందని జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేసింది.

ఇటీవల కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి. గతంలో రిటైర్డ్, సీనియర్‌ సిటీజన్స్, సంపన్న వర్గాల గృహ కొనుగోళ్లు, పెట్టుబడులు ఉండేవి. కానీ, కొన్నేళ్లుగా మిలీనియల్స్, జెన్‌–జెడ్‌ కస్టమర్ల వాటా పెరిగింది. జీవితం ప్రారంభ దశలోనే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి కారు, డిజైనర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌లాగే ప్రాపర్టీకి నేటి యువత ప్రాధాన్యత ఇస్తోంది.  

అందుబాటులో టెక్నాలజీ.. 
మ్యాజిక్‌బ్రిక్స్‌.కామ్, హౌసింగ్‌.కామ్, 99 ఎకర్స్‌ వంటి రియల్‌ ఎస్టేట్‌ యాప్స్‌ యువ కొనుగోలుదారుల ప్రాపర్టీ శోధనను మరింత సులువు చేశాయి. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే భౌతికంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడం, పరిసర ప్రాంతాల వాకబు వంటివి పెద్ద ప్రయాస ఉండేది. కానీ, నేటి యువతరానికి అంత టైం లేదు. దుస్తులు, ఫుడ్‌ ఆర్డర్‌ చేసినంత సులువుగా ప్రాపర్టీ కొనుగోళ్లు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టు ప్రాపర్టీ సమీక్ష, రేటింగ్‌ యాప్స్, త్రీడీ వ్యూ, వర్చువల్‌ టూర్‌ వంటి సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి.  

గృహ రుణాలకు పోటీ.. 
యువ గృహ కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం పోటీపడి హోమ్‌లోన్స్‌ అందిస్తున్నాయి. రుణాల మంజూరులో వేగం, తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. క్రౌడ్‌ ఫండింగ్, ప్రాపర్టీ షేరింగ్‌ వంటి పాక్షిక యాజమాన్య ప్లాట్‌ఫామ్‌లు పరిమిత మూలధనంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో భారీ ముందస్తు చెల్లింపులు అవసరం లేకుండానే నేటి యువ కస్టమర్లు లక్ష కంటే తక్కువ ప్రారంభ పెట్టుబడితో యువ ఇన్వెస్టర్లు ఖరీదైన, విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు.  

ఐటీ హబ్‌లలో యువ పెట్టుబడులు.. 
బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ఐటీ హబ్‌లలో యువ ఐటీ ఉద్యోగులు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో గణనీయమైన ప్రభావం చూపుతున్నారు. రూ.80 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన 2 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంది. కరోనాతో అలవాటైన వర్క్‌ ఫ్రం హోమ్‌తో యువ ఉద్యోగులకు నిత్యం ఆఫీస్‌కు వెళ్లాలనే టెన్షన్‌ లేదు. దీంతో ఆఫీస్‌ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు ఉండాలనుకోవడం లేదు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్‌!

మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటే సిటీకి కాస్త దూరమైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ప్రధాన ప్రాంతంలో కొనుగోలు చేసే ధరతోనే శివార్లలో పెద్ద సైజు ఇళ్లు, వసతులను పొందవచ్చనేది వారి అభిప్రాయం. అయితే గ్రీనరీతో పాటు విద్యుత్, నీటి వినియోగాన్ని ఆదా చేసే ప్రాజెక్ట్‌లు, సౌర ఫలకాలు, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ వంటి పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉండే ఇళ్లను కోరుకుంటున్నారు.

పెరిగిన పట్టణ గృహ యజమానులు.. 
కరోనాతో అలవాటైన వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానంతో యువ ఉద్యోగులు ఆఫీసులో కూర్చొని పనిచేసే అవసరం లేదు. వారు ఇప్పుడు తమ పనికి కాకుండా జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వారికి నచ్చిన ప్రాంతంలో నివసించే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల అభిరుచులతో గృహ కొనుగోలుదారుల్లో మార్పులు వచ్చాయి.

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కీలకమైన వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 2020లో పట్టణ గృహ యజమానుల రేటు 65 శాతంగా ఉండగా.. 2025 నాటికి 72 శాతానికి పెరుగుతుందని జేఎల్‌ఎల్‌ అంచనా వేసింది. సరసమైన గృహ రుణాలు, నివాస సముదాయంలో యువ కొనుగోలుదారుల ప్రాధాన్యతే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement