కుంభమేళాలో విశేషాలెన్నో
రాజ్‌నాథ్‌సింగ్ పుణ్యస్నానం
22న ప్రయాగ్‌రాజ్‌లో కేబినెట్ భేటీ
మహాకుంభ్‌నగర్/లఖ్నో: ఇసుకేస్తే రాలని భక్తజన సందోహం నడుమ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కన్నులపండువగా కొనసాగుతోంది. వేడుకకు వేదికైన త్రివేణి సంగమానికి ప్రపంచం నలుమూలల నుంచీ భక్తులు వెల్లువెత్తుతూనే ఉన్నారు. శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మేళాలో పాల్గొన్నారు. వీఐపీ ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు.
అనంతరం అక్షయ వటవృక్షం, పాతాళ్‌పురీ మందిర్, సరస్వతీ కూప్‌ను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. బడే హనుమాన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఇంతటి వేడుకలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. ‘‘మహా కుంభమేళా ఏ మతానికో, ప్రాంతానికో చెందినది కాదు. భారతీయతను ప్రతిబింబించే అతి పెద్ద సాంస్కృతిక పండుగ. భారత్‌ను, భారతీయతను అర్థం చేసుకునేందుకు చక్కని మార్గం’’అని అభిప్రాయపడ్డారు.
మహా కుంభమేళాలో పలు విశేషాలు భక్తులకు కనువిందు చేస్తున్నా యి. మహాకుంభ్‌నగర్ సెక్టర్ 6లో ఏకంగా 7.51 కోట్ల రుద్రాక్షలతో రూపొందించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో లింగాన్ని 11 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడ ల్పు, 7 అడుగుల మందంతో రూపొందించారు.
వాటి తయారీలో వాడిన రుద్రాక్షలను 10 వేల పై చిలుకు గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ సేకరించినట్టు నిర్వాహకుడు మౌనీ బాబా తెలిపారు. వాటిలో ఏకముఖి నుంచి 26 ముఖాల రుద్రాక్షల దాకా ఉన్నట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం 22న ప్రయాగ్‌రాజ్‌లో సమావేశం కానున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్ అభివృద్ధికి సంబంధించి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతకుముందు యోగి కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment