సాక్షి, దత్తిరాజేరు(విజయనగరం) : ఇంతవరకు పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ నేడు గ్రామాలకూ చేరుకుంది. ప్రపంచ కప్ సీజన్‌లో దాదాపు సగభాగం పూర్తయింది. దీంతో బెట్టింగ్‌రాయుళ్లు కూడా జోరందుకున్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన పలువురు క్రికెట్ బుకీలు నియోజకవర్గంలోని పలు గ్రామలకు చేరుకుని తిష్ట వేశారు. క్రికెట్ అంటే పిచ్చి అభిమానం ఉన్న యువతను టార్గెట్ చేసుకుని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. బుకీలు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసి ఏ టీమ్ మీద బెట్టింగ్ కడుతున్నామో చెబితే చాలు.. ఆ టీమ్ గెలిస్తే బుకీ నేరుగా డబ్బులు తీసుకువచ్చి ఇస్తాడు.
ఒకవేళ టీమ్ ఓడిపోతే బెట్టింగ్ కట్టిన వారు వారున్న ప్రదేశానికి వెళ్లి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. బెట్టింగ్ కట్టేటప్పుడు కూడా బుకీలు పలు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ఎవరు పడితే వారితో కాకుండా... తమ అనుచరులు పరిచయం చేసిన వారితో బెట్టింగ్‌లకు పాల్పడుతుంటారు. నియోజకవర్గంలోని గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ మండలాలలో పలు హోటళ్లు.. దాబాల వద్ద బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. చాలా గ్రామాలలో యువత సరదాగా పందాలకు అలవాటు పడి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దుబారా చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కొత్త పుంతలు
బెట్టింగ్‌రాయుళ్లు వివిధ రకాల్లో బెట్టింగ్‌లు కడుతున్నారు. ఏ మ్యాచ్ గెలుస్తుందో అంచనా వేసి సాధారణంగా బెట్టింగ్‌లు కడుతుంటారు. అయితే తాజాగా టీమ్ ఎన్ని పరుగులు చేస్తుంది.. ఏ క్రికెటర్ హాఫ్/సెంచరీ చేస్తాడు.. మొత్తం పరుగుల సరి సంఖ్య అవుతుందా.. బేసి సంఖ్య అవుతుందా... ఫస్ట్/ లాస్ట్ బాల్ బౌండరీ కొడతారా.. లేదా.. తదితర విధానాల్లో బెట్టింగ్ జరుగుతోంది.
చితికిపోతున్న యువత
బెట్టింగ్‌ల వల్ల యువత ఆర్థికంగా చితికిపోతోంది. డబ్బులు పోయిన సందర్భాల్లో చాలా మంది ఇళ్లల్లో డబ్బులు దొంతనం చేస్తున్నారు. అయితే పరువు పోతుందనే ఉద్దేశంతో బయటకు చెప్పలేకపోతున్నారు. మరికొంత మంది యువకులు తల్లిదండ్రుల కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి ప్రతి రోజూ రూ. లక్షల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. పోలీసులు స్పందించి క్రికెట్ బెట్టింగ్‌లపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment