శరవేగంగా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు
అడ్డంకులన్నీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పరిష్కారం
2023 మే 3న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన
భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం పూర్తి
భూమి స్వాధీనంతో నిర్మాణ పనులు ప్రారంభించిన జీఎంఆర్
కీలక నిర్మాణాలన్నీ 56 శాతం పూర్తి
2026 డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలనేది లక్ష్యం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విభజిత ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు విజయనగరం జిల్లా భోగాపురం వద్ద శరవేగంగా జరుగుతున్నాయి. 2014–19 టీడీపీ హయాంలో అపరిష్కృతంగా వదిలేసిన సమస్యలను తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చాకచక్యంగా పరిష్కరించిన సంగతి తెలిసిందే. భూసేకరణను పూర్తి చేయడమే గాక నిర్వాసితులకు పరిహారం, పునరావాసం విషయంలోనూ అడ్డంకులన్నీ తొలగించింది. కేంద్రం వద్ద పెండింగ్‌లోనున్న అనుమతులన్నీ తీసుకువచ్చింది. ఆ తర్వాతే 2023 మే 3న నాటి సీఎం వైఎస్ జగన్ ఈ విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నరగా ఈ పనులన్నీ ఊపందుకున్నాయి.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే 30% పనులు పూర్తయ్యాయి. గతేడాది డిసెంబర్ నాటికి ప్రధాన నిర్మాణ పనులన్నీ 56 శాతానికి చేరాయి. మిగతావన్నీ పూర్తి చేసి 2026 డిసెంబర్ నాటికల్లా తొలి దశ పూర్తిచేయడమే లక్ష్యంగా నిర్మాణ సంస్థ జీఎంఆర్ నిర్మాణాల వేగాన్ని మరింతగా పెంచింది. ఉత్తరాంధ్ర ప్రగతికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌పోర్టు కంపెనీల్లో ఒకటైన జీఎంఆర్ గ్రూప్ పీపీపీ విధానంలో చేపట్టింది. వాస్తవానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ 2025 డిసెంబర్‌కి మొదటి దశ పూర్తి చేయాలని అభిలషించారు.
ఇందుకు జీఎంఆర్ గ్రూప్ సంస్థల అధిపతి గ్రంథి మల్లికార్జునరావు (జీఎంఆర్) కూడా సానుకూలంగా స్పందించారు. అందుకనుగుణంగానే ల్యాండ్ ఫిల్లింగ్, రన్‌వే, టెర్మినల్ నిర్మాణ పనులను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది. ఈ పనులన్నీ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. 56 శాతం పూర్తి అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
పూర్తి అయితే ప్రగతికి దోహదం...
ఏటా 4 కోట్ల మంది విమాన ప్రయాణం చేసేలా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నారు. 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో తొలి దశ నిర్మాణ పనులు చేపట్టారు. ఇవి 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేసిన తర్వాత తదుపరి దశ పనులు చేపడతారు. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రగతికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఊతంగా నిలుస్తుంది. దేశీయ, విదేశీ విమానయానం మరింతగా ఊపందుకుంటుంది. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కార్గో టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో ఫార్మా, ఆక్వా తదితర పరిశ్రమల విస్తరణకు, ఆయా ఉత్పత్తుల ఎగుమతులకు ఆధారమవుతుంది. మరోవైపు ఈ ప్రాంతంలో వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.
⇒ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ ప్రక్రియను రూ.835.48 కోట్లతో పూర్తి చేసింది.
⇒ 4 గ్రామాల్లోని 404 నిర్వాసిత కుటుంబాలకు రూ.67.04 కోట్లతో అన్ని మౌలిక వసతులతో ఈ పునరావాస కాలనీలను నిర్మించింది.
⇒ ప్రతి కుటుంబానికి 240 చదరపు గజాల ఇంటిస్థలం, అక్కడ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి రూ.9.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది.
⇒ విమానాశ్రయానికి ఏటా 5 ఎంఎల్‌డీ నీటి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. తక్షణమే 1.7 ఎంఎల్‌డీ నీటి సరఫరాకు సంబంధించిన పనులను పూర్తి చేయడానికి రూ.5.30 కోట్లు మంజూరు చేసింది.
⇒ 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా ఏర్పాట్లకు రూ.2.62 కోట్ల నిధులు విడుదల చేసింది.
⇒ విమానాశ్రయానికి సేకరించిన భూమిలోనున్న విద్యుత్తు లైన్లు, స్తంభాల స్థలామార్పిడికి రూ.2.30 కోట్ల వ్యయం చేసింది.
⇒ స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి భోగాపురం మండలం బసవపాలెం వద్ద 24.30 ఎకరాల భూమి కేటాయించింది.
⇒132/133 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భోగాపురం మండలం కొంగవానిపాలెం వద్ద 5.47 ఎకరాల భూమి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment