కోడిపందేలపై దాడి చేసి పందెంరాయుళ్లను పట్టుకున్న పోలీసులు
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్: జిల్లాలో పందెంరాయుళ్లను పోలీసులు పరుగులు పెట్టిస్తున్నారు. మూడు వారాలుగా జిల్లాలో పేకాట, కోడిపందేలపై విస్త్రత దాడులు చేస్తూ పందెంరాయుళ్లను హడలెత్తిస్తున్నారు. పందెంరాయుళ్లను పట్టుకునేందుకు అడుగడుక్కి జల్లెడ పడుతున్నారు. పోలీసుల వలలో ఇప్పటికే వందల సంఖ్యలో చిక్కుకోగా ఇతర జూదగాళ్లు పోలీసుల వల నుంచి తప్పించుకునేందుకు పొదల వెంట పరుగులు తీస్తున్నారు. పోలీసుల వలకు చిక్కిన జూదగాళ్లు పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లిస్తూ గొల్లుమంటున్నారు. సంక్రాంతి సమీపిస్తుండటంతో జిల్లాలో జరుగుతున్న పేకాట, కోడిపందేలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు జూదగాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు.
20 రోజుల్లోనే లెక్కలేని కేసులు...
సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జిల్లాలో జరిగే పేకాట, కోడిపందేలతో పాటు ఇతరత్రా జూదాలపై ఉక్కుపాదం మోపాలంటూ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అధికారులను ఆదేశించటంతో రంగంలోకి దిగిన పోలీసులు పేకాట, కోడిపందెంరాయుళ్లను పరుగులు పెట్టిస్తున్నారు. పేక చప్పుడు వస్తే చాలు చటుక్కున వాలి వారిని చిటుక్కున పట్టేసుకుంటున్నారు. ప్రత్యేక టీంలు పందెంరాయుళ్ల కోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కూడా జల్లెడ పడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటూ శిబిరాలపై దాడులు చేసూŠత్ పేకాటరాయుళ్లను పట్టేస్తున్నారు. అలా గత ఇరవై రోజుల్లో ఇప్పటి వరకు 710 పేకాట శిబిరాలపై దాడులు చేసి 764 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి తొమ్మిది సెల్‌ఫోన్‌లతో పాటు నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కోడిపందేలకు సంబంధించి 157 కేసులు నమోదు చేసిన పోలీసులు 212 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 197 పందెంకోళ్లు, 219 కోడికత్తులు, ఐదు బైక్‌లు, తొమ్మిది సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడిపందేలకు సంబంధించి జరిపిన దాడుల్లో మొత్తంగా 976 మంది పందెంరాయుళ్లను పట్టుకున్న పోలీసులు, వారి నుంచి రూ.11,92,285 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
పండుగ సంస్కృతి ప్రశ్నార్థకమేనా?
సంక్రాంతి పండుగ మరో పది రోజులు మాత్రమే ఉంది. పండుగకు బరులు పెట్టుకునేందుకు ఓ పక్క నిర్వాహకులు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. కొన్ని ప్రాంతాల్లో బరులు పెట్టేందుకు ముహూర్తాలు కూడా పెట్టినట్లు పందెంరాయుళ్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో జిల్లాలో ఈ ఏడాది సంక్రాంతి పండుగకు బరులు పెట్టుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తారా లేదా అనే మీమాంసలో నిర్వాహకులు ఉన్నారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనా«థ్‌బాబు జూదాలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో బరులకు పచ్చ జెండా ఊపుతారా లేదా అనేది తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment