బెట్..ఫట్ | Cricket Beetings In Khammam | Sakshi
Sakshi News home page

బెట్..ఫట్

Published Fri, Apr 20 2018 10:40 AM | Last Updated on Fri, Apr 20 2018 10:40 AM

Cricket Beetings In Khammam - Sakshi

అతడొక చిరుద్యోగి. మహాపొదుపరి. క్రికెటంటే పిచ్చి.చిరుద్యోగిగా చేస్తూనే, ఇతరత్రా చిన్నాచితకా పనులు కూడా చేసేవాడు. ఇలా పదేళ్లలో దాదాపుగా పదిలక్షలు కూడబెట్టాడు. ఇంకా ఎక్కువ సంపాదించేందుకు మార్గాలను అన్వేషిస్తుండగా, బెట్టింగ్‌ గురించి తెలిసింది. చిన్న మొత్తంతో బెట్టింగ్‌లోకి దిగాడు. మొదట బాగానే కలిసొచ్చింది. ఆశ పుట్టింది. ‘ఇంత తేలిగ్గా డబ్బు సంపాదించొచ్చా..!’ అనుకున్నా డు. ఈ జూదంపై మోజు పెరిగింది. ‘వచ్చేది తక్కువ.. పోయేది ఎక్కువ’గా ఉంది అతని పరిస్థితి. ఇటీవల అత్యాశతో  పెద్ద మొత్తాన్ని బెట్టింగ్‌లో పెట్టాడు. ఇక పెట్టడానికి అతని వద్ద ఏమీ లేదు. పదేళ్లపాటు కష్టించి, కోరికలన్నీ చంపుకుని.. తినీతినక కూడబెట్టిన పదిలక్షల రూపాయలను పోగుట్టుకు న్నాడు. ‘తేలిగ్గా సంపాదించొచ్చన్న’ మైకం వీడేసరికి బజారున పడ్డాడు..! ఇలాంటి వారు ఎందరో..!!  

వైరారూరల్‌:ఒకప్పుడు నగరాలకే పరిమితమైన బెట్టింగ్‌ భూతం.. ఇప్పుడు పల్లెలకూ పాకింది. ఐపీఎల్‌ సీజన్‌తో జోరందుకుంది.

బెట్టింగ్‌ ఇలా..
మ్యాచ్‌కు ముందు టాస్‌ వేస్తారు. టాస్‌ గెలిచిన జట్టు, బ్యాటింగో.. ఫీల్డింగో ఎంచుకుంటుంది. అక్కడ టాస్‌ వేయడానికి ముందే.. ఇక్కడ బెట్టింగ్‌ మొదలవుతుంది. అక్కడ ఆ ఆట.. ఇక్కడ ఈ ‘ఆట’ (బెట్టింగ్‌)కు తెర లేస్తుంది. అనుకున్న జట్టు టాస్‌ గెలిస్తే.. పెట్టిన మొత్తానికి 70 నుంచి 80 శాతం అదనంగా వస్తాయి. అంటే.. అనుకున్న జట్టు టాస్‌ గెలుస్తుందని రూ.100 బెట్టింగ్‌ వేశారనుకుందాం. నెగ్గితే, దానికి రూ.70–80 కలిపి రూ.170–180 ఇస్తారు. అనుకున్న జట్టు టాస్‌ ఓడిపోతే.. బెట్టింగ్‌ కాసిన నగదంతా మధ్యవర్తులకు దక్కుతుంది. సెషన్ల రూపంలో కూడా బెట్టింగ్‌ నడుస్తుంది. ముందు ఆరు, పది, పదిహేను ఓవర్ల సెషన్‌గా చెప్పుకుంటారు. ఈ మూడు సెషన్లలో వచ్చే పరుగులపై బెట్టింగ్‌ కడతారు. ఉదాహరణకు.. రూపాయి పెడితే రూపాయిన్నర నుంచి రెండ్రూపాయాల వరకు వస్తాయి. అంటే.. బెట్టింగ్‌ పెట్టిన మొత్తానికి 70 నుంచి 80 శాతం వరకు కష్టపడకుండానే డబ్బొస్తుందన్నమాట. చాలామంది ఇక్కడే బుట్టలో పడిపోతున్నారు. మధ్యవర్తులు (బుకీలు) కూడా ఇలా ఆశ పెట్టి అనేకమందిని ఈ బెట్టింగ్‌లోకి దింపుతున్నారు.

విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు...
వీరూ–వారూ అనేది లేదు. అన్ని వర్గాల వారు ఈ బెట్టింగ్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. కూలీలైతే రోజంతా చెమటోడ్చి సంపాదించినదంతా, విద్యార్థులైతే ఇంట్లో అమ్మానాన్న ఇచ్చిన డబ్బును, ఉద్యోగులు–వ్యాపారులు తమ ఆర్జననను తీసుకొచ్చి పెడుతున్నారు. మొత్తం పోగొట్టుకుంటున్నారు. పదిమంది పోగుట్టుకుంటే... ఇద్దరో ముగ్గురో గెలుచుకుంటారని అనుకుందాం. ఆ పోగొట్టుకున్నవారు.. ఇకనైనా ఈ జూదానికి దూరానికి దూరం ఉందామని అనుకోవడం లేదు. ‘నా తోటోళ్లు గెలుచుకున్నారుగా...! ఈసారి నాకు రాకపోయతాయా..?!’ అనే ‘ఆశ’తో ఈ బెట్టింగ్‌ ఊపి నుంచి బయటకు రాలేకపోతున్నారు. పోయిన మొత్తాన్ని తిరిగి సంపాందించుకోవాలన్న కసితో, సంపాదించగలమన్న నమ్మకంతో ఉన్నదంతా ఊడ్చేసి, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెడుతున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి అనేకమంది, చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోయి, బయటకు రాలేక.. లోపల ఉండలేక.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఒక్క ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) మాత్రమే కాదు. వరల్డ్‌ కప్, చాంపియన్స్‌ ట్రోఫీ, ప్రీమియర్‌ లీగ్, బీపీల్‌ లీగ్, వన్డే, 20–20, టెస్ట్‌ మ్యాచ్‌.. చివరికి ప్రో కబడ్డీపై కూడా బెట్టింగ్‌ పెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... తాగుడుకు బానిసగా మారిన వారు, దాని నుంచి ఎలా దూరంగా ఉండలేరో.. బెట్టింగ్‌ బాబులు కూడా అంతే...!

ఎన్నెన్నో మార్గాలు...
బెట్టింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో, బుకీలు, బెట్టింగ్‌ బాబులు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు ఫోన్లలో బెట్టింగ్‌ లావాదేవీలు నడిచేవి. ఫోన్‌ ట్యాపింగ్‌తో ద్వారా బెట్టింగ్‌ బాబులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో, బుకీలు మరో మార్గం ఎంచుకున్నారు. చిన్న చిన్న గ్రూపులుగా బెట్టింగ్‌ లావాదేవీలు జరుపుతున్నారు. ఇంకొందరు స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ కాస్తున్నారు. లైవ్‌లో మ్యాచ్‌ చూస్తూ, చేతిలోని స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా బెట్టింగ్‌ కాస్తున్నారు. దీనిని అడ్డుకోవడం పోలీసులకు దాదాపు అసాధ్యమవుతోంది.

అప్పులు... హత్యలు..
ఈ బెట్టింగ్‌ వ్యసనం.. అనేకమందిని బికారీలుగా మారుస్తోంది. అప్పుల ఊబిలోకి దింపుతోంది. కుటుంబాలను వీధిన పడేస్తోంది. గొడవలు, కక్షలు సృష్టిస్తోంది. దాడులకు.. దౌర్జన్యాలకు దారితీస్తోంది. చివరికి హత్యలకు కూడా పురిగొల్పుతోంది. ఇటీవల, బెట్టింగ్‌ నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఓ వ్యక్తి హత్య జరిగింది. వైరా మండలంలోని ఓ యువకుడు బెట్టింగ్‌ మోజులో పడి తన రెండెకరాల పొలాన్ని, ఒక ఫ్లాట్‌ను అమ్ముకున్నాడు. చివరికి, తన బైక్‌ను కూడా తాకట్టుపెట్టాడు. ఇలాంటి వారు ఎంతోమంది. బెట్టింగ్‌ కలిసొచ్చి కుబేరులైన వారు కేవలం కొంతమందే. ఆ కొంతమందిని చూసి, మిగిలినవారంతా.. ‘మాకు కూడా ఎప్పుడో ఒకప్పుడు అలా కలిసిరాక పోతుందా’ అనే ఆశతో.. భ్రమలతో ఊహాలోకంలో తిరుగుతున్నారు. బయటికొచ్చేసరికి బికారీలుగా మిగులుతున్నారు. చివరికి ఈ బెట్‌ (బెట్టింగ్‌).. వారి జీవితాలను ఫట్‌ (నాశనం)మంటూ దెబ్బతీస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement