గుర్ల మండలంలో డయేరియా పంజా
గోషాడ, కెల్ల, కోటగండ్రేడు, పెనుబర్తిల్లో 450 మందికిపైగా బాధితులు
శుక్రవారం మరో 11 కేసులు .. ఒకరి మృతి
ఇప్పటివరకు 8 మంది మృత్యువాత
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని ఐదు గ్రామాల్లో గురువారం సాయంత్రానికి 450 మందికిపైగా డయేరియా బారిన పడ్డారు. శుక్రవారం కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. చాలామందికి ఇళ్ల వద్దనే వైద్యం అందిస్తున్నారు.
వాంతులు, విరేచనాలు అధికంగా అవుతున్నవారిని గుర్ల జెడ్పీ హైసూ్కల్‌లో వైద్యశిబిరానికి, గుర్ల పీహెచ్‌సీ, చీపురుపల్లి, నెలిమర్ల సీహెచ్‌సీలకు తరలించి చికిత్స చేస్తున్నారు. అవసరమైనవారిని విజయనగరంలోని సర్వజన ఆస్పత్రి, గోషాస్పత్రి, విశాఖలోని కేజీహెచ్‌లకి తరలిస్తున్నారు. గురువారం నాటికి డయేరియా బారిన పడి ఏడుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే.
శుక్రవారం గుర్ల గ్రామానికి చెందిన పతివాడ సూరమ్మ (68) ఇంటివద్దే చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి సీతమ్మ డయేరియాతో ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురై గుర్ల గ్రామానికే చెందిన కలిశెట్టి రవి (28) మృతిచెందాడు.
ప్రైవేట్ బోర్లపైకి నెపం
మండలంలో గత శనివారం నుంచి డయేరియా పంజా విసురుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించింది. విజయనగరం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం అలా ముఖం చూపించి వెళ్లిపోయారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ వచ్చి గుర్లలో పరిస్థితిపై ఆరా తీశారు.
కలెక్టరు, ఇతర అధికారులు రెండు, మూడు రోజులుగా వచ్చి వెళుతున్నారు. చంపావతి నది నుంచి వస్తున్న తాగునీటి వల్లే డయేరియా విజృంభించిందనే సందేహంతో ఆ నీటి నమూనాలకు పరీక్షలు చేయించిన ఆర్‌డబ్ల్యూఎస్ (రక్షిత మంచినీటి విభాగం) అధికారులు.. ఆ నీటివల్ల సమస్య లేదని తేలిందని చెబుతున్నారు.
గ్రామస్తులు మరుగుదొడ్ల వ్యర్థాలను నేరుగా డ్రైనేజీల్లోకి వదిలేయడం వల్ల అలా భూమిలో ఇంకి ప్రైవేటు బోర్లలోకి వస్తున్న నీటిని వినియోగించడం వల్లే డయేరియా వచ్చి ఉండవచ్చని జిల్లా ఉన్నతాధికారులు కొత్త భాష్యం చెబుతున్నారు.
ఇంకెన్ని చూడాలో...
» గుర్లకు చెందిన మామిడిపాక ప్రవీణ్‌కుమార్‌కు ఈ నెల 16న వివాహం జరిగింది. అప్పటికే డయేరియా లక్షణాలు అధికమవడంతో విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
» గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ డయేరియాతో మృతి చెందింది. ఆమె మృతితో కొడుకు రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి విధులకు వెళ్లకుండా అప్పటి నుంచి ఊరి బయటే ఉండిపోయాడు. అక్కడే శుక్రవారం మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment