కుంభమేళాకు పోటెత్తుతున్న యూత్
నవతరం యువత ఆధ్యాత్మిక బాట పడుతోంది. మహా కుంభమేళాలో ఎక్కడ చూసినా యువోత్సాహం వెల్లివిరుస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగా సాధువులు,
పెద్దవాళ్లకు దీటుగా జెన్ జెడ్ (కొత్త తరం) యువతీ యువకులు కూడా మేళాకు పోటెత్తుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్, చంకన లాప్‌టాప్‌తోనే తమదైన శైలిలో ఆధ్యాత్మికాన్వేషణలో మునిగి తేలుతున్నారు. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక వేడుకలు మధ్యవయసు్కలు, వృద్ధులకు మాత్రమే పరిమితం కాదని నిరూపిస్తున్నారు.
ఎందుకొస్తున్నారు?
గత కుంభమేళాతో పోలిస్తే ఈసారి యువత రాక బాగా పెరగడం విశేషం. తమను పలకరించిన మీడియాతో వారు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు, తాతయ్యల నోట పంచతంత్ర కథలతోపాటు ఆధ్యాత్మిక విషయాలు, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్ల గురించి ఎంతో విన్నాం. వాటినే స్వయంగా వచ్చి పాటిస్తున్నామంతే’’ అని త్రివేణి సంగమం వద్ద కొందరు యువతీ యువకులు చెప్పారు.
‘‘మా తాత, అమ్మమ్మ, నాన్నమ్మ కుంభమేళా గొప్పతనం గురించి ఎంతగానో చెప్పారు. ప్రత్యక్షంగా తెలుసుకుందామని వచ్చాం’’ అని సంస్కృతి మిశ్రా అనే యువతి చెప్పింది. ‘‘గంటగంటకు లక్షలాది మంది వచ్చిపోయే సంగమ స్థలిలో పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తూ పరిశుభ్రతను కాపాడుతున్న తీరు అద్భుతం. ఈ వేస్ట్ మేనేజ్‌మెంట్ పాఠాలను ప్రత్యక్షంగా నేర్చుకునేందుకు వచ్చా’’ అని అమీషా అనే అమ్మాయి చెప్పింది.
అక్షరాలా అద్భుతమే
‘‘కుంభమేళా గురించి ఎవరో చెబితే వినడం వేరు. ఆ భక్తి పారవశ్యాన్ని కళ్లారా చూడడం వేరు. నాకు ఇన్‌స్టాలో 18,000 మంది ఫాలోవర్లున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఇతరులను ప్రభావితం చేయడానికి ముందు నేనే స్వయంగా చూడాలని వచ్చా. అప్పుడే మహా కుంభమేళా మహిమ ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. ఈ ఆధ్యాత్మికతను, కోట్లమందితో కలిసి పుణ్యస్నానం చేస్తే వచ్చే అనుభూతి, ప్రశాంతతను మాటల్లో వర్ణించలేం.
కుంభమేళా విషయంలో ప్రయాగ్‌రాజ్ నిజంగా సాంస్కృతిక రాజ్యమే’’ అని 23 ఏళ్ల జ్యోతి పాండే చెప్పారు. ‘‘ఇంతమందిని ఒక్కచోట చూస్తే ఎంతో సుందరంగా ఉంది. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు గొప్పవి. నాకైతే ఇక్కడికొస్తున్న వాళ్లలో సగం మంది యువతే కనిపిస్తున్నారు. మేళాకు వచ్చి సనాతన భారతీయ సంస్కృతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని అక్షయ్ అనే 20 ఏళ్ల హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి అన్నాడు.
అతను ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ క్యాంప్‌లో భాగస్వామిగా పనిచేస్తున్నాడు. ‘‘తల్లిదండ్రులతో కలిసి మూడ్రోజులు ఇక్కడే మేళా మైదానంలో ఉండేందుకు వచ్చా. తెల్లవారుజామునే చలిలో పుణ్యస్నానాలు చేసేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. భక్తుల అచంచల విశ్వాసం కుంభమేళాలో అణువణువుగా కనిపిస్తుంది’’ అని 23 ఏళ్ల ఢిల్లీ వర్సిటీ సైకాలజీ విద్యార్థిని సంస్కృతి చెప్పారు.
‘‘భక్తుల గేయాలు, నినాదాలతో సంగమ క్షేత్రమంతా హోరెత్తిపోతుంది. ఢిల్లీలాంటి కాంక్రీట్ వనం నుంచి ఇలాంటి పుణ్యతీర్థాలకు వచ్చినప్పుడే మన మూలాలేమిటో స్మరణకు వస్తాయి’’ అన్నారు. ‘‘కోట్లాది మంది ఒకే విశ్వాసంతో ఒక్కచోట చేరడాన్ని 144 ఏళ్లకొకసారి వచ్చే ఇలాంటి కుంభమేళాలోనే చూడగలం. ఇది నిజంగా అరుదైన విషయమే. నేను చిత్రలేఖనం చేస్తా. పసుపు, కుంకుమ, విభూతి, రంగులతో అలరారే మేళా పరిసరాలను చిరకాలం నిలిచిపోయేలా సప్తవర్ణ శోభితంగా నా కుంచెతో చిత్రిస్తా’’ అని దరాబ్ చెప్పాడు.
అనుభవైకవేద్యమే
‘‘ఎవరో చేసే వీడియోలో, రీల్స్‌లో కుంభమేళాను చూడడం కాదు. మీరే స్వయంగా వచ్చి పుణ్యస్నానం ఆచరించి దాన్ని వీడియోలు, రీల్స్ చేసి చూడండి. ఈ స్థలం విశిష్టతేమిటో అప్పుడు తెలుస్తుంది! యువతకు ఆధ్యాత్మిక కనువిందే కాదు, కడుపునిండా భోజనమూ ఉచితంగా అందిస్తారు. ఇక్కడ రెండు నెలలపాటు ఉచిత భండార్‌లు అందుబాటులో ఉంటాయి. ఆధ్యాత్మికత, ఆనందాల మేళవింపు ఈ మేళా’’ అని ‘ది లలన్‌టాప్’ వార్తా సంస్థ ఉద్యోగి అభినవ్ పాండే చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment