వికసిత్ భారత్‌కు యువతే యజమానులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన
న్యూఢిల్లీ: మన యువత బలమే మన దేశాన్ని అగ్రగామిగా మారుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువతీ యువకుల శక్తి సామర్థ్యాలతో భారత్ ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందడం ఖాయమని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా కార్యక్రమం’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్’ అనేది మన లక్ష్యమని గుర్తుచేశారు. ఆ లక్ష్యం సాధించడం కష్టం కావొచ్చేమో గానీ అసాధ్యం మాత్రం కాదని తేల్చిచెప్పారు.
నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సత్తా మన యువతలో ఉందన్నారు. మనది యువదేశమని, పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంచేశారు. మనం వేసే ప్రతి అడుగులో, ప్రతి విధానంలో, ప్రతి నిర్ణయంలో వికసిత్ భారత్ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో వేర్వేరు కీలక రంగాల్లో ఎన్నో విజయాలను మన దేశం సాధించబోతోందని మోదీ వెల్లడించారు. దేశం ముందుకు పరుగులు తీయాలంటే గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, మనం ఇప్పుడు అదే పనిలో నిమగ్నమై ఉన్నామని వివరించారు.
ప్రభుత్వానికి యువత భుజం కలపాలి
2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం బ్లెండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాస్తవానికి అంతకంటే ముందే అది సాధించబోతున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులూ చేయలేదని, యువత సైతం భుజం కలపాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్‌కు యువతే యజమానులని ఉద్ఘాటించారు. మన విధాన నిర్ణయాల్లో యువత ఆలోచనలు కూడా ఒక భాగమని చెప్పారు. వారి దిశానిర్దేశం దేశానికి అవసరమని అన్నారు. మనం అనుకున్నది సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరి సమ్మిళిత కృషి అవసరమన్నారు.
1930లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా అగ్రదేశంగా ఎదిగిందని, ఒకప్పుడు ఎంతో వెనుకబడిన దేశమైన సింగపూర్ ప్రస్తుతం బలీయమైన ఆర్థిక శక్తిగా మారిందని మోదీ గుర్తుచేశారు. గొప్ప లక్ష్యాలు పెట్టుకోవడం, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యమని ఉద్బోధించారు. రాబోయే 25 ఏళ్లు మనకు అమృతకాలమని వివరించారు. వికసిత్ భారత్ కలను యువత సాకారం చేస్తుందన్న విశ్వాసం తనకు పూర్తిగా ఉందని పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో మన దేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేలా యువత సన్నద్ధం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా కార్యక్రమానికి 3 వేల మందికిపైగా యువతీ యువకులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment