ఒకే ఊరిలో 450 మందికి కష్టం వస్తే స్పందించే తీరు ఇదేనా?
స్కూల్లో బల్లలపై పడుకోబెట్టి వైద్యం చేయిస్తున్నారు
రోగులకు బెడ్లు వేయలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేద ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడటం సరికాదని వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి అప్పలరాజు డయేరియా విజృంభించిన విజయనగరం జిల్లాలోని గుర్ల మండల కేంద్రంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజులుగా ఒకే ఊరిలో 450 మంది అతిసారం బారినపడి బాధపతున్నారని, వారిలో 11 మంది చనిపోయినా ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా పేదలు మృతి చెందారన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ వైద్య వ్యవస్థను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది అప్పగించారని... కానీ చంద్రబాబు ప్రభుత్వం డయేరియా బాధితులకు వైద్యం కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బెంచీలు, కుర్చీలపై రోగులను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారంటేనే ప్రభుత్వం తీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. కనీసం రోగులకు బెడ్ కూడా వేయకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్ జగన్ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు–నేడు’ అభివృద్ధి పనుల వల్లే ఇప్పుడీ బెంచీలు, విద్యుత్తు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, ఇతరత్రా సదుపాయాలు కలిగాయని, ఒకవేళ గుర్ల పాఠశాలను ఇలా తీర్చిదిద్ది ఉండకపోతే ఇప్పుడు రోగులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేసేవారా...? అని ప్రశ్నించారు. పరిసర ప్రాంతాల్లోని పీహెచ్‌సీల నుంచి బెడ్స్ తీసుకొచ్చి వేయించడం కూడా తెలియదా..? అని మండిపడ్డారు. ఇవేవీ చేయలేనప్పుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఎందుకొచ్చారని, ఫొటోలు తీయించుకోవడానికా అని నిలదీశారు.
సీఎం చంద్రబాబు మద్యం మత్తు, ఇసుక మాఫియా నుంచి బయిటకొచ్చి పేదల గురించి పట్టించుకోవాలని అన్నారు. ఆకస్మిక తనిఖీల పేరుతో వైజాగ్ వచ్చిన మంత్రి నారా లోకేశ్ పక్కనేవున్న గుర్ల మండలంలో వందల మంది కష్టంలో ఉంటే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం, రక్షిత నీటి విభాగం శాఖల పూర్తి వైఫల్యానికి నిదర్శనమే గుర్ల విషాదమన్నారు. ఆ రెండు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ దీనికి సమాధానం చెప్పాలన్నారు.
వందలాది ప్రజలు డయేరియాతో అల్లాడుతుంటే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏదైనా గ్రామంలో జ్వరాలు వస్తే తక్షణమే ఫీవర్ సర్వే చేయించి కారణాలు తెలుసుకుని నిరోధించే చర్యలు చేపట్టే వారమని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివసరావు చెప్పారు. ఇప్పుడీ ప్రభుత్వం డయేరియా రోగులను స్కూల్ పిల్లల బెంచీలపై పడుకోబెట్టి కర్రలు కట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించే దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment