సెప్టెంబర్‌లోనే డయేరియా మృత్యు ఘంటికలు | One person died in Penubarthi in the third week of last month | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లోనే డయేరియా మృత్యు ఘంటికలు

Published Thu, Oct 24 2024 5:34 AM | Last Updated on Thu, Oct 24 2024 5:34 AM

One person died in Penubarthi in the third week of last month

అప్పట్లోనే విజయనగరం జిల్లా గుర్ల మండలంలో వ్యాధి వ్యాప్తి

వైద్య శాఖ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ పరిశీలనలోనూ ఇదే వెల్లడి

ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌లో కూడా డయేరియా ఔట్‌బ్రేక్‌ ట్రెండ్‌

గత నెలలో వాంతులు, విరేచనాలతో పలువురు ఆస్పత్రి పాలు

గత నెల మూడో వారంలోనే పెనుబర్తిలో ఒకరు మృతి

అయినా నిమ్మకు నీరెత్తినట్లున్న ప్రభుత్వం

ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే 14 మంది బలి

సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో సెప్టెంబరు నెలలోనే డయేరియా మృత్యు ఘంటికలు మోగాయి. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వ్యాధి తీవ్రస్థాయిలో ప్రబలింది. 14 మందిని బలి తీసుకుంది.కలుషిత నీరు కారణంగా పలువురు వాంతులు, విరేచనాలతో గత నెలలోనే అనేకమంది ఆస్పత్రులకు వచ్చారు. గత నెల మూడో వారంలోనే మండలంలోని పెనుబర్తి గ్రామంలో డయేరియాకు ఒకరు మృతి చెందారు. 

ఈ విషయం పత్రికలు, మీడియాలోనూ వచ్చింది. ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌లో కూడా డయేరియా ఔట్‌బ్రేక్‌ ట్రెండ్‌ కనిపించింది. డయేరియా వ్యాప్తిపై అధ్యయనానికి, నివారణ చర్యల కోసం ఇటీవల వైద్య శాఖ నియమించిన రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (ఆర్‌ఆర్‌టీ) కూడా ఇదే విషయాన్ని నిర్ధారించినట్లు తెలిసింది. 

ప్రభుత్వం అప్పట్లోనే స్పందించి, వ్యాధి నివారణ చర్యలు చేపట్టి ఉంటే వ్యాధి ఇంతగా ప్రబలి ఉండేది కాదు. ఈ నెల 15 తర్వాత కేసులు విపరీతంగా పెరగడం, మరణాలు ఎక్కువ అవడంతో ప్రభుత్వ యంత్రాంగం గుర్లపై దృష్టి సారించింది. అప్పటికే నష్టం తీవ్రమైంది. ఇప్పటికీ ప్రభుత్వం బాధితులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించలేకపోతోంది.

తాగునీరు కలుషితమవడమే కారణం
గుర్ల మండలంలో తాగు నీరు కలుషితమైన కారణంగానే డయేరియా ప్రబలినట్లు ఆర్‌ఆర్‌టీ నివేదించిందని బుధవారం వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో సేకరించిన 44 నీటి నమూనాలలో 31 నమూనాల్లో  కోలిఫాం ఉన్నట్లు తేలింది. 57 మల నమూనాలను పరీక్షించగా భూతల, భూగర్భ జలాలు కలుషితమైనట్లు తేలింది. నీటి వనరు అయిన చంపా నదిలో దహన సంస్కారాలు, జాతరలు, పండుగలు మొదలైన మతపరమైన కార్యకలాపాలు చేస్తున్నారని కమిటీ గమనించింది. 

చంపా నది వెంబడి ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువ డయేరియా కేసులు నమోదయ్యాయి. వ్యాధుల వ్యాప్తి నివారణకు అవసరమైన క్లోరినేషన్‌ పేలవంగా ఉంది. నీటి నమూనాలలో  క్లోరిన్‌ అవశేషాలేమీ లేకపోవడంపై బృందం ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాగు నీటి ప్రధాన వనరైన చంపా నది నీటిని తరచుగా క్లోరినేషన్‌ చేయాలని, నీటి సరఫరా పైపుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, మరమ్మతులు చేయాలని కమిటీ సూచించింది. డ్రైనేజీ గుండా నీటి పైపులు వెళ్లకుండా చూడాలని సిఫార్సు చేసింది. 

విజయనగరం జిల్లా భౌగోళిక, వాతావరణ పరిస్థితులు సంక్రమణ వ్యాధుల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున తరచూ నీరు, ఇతర నమూనాల పరీక్షలకు వీలుగా రీజినల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది’ అని వైద్య శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement