ఒక్కో పందెం కోడి ధర రూ.2 లక్షలు | Krishna District Ready For Sankranthi Hen Fights | Sakshi
Sakshi News home page

కుక్కుటం.. రాజభోగం

Published Fri, Jan 3 2020 7:29 AM | Last Updated on Fri, Jan 3 2020 10:42 AM

Krishna District Ready For Sankranthi Hen Fights - Sakshi

కాలు దువ్వుతున్న కోడిపుంజులు

ఉదయాన్నే బాదం పప్పులు.. గంట గంటకు నల్లద్రాక్షలు, వెండి ఖర్జూరాలు, నల్లనువ్వులు, తాటి బెల్లం కలిపి చేసిన ఉండలు,మధ్యాహ్నం మటన్‌ విత్‌ జీడిపప్పు ఆహారం.. సాయంత్రం గుడ్డుతో పాటు ఆహారం, అప్పుడప్పుడూ స్వచ్ఛమైన వైన్‌ సేవనం. ఆహా ఏం మెనూరా బాబూ.. రాజయోగం అంటే ఇదే అనిపిస్తోంది కదూ.. దీన్నే కుక్కుట రాజభోగం అంటారు. సంక్రాంతి బరిలో దిగనున్న పందెం కోళ్లకు   పందెం రాయుళ్లు అందిస్తున్న మెనూ ఇది.. దాదాపు ఏడాది నుంచే ఇదేవిధమైన మెనూతో ఆహారం అందిస్తున్నారు. అంతేకాదండోయ్‌ వీటితో పొద్దునా, సాయంత్రం వ్యాయామం కూడా చేయిస్తుండడం కొసమెరుపు..

కైకలూరు: సంక్రాంతి పండుగ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మొదట గుర్తొచ్చేది కోడి పందేలు అని చెప్పవచ్చు. కొల్లేరు గ్రామాల్లో ఇప్పటి నుంచే పందెపు పుంజులను పందెం రాయుళ్లు, నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. మరో పదిరోజుల్లో జరిగే పందేల కోసం పుంజులకు భారీ గిరాకీ ఏర్పడింది. కైకలూరు నియోజకవర్గంలో వివిధ జాతులకు చెందిన పందెపు పుంజులను బరికి సిద్ధం చేస్తున్నారు.

రసింగి
కోడిపందేలకు కేరాఫ్‌ కొల్లేరు  
కైకలూరు ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ విస్తరించి ఉండటంతో చేపల చెరువు గట్లుపై పందెపు కోడిపుంజులను పెంచడాన్ని కొందరు హాబీగా పెట్టుకున్నారు. ఏడాదిగా వివిధ జాతులకు చెందిన కోడిపుంజులను అత్యంత ఖరీదైన ఆహారాన్ని అందించి పెంచుతున్నారు. కొన్ని జాతుల పుంజులు ఒక్కోటి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. సంక్రాంతి సమీపిస్తుండటంతో పందేల కోసం వీటి పోషణలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

డేగ
డైలీ మెనూ ఇది...
ఉదయం 6 గంటలకు పుంజులను నీటిలో ఈత కొట్టిస్తూ వ్యాయామం చేయిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఒక్కో పుంజుకు 10 బాదం పప్పులు, నల్లద్రాక్ష, వెండి ఖర్జూరం, తాటి బెల్లం, నల్లనువ్వులు కలిపిన  నువ్వుల ఉండలను ప్రతి గంటకు అందిస్తున్నారు. మధ్యాహ్నం 50 గ్రాముల మటన్, జీడిపప్పు కలిపిన ఆహారాన్ని పెడుతున్నారు. సాయంత్రం సోళ్లు, సజ్జలు, వడ్లుతో పాటు గుడ్డు అందిస్తున్నారు. అదేవిధంగా కొందరు స్వచ్ఛమైన వైన్‌ను తాగిస్తూ పందేలకు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా కండపుష్టి, అరుగుదలకు లీవ్‌ 52, నిరోబిన్, సుగండ్రీ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. ఇందుకు రోజుకు ఒక్కో పుంజుకు రూ.200 ఖర్చు చేస్తున్నారు. 

కుక్కుటశాస్త్రం ఆధారంగా...
వాస్తు శాస్త్రం, సంఖ్య శాస్త్రం మాదిరిగానే కోడిపందేలకు పూర్వం నుంచి కుక్కుట శాస్త్రం అందుబాటులో ఉంది. కుక్కుటేశ్వరస్వామి నుంచి ఈ పురాణం వినతికెక్కిందని చెబుతారు. బొబ్బిలియద్ధం కాలం నుంచి ఈ శాస్త్రాన్ని పందెం రాయుళ్లు అనుసరిస్తున్నారు. కోడిపుంజు జన్మ నక్షత్రం, జాతకం, 27 నక్షత్ర, వారఫలాలు ఇందులో ఉన్నాయి. పందెం జరిగే తిథిని బట్టి కోడిపుంజు గెలుస్తుందో లేదో అంచనా వేసి మరీ లక్షల్లో పందేలు కడతారు. 

రంగును బట్టి రంగంలోకి...

కోడిపుంజుల్లో వాటి ఈకల ఆధారంగా రకాలను నిర్ణయించి, ధరలు నిర్ణయిస్తారు. వీటిలో రంగు కీలకం. ఉదాహరణకు 100 కోడి పుంజులను తీసుకుని వాటిని నాలుగు దశల్లో పోరాట పటిమను అంచనా వేస్తారు. దీనిని బట్టి రూ.8,000 నుంచి రూ.2లక్షల వరకు ఒక్కో పుంజు ధర ఉంటుంది. ఒక్కో పుంజు పందేనికి సిద్ధమవడానికి 18 నెలల సమయం పడుతుంది. సాధారణంగా నెమలి, కొక్కిరాయి, పర్ల, పచ్చకాకి, తీతువా, డేగ, రసంగి, గౌడ నెమలి, మైలా, పింగళ, కాకి, సేతువ, నల్లబొట్ల తీతువా,అబ్రాస్‌ వంటివి పేరు గడించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement