Cards club
-
పత్తాలు ఆడి రోడ్డున పడుతున్నారు.. అయినా మానట్లేదు
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. పోలీసులు కఠినచర్యలు చేపడుతున్నా జూదరుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. గతంలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యా పారి సుమారు రూ.3 కోట్ల ఆస్తులను అమ్మి, పేకాటకు పెట్టి నష్టాల ఊబిలో కూరుకుపోయా డు. మరో మద్యం వ్యాపారి సుమారు రూ.కోటి మేరకు ఆన్లైన్లో పేకాట ఆడి, అప్పులపాలయ్యాడు. కుటుంబసభ్యులు లబోదిబోమంటూ తమ ఆస్తులమ్మి తీర్చారు. జూదంతో జిల్లాలో ఎందరివో కాపురాలు కూలిపోయాయి. మూడేళ్లలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 2021లో పోలీసులు 207 కేసులు నమోదు చేసి, 295 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.32.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 2022లో 109 కేసులు నమోదు చేసి, 536 మందిని అరెస్టు చేశారు. రూ.16.91 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 20 కేసుల్లో 133 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయినా పోలీసుల కళ్లుగప్పి నిత్యం జూదం కొనసాగుతుండటంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. కొంతమంది పేకాట కోసం ఆస్తులు, బంగారం తాకట్టు పెడుతుండటంతో వారి బతుకులు తారుమారు అవుతున్నాయి. ఇళ్లు, మామిడితోటలే అడ్డాలు.. చాలా మంది పేకాటరాయుళ్లు ఇళ్లు, మామిడితోటలు, ఫామ్‌హౌస్‌లు, అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, రోడ్ల వెంట ఇన్ఫార్మర్లను పెట్టుకొని, జూదం ఆడుతున్నారు. నెలకు సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేర సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో రెండంతస్తుల భవనాలను అద్దెకు తీసుకొని, కింది అంతస్తులో కుటుంబాలను అద్దెకు ఉంచుతూ రెండో అంతస్తులో జూదం నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న జూదరులు జగిత్యాల జిల్లాలోని పేకాట స్థావరాలకు ఇతర జి ల్లాల నుంచి కూడా జూదరులు పెద్ద ఎత్తున వస్తున్నారు. పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నా వారు వెనుకడుగు వేయడం లేదు. పేకాడుతున్న సమయంలో పోలీసులు దాడులు చేస్తే చాలామంది జూదరులు వారి కళ్లుగప్పి, పారిపోతున్నారు. అడ్డుకట్ట పడేదెలా? జిల్లా వ్యాప్తంగా పేకాటను అడ్డుకునేందుకు పో లీసులు చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదు. జూదం ఆడేవారికి కోర్టులో కఠిన శిక్షలు లేకపోవడంతో చాలా మంది పట్టుబడినా తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు. బయటకు వచ్చి, మళ్లీ పే కాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెస్తే తప్ప జూదానికి అడ్డుకట్ట పడేలా లేదు. పేకాటపై ప్రత్యేక నిఘా జగిత్యాల జిల్లాలో పేకాటను అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. చాలా మందిపై కేసులు నమోదు చేస్తూ అరెస్టు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో కఠినచర్యలు తీసుకుంటున్నాం. – ఎగ్గడి భాస్కర్, ఎస్పీ -
పేకాటలో దొరికి యువకుడు ఆత్మహత్య
-
పేకాటలో దొరికి యువకుడు ఆత్మహత్య
సాక్షి, కృష్ణా: జిల్లాలోని కంచికచెర్ల మండలం పరిటాలలో విషాదం చోటుచేసుకుంది. పేకాట ఆడుతూ పట్టుబడిన ఓ యువకుడు అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం పేకాట ఆడుతూ రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు పట్టుబడ్డాడు. విషయం అందరికీ తెలిసిపోవటంతో మనస్తాపం చెందిన రాజశేఖర్‌రెడ్డి నిన్న రాత్రి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టాడని పోలీసులు కొట్టడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని తల్లి ఆరోపించారు. మరోవైపు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామే తప్ప కొట్టలేదంటున్న పోలీసులు చెప్తున్నారు. (చదవండి: చూస్తుండగానే కృష్ణానదిలో దూకిన డాక్టర్) -
పందెంరాయుళ్లపై పంజా
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్: జిల్లాలో పందెంరాయుళ్లను పోలీసులు పరుగులు పెట్టిస్తున్నారు. మూడు వారాలుగా జిల్లాలో పేకాట, కోడిపందేలపై విస్త్రత దాడులు చేస్తూ పందెంరాయుళ్లను హడలెత్తిస్తున్నారు. పందెంరాయుళ్లను పట్టుకునేందుకు అడుగడుక్కి జల్లెడ పడుతున్నారు. పోలీసుల వలలో ఇప్పటికే వందల సంఖ్యలో చిక్కుకోగా ఇతర జూదగాళ్లు పోలీసుల వల నుంచి తప్పించుకునేందుకు పొదల వెంట పరుగులు తీస్తున్నారు. పోలీసుల వలకు చిక్కిన జూదగాళ్లు పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లిస్తూ గొల్లుమంటున్నారు. సంక్రాంతి సమీపిస్తుండటంతో జిల్లాలో జరుగుతున్న పేకాట, కోడిపందేలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు జూదగాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. 20 రోజుల్లోనే లెక్కలేని కేసులు... సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జిల్లాలో జరిగే పేకాట, కోడిపందేలతో పాటు ఇతరత్రా జూదాలపై ఉక్కుపాదం మోపాలంటూ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అధికారులను ఆదేశించటంతో రంగంలోకి దిగిన పోలీసులు పేకాట, కోడిపందెంరాయుళ్లను పరుగులు పెట్టిస్తున్నారు. పేక చప్పుడు వస్తే చాలు చటుక్కున వాలి వారిని చిటుక్కున పట్టేసుకుంటున్నారు. ప్రత్యేక టీంలు పందెంరాయుళ్ల కోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కూడా జల్లెడ పడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటూ శిబిరాలపై దాడులు చేసూŠత్ పేకాటరాయుళ్లను పట్టేస్తున్నారు. అలా గత ఇరవై రోజుల్లో ఇప్పటి వరకు 710 పేకాట శిబిరాలపై దాడులు చేసి 764 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి తొమ్మిది సెల్ఫోన్లతో పాటు నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కోడిపందేలకు సంబంధించి 157 కేసులు నమోదు చేసిన పోలీసులు 212 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 197 పందెంకోళ్లు, 219 కోడికత్తులు, ఐదు బైక్‌లు, తొమ్మిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడిపందేలకు సంబంధించి జరిపిన దాడుల్లో మొత్తంగా 976 మంది పందెంరాయుళ్లను పట్టుకున్న పోలీసులు, వారి నుంచి రూ.11,92,285 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పండుగ సంస్కృతి ప్రశ్నార్థకమేనా? సంక్రాంతి పండుగ మరో పది రోజులు మాత్రమే ఉంది. పండుగకు బరులు పెట్టుకునేందుకు ఓ పక్క నిర్వాహకులు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. కొన్ని ప్రాంతాల్లో బరులు పెట్టేందుకు ముహూర్తాలు కూడా పెట్టినట్లు పందెంరాయుళ్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో జిల్లాలో ఈ ఏడాది సంక్రాంతి పండుగకు బరులు పెట్టుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తారా లేదా అనే మీమాంసలో నిర్వాహకులు ఉన్నారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనా«థ్‌బాబు జూదాలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో బరులకు పచ్చ జెండా ఊపుతారా లేదా అనేది తెలియాలి. -
వీరు అడగరు.. వాళ్లు ఇవ్వరు..
సాక్షి, సిటీబ్యూరో: మాదకద్రవ్యాలు, పేకాట శిబిరాలు, హవాలా గ్యాంగ్స్... ఇలాంటి వాటిపై నిత్యం కన్నేసి ఉంచుతున్న నగర పోలీసులు ఎప్పటికప్పుడు చెక్ చెప్తున్నారు. ఈ కేసులను అధికారికంగా ‘క్యాష్’ చేసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏటా ప్రోత్సాహకాల రూపంలో రావాల్సిన రూ.కోట్లు నగర పోలీసు విభాగం నష్టపోతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి, ఆయా కేసుల్లో ప్రోత్సాహకాలు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. హుండీ ముఠాలకు కేరాఫ్... ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతూ రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడిని హవాలా గాను, దేశంలోని రెండు ప్రాంతాల మధ్య జరిగే మార్పిడిన హుండీ వ్యాపారంగా పేర్కొంటారు. నగరంలో హుండీ వ్యాపారం జోరుగా సాగుతుంటోంది. పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ మార్గంలో లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి ‘పన్ను పోటుతో’ పాటు అసాంఘికశక్తులు, మాఫియా, ఉగ్రవాదులకు అనువుగా ఉందని భావించిన నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తుంటారు. శాంతిభద్రతల విభాగం అధికారులు అప్పుడప్పుడు ఈ గ్యాం గ్స్‌ను పట్టుకుంటూ ఉంటారు. ఏటా రూ.5 కోట్లకు పైగానే హుండీ/హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. గత ఏడాది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ మొత్తం రూ.13 కోట్లకు చేరింది. పది శాతానికి అవకాశం ఉన్నా... ఆదాయపుపన్ను శాఖ నిబంధనల ప్రకారం ఆదాయానికి మించిన/అక్రమ ఆస్తులు, హవాలా, హుండీ తదితర వ్యవహారాలకు సంబంధించిన సమాచారం ఇచ్చి, వాటి గుట్టును బయటపెడితే సదరు ఇన్ఫార్మర్కు పది శాతం కమీషన్‌గా ఇస్తారు. ఈ అవకాశం చట్టమే వారికి కల్పించింది. ఏటా నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులే హుండీ/హవాలాలకు సంబంధించిన అనేక ముఠాల గుట్టును రట్టు చేస్తున్నారు. వీరి నుంచి రూ.కోట్లల్లో నగదు స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగిస్తున్నారు. గత ఏడాది పట్టించిన రూ.13 కోట్లల్లోనూ నగర పోలీసులకు కనీసం రూ.1.3 కోట్లు రావాల్సి ఉంది. ఏటా ఈ స్థాయిలో రాకపోయినా కనీసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వచ్చే ఆస్కారం ఉంటోంది. ఆ రెండు కేటగిరీల్లోనూ ఆస్కారం... హవాలా/హుండీ ముఠాలే గాక, పేకాట శిబిరంపై దాడి చేసినా, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నా నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలు పొందే ఆస్కారం ఉంది. మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న అనేక ముఠాలు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, శాంతిభద్రతల విభాగం అధికారులకు చిక్కుతూ ఉంటాయి. వీరి నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటుంటారు. వీరితో పాటు గంజాయి ముఠాలు, పేకాట శిబిరాలపై దాడులు చేసి నిందితులకు చెక్ చెబుతూ ఉంటారు. ఈ కేసుల్లోనూ ఆయా విభాగాల నుంచి ప్రోత్సాహకం పొందే ఆస్కారం ఉంది. డ్రగ్స్ కేసుల్లో పట్టుకున్న మాదకద్రవ్యం విలువలో 15 శాతం, పేకాట (గాంబ్లింగ్) కేసుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తంలో 10 శాతం ప్రోత్సాహకంగా అందించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. పట్టుకున్నంత అప్పగించడమే... ఈ హుండీ ముఠాలు ఉత్తరాది కేంద్రంగానే పని చేస్తున్నాయి. ప్రధాన సూత్రధారులు అక్కడే ఉంటున్నా నగరంలోని ఏజెంట్ల ద్వారా ఫోన్ కాల్స్‌తో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇక్కడి ఏజెంట్లపై తమ వేగుల ద్వారా సమాచారం అందుకుంటున్నటాస్క్‌ఫోర్స్, ఇతర విభాగాల అధికారులు వారిని పట్టుకుని, భారీగా నగదుస్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల లింకు ఉన్నట్లు ఆధారాలు లభిస్తే తప్ప మిగిలిన కేసుల్ని ఆపై దర్యాప్తు, విచారణ చేసే అధికారం మాత్రం పోలీసులకు లేదు. ఈ నేపథ్యంలోనే పట్టుకున్న ప్రతి ముఠాను స్వాధీనం చేసుకున్న నగదుతో సహా తక్షణం ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించాల్సిందే. ఆ తరవాత వ్యవహారమంతా వారే చూసుకుంటారు. తదుపరి పురోగలి ఏమిటనేది కూడా వారు పోలీసులకు వెల్లడించరు. ఆసక్తి చూపని అధికారులు ఈ కేసుల్లో అత్యధికం టాస్క్‌ఫోర్స్ అధికారులే పట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని విభాగాలు ఇన్ఫార్మర్లుగా పిలిచే వేగుల్ని ‘నిర్వహించడానికి’ అవసరమైన ఖర్చుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో ఉన్న ప్రోత్సాహకాల అవకాశాన్ని వినియోగించుకుని, తమకు రావాల్సిన మొత్తాన్ని ఆదాయపుపన్ను శాఖతో పాటు ఇతర విభాగాలను అడగడానికి మాత్రం ఆయా వింగ్స్, ఉన్నతాధికారులు ఆసక్తి చూపడం లేదు. ఐటీ అధికారులైనా నగర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వంలో భాగమని, వారికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఇచ్చినట్లే అనే కోణంలో ఆలోచించట్లేదు. ఫలితంగా అందాల్సిన ప్రోత్సాహకాలు అందట్లేదు. ఇకనైనా అధికారులు స్పందించి నిబంధనల ప్రకారం రావాల్సిన, వచ్చే అవకాశం ఉన్న ప్రోత్సాహకాల్ని నగర పోలీసు, టాస్క్‌ఫోర్స్ విభాగాలకు లేదా పోలీసు సంక్షేమ నిధికి వచ్చేలా చేయాల్సిన అవసరం ఉందని సిబ్బంది పేర్కొంటున్నారు. -
ఆటకు రూ.500!
సాక్షి, సిటీబ్యూరో: తన కార్యాలయాన్నే పేకాట శిబిరంగా మార్చేసిన ఓ ప్రబుద్ధుడు పరిచయస్తుల్ని ఆహ్వానించి మూడు ముక్కలాట ఆడిస్తున్నాడు. ఒక్కో ఆటకు రూ.500 చొప్పున కమీషన్ తీసుకుంటున్నాడు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. నిర్వాహకుడితో సహా 14 మందిని పట్టుకున్న అధికారులు వీరి నుంచి రూ.47 వేల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. దోమలగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ లతీఫ్ ఖాన్ లోయర్ ట్యాంక్ బండ్లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని సోలార్ విజన్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ఇలా వచ్చే ఆదాయంతో తృప్తి పడని ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించాడు. ప్రభుత్వం పేకాట క్లబ్బుల్ని నిషేధించడంతో పేకాటరాయుళ్ళ కోసం తన కార్యాలయాన్నే శిబిరంగా మార్చేయాలని నిర్ణయించుకున్నాడు. పరిచయస్తులు, స్నేహితుల్ని ఆహ్వానిస్తూ ఆ కార్యాలయంలో మూడు ముక్కలాట ఆడించడం మొదలెట్టారు. ఒక్కో గేమ్‌కు రూ.500 చొప్పున కమీషన్ తీసుకుంటున్నాడు. ఇతడి వద్దకు వచ్చి పేకాట ఆడుతున్న వారంతా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతులకు చెందిన వారే. గడిచిన కొన్నాళ్ళుగా గట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై శనివారం రాత్రి మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, టి.శ్రీధర్ తమ బృందాలతో ఆ కార్యాలయంపై దాడి చేశారు. అక్కడే ఉన్న నిర్వాహకుడు లతీఫ్ ఖాన్‌తో పాటు మూడు ముక్కలాట ఆడుతున్న మహ్మద్ ఫైజల్ (కూలీ), సాదిఖ్ అలీ (కార్పెంటర్), మిరాజుద్దీన్ (ఎలక్ట్రీషియన్), మహ్మద్ ఇస్మాయిల్ (కూలీ), కె.సతీష్ (సేల్స్‌మెన్), జి.సురేష్ (మొబైల్ టెక్నీషియన్), సీహెచ్ శేఖర్ (ఆటోడ్రైవర్), కె.కృష్ణ (ప్రైవేట్ ఉద్యోగి), మహ్మద్ ఫక్రుద్దీన్ అహ్మద్ (స్క్రాప్ వ్యాపారి), జబీర్ హుస్సేన్ (స్క్రాప్ వ్యాపారి), మహ్మద్ హుస్సేన్ (స్క్రాప్ వ్యాపారి), మహ్మద్ అక్బర్ ఖాన్ (డ్రైవర్), యాకూబ్ అలీలను (స్క్రాప్ వ్యాపారి) అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, 16 సెల్ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. -
ప్రాణం మీదకు తెచ్చిన పేకాట
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నిషేధిత ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఓ యువకుడి ప్రాణాల పైకి తెచ్చింది. ఇద్దరు యువకులు పరారీ కాగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మల్లికార్జునపేటకు చెందిన నలుగురు ఇంద్రకీలాద్రి కొండపైకి ఎక్కి పేకాట ఆడుతున్నారు. సాయంత్రం 3–30 గంటల సమయంలో అమ్మవారి ఆలయం కొండపై ఉన్న వాటర్ ట్యాంక్ మీదుగా కొండ శిఖరానికి చేరుకున్నారు. నిశ్చయ సీఎం జగన్మోహన్రెడ్డి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేయడంతో ప్రత్యేక పోలీసుల బలగాలు కొండ శిఖరం పైకి చేరుకుని భద్రతను పర్యవేక్షించారు. ఇదే సమయంలో ఇద్దరు యువకులు పోలీసు బలగాలను చూసి పరార్ కాగా, మరో యువకుడు కొండ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పడంతో చెట్టును పట్టుకుని వేలాడసాగాడు. భద్రత పర్యవేక్షిస్తున్న పోలీసులు ఆ యువకుడి రక్షించే ప్రయత్నం చేయగా, ఆ యువకుడు చేయి వదిలేశాడు. దీంతో ఆ యువకుడు కొండపై నుంచి కిందకు జారిపడ్డాడు. జారిపడిన యువకుడు మద్యం మత్తులో ఉండటంతో చిన్న పాటి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. మరో యువకుడిని పోలీసుల బలగాలు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
పెద్దల పేకాట అడ్డా !
కదిరి: కదిరి పట్టణ నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్‌కు పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్యకు సంబంధించిన జొన్నా లాడ్జిలో పేకాట జోరుగా సాగుతోంది. ఆ లాడ్జిలో బస చేసే వారు కరువైనందున దాన్ని ఎన్నికల సమయంలో టీడీపీ కార్యాలయంగా మార్చారు. సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 11న ముగియడంతో 12వ తేదీ నుంచి ఆ లాడ్జిని పేకాట అడ్డాగా మార్చారు. ఈ విషయం పలుమార్లు స్థానిక పోలీసు అధికారులకు కొందరు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో, వారు నేరుగా డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో అప్పుడు స్థానిక పోలీసు అధికారుల్లో చలనం వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో లాడ్జిపై దాడులు నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతున్న 12 మందిని అరెస్ట్ చేసి వారి నుండి రూ54,500 స్వాధీనం చేసుకున్నారు. పెద్దల అండతోనే పేకాటజరుగుతోందా? జొన్నా లాడ్జి యజమాని జొన్నా రామయ్య ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే. అప్పుల భారంతో ఆయన తమ లాడ్జిని అమ్మకానికి కూడా పెట్టారు. టీడీపీలో చేరి తన గెలుపునకు సహకరిస్తే లాడ్జి అమ్మకుండా ఆ డబ్బు సర్దుబాటు చేసే బా«ధ్యత తనదేనని చెప్పడంతోనే ఆయన టీడీపీలో చేరినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ పెద్దల అండతోనే ఆ లాడ్జిలో పేకాట పెద్ద మొత్తంలో జరుగుతున్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం అక్కడికి పేకాట ఆడేందుకు వస్తున్నారని, డబ్బులు పెద్ద మొత్తంలో పోగొట్టుకున్న వారే పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారని తెలుస్తోంది. అసలు నాయకులను తప్పించారా? రెండు రోజుల క్రితం జొన్నా లాడ్జిలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించినప్పుడు అధికార టీడీపీకి చెందిన కొందరు ప్రముఖ నాయకులను తప్పించినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. పెద్ద మొత్తంలో నగదు లభిస్తే కేవలం రూ.54,500 మాత్రమే కోర్టు దృష్టికి తెచ్చారని, మిగిలిన సొమ్మును పోలీసు అధికారులు స్వాహా చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాడ్జిలో జరుగుతున్న పేకాటను నివారించకపోతే అక్కడ హత్యలకు దారితీసినా ఆశ్చర్య పోనక్కర లేదని కొందరంటున్నారు. -
సైసై.. నైనై
జంగారెడ్డిగూడెం: ఒక పక్క కోడిపందేలు, పేకాటకు పోలీసులు ‘నై’ అంటున్నా.. పందెగాళ్లు మాత్రం ‘సై’ అంటూ ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఏటా సంక్రాంతి సీజన్లో పండ గకు ముందు కోడిపందేలు, జూదాలపై పోలీసులు దాడులు నిర్వహించడం, పండగకు నిర్వహిస్తే ఉక్కుపాదం మోపుతామని ప్రకటించడం, ఆ తర్వాత చూసీచూడనట్టు వదిలేయడం తెలిసిందే. ఇటీవల జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ కోడిపందేలు, జూదాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో రెవె న్యూ, పోలీసు యంత్రాంగం ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నారు. ఎవరి ఏర్పాట్లలో వారు.. పండగ మూడు రోజులు కోడిపందేలు నిర్వహిం చేందుకు పందెంగాళ్లు సమాయత్తమయ్యారు. ఎలాగైనా జరిగి తీరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారి ఏర్పాట్లలో వారు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఏజెన్సీ, మెట్ట ప్రాం తాల్లో జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపు రం, బైపాస్ రోడ్డు జంక్షన్, సుబ్బంపేటలో ఏటా భారీ ఎత్తున కోడిపందేలు జరుగుతున్నాయి. కామవరపుకోట మండలం వెంకటాపురం, కళ్లచెరువుల్లో పెద్దస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఖమ్మం జిల్లాలు, కర్ణాటక నుంచి పందెగాళ్లు ఇక్కడకు వస్తుం టారు. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన కోడిపందేల్లో తెలంగాణకు చెందిన ఒకరు రివాల్వర్‌ను మూడు రౌండ్లు గాల్లోకి పేల్చి పందేలను ప్రారంభించడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. భారీ పందేలకు ఒక బరి, మధ్యతరహా పందేలకు ఒక బరి, చిన్నపాటి పందేలకు మరో బరి అన్నట్టుగా ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉంటాయో అని పందెగాళ్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఏటా పోలీసులు కోడిపందేలు, జూదాలు జరగనీయమని ప్రకటించడం, ఉక్కుపాదం మోపుతామని చెప్పడం ఆనక పండగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేయడం షరా మామూలే కాబట్టి ఈ ఏడాది కూడా ఆ మూడురోజులు కోడిపందేలు జరుగుతాయని జనం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో మోస్తరుగా.. పశ్చిమ ఏజెన్సీ మండలాల్లో చాలా చోట్ల మోస్తరుగా కోడిపందేలు నిర్వహిస్తారు. బుట్టాయగూడెం మండలంలో యర్రాయగూడెం, వెలుతురువారిగూడెం, మర్రిగూడెం, దొరమామిడి, దుద్దుకూరు, అచ్చియపాలెం, కొవ్వాడలో, టి.నరసాపురంలో, జీలుగుమిల్లి మండలంలో కామయ్యపాలెం, ములగలంపల్లి, పాలచర్ల తదితర గ్రామాల్లో, గోపాలపురం మండలం వెంకటాయపాలెం, గుడ్డిగూడెం, హుకుంపేటలో కోడిపందేలు జరుగుతాయి. కొయ్యలగూడెం మండలం రాజవరం, కన్నాపురం, రామానుజపురం తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తారు. చింతలపూడి మండలం వెంకటాపురంలో పెద్దెత్తున కోడిపందేలు జరుగుతాయి. సీతానగరం, చింతంపల్లి, తిమ్మిరెడ్డిపల్లి, రేచర్లలో పందేలు జరుగుతాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, ములగలంపాడులో భారీ కోడిపందేలు జరుగుతాయి. ఇక జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం, పేరంపేట, తాడువాయి, పంగిడిగూడెం, గుర్వాయిగూడెం, తిరుమలాపురం, కేతవరం, స్థానిక సుబ్బంపేటలలో ఒక మాదిరి కోడిపందేలు జరుగుతాయి. కోడిపందేలు నిర్వహించే ప్రతి చోటా నిర్వాహకులు ఏర్పాట్లకు సమాయాత్తమవుతుంటే, పోలీసులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. ఈసారి ఉత్కంఠ గతేడాది జరిగిన కోడిపందేలు, జూదాల విషయంలో ఇప్పటికే పోలీసు, రెవెన్యూ అధికారులు నోటీసులు అందుకోవడంతో ఇప్పుడు కోడిపందేలపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఆయా పోలీసు స్టేషన్ పరిధిలోని కోడిపందేలు నిర్వహించే గ్రా మాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు అవగాహన సదస్సులు, హెచ్చరికలు జారీ చేస్తున్నా పం దెంగాళ్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మరి కొందరు రహస్య ప్రాంతాలకు వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంత కోడిపందేల నిర్వాహకులు తెలంగాణ, పొరుగుజిల్లాల పందెగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుని కోడిపందేలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. -
ఎంట్రీ ఫీజ్... రూ.500!
సాక్షి, సిటీబ్యూరో: కారు డ్రైవింగ్ వృత్తిగా ఉన్న ఓ వ్యక్తి పేకాట శిబిరాన్ని నిర్వహించడం ప్రవృత్తిగా చేసుకున్నాడు. ఇలాంటి వ్యవహారాలు సాగించే వారు సాధారణంగా ఒక్కో ఆట నుంచి కొంత మొత్తం కమీషన్ తీసుకుంటారు. ఇతగాడు మాత్రం తన డెన్లోకి రావాలంటే రూ.500 ఎంట్రీ ఫీజుగా నిర్దేశించి వసూలు చేస్తున్నాడు. బొల్లారం, కలాసీగూడలోని ఈ శిబిరంపై దాడి చేసిన ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు 12 మంది పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. వీరి నుంచి రూ.1.87 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కలాసీగూడకు చెందిన ధర్మేష్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా ఇతడికి పేకాట ఆడే అలవాటు ఉంది. కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతడికి కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషించాడు. తానే ఓ నిర్వాహకుడిగా మారి పేకాట శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటినే డెన్‌గా మార్చేసిన ధర్మేష్ పరిచయస్తులు, స్నేహితుల్లో పేకాట ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానిస్తున్నాడు. శిబిరంలోకి రావడానికి ఒక్కొక్కరి నుంచి రూ.500 ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నాడు. వారితో మూడు ముక్కలాట ఆడిస్తున్నట్లు సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో దాడి చేశారు. ధర్మేష్‌తో పాటుపేకాట ఆడటానికి వచ్చిన 11 మందినిపట్టుకున్నారు. వీరి నుంచి నగదు, పేకముక్కలు తదితరాలు స్వా«ధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం బొల్లారం పోలీసులకు అప్పగించారు. -
పేక ముక్క మాటున.. అంతా ‘మామూళ్లే..’
తూర్పుగోదావరి , కాజులూరు/ కె.గంగవరం ,రామచంద్రపురం: రామచంద్రపురం మండలం వెలంపాలేనికి చెందిన ఓ యువకుడు పేకాటలో రూ.లక్షలు పోగొట్టుకుని ఇటీవల ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇతడే కాదు.. ఎందరో ఇలా పేకాటలో తమ తలను తాకట్టుపెట్టి మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే రామచంద్రపురం నియోజకవర్గం, పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికార పార్టీకి చెందిన కొందరు ఈ పేకాట క్లబ్బులను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఇదే పేకాట క్లబ్‌ల నుంచి సొమ్ములు తీసి అందించాలని నిర్ణయించడం తెలుగు తమ్ముళ్లకే చెల్లిందని పలువురు విమర్శిస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే క్లబ్‌లను నిర్వహిస్తూ నెలకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. నియోజకవర్గంలోని కాజులూరు, కె.గంగవరం, రామచంద్రపురం మండలాలతో పాటుగా రామచంద్రపురం పట్టణంలోను యథేచ్ఛగా పేకాట క్లబ్‌లను టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పోలీసులకు నెలవారీ మామూళ్లు ఎరచూపి ఈ క్లబ్లనున నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రామచంద్రపురం పట్టణంలో నాలుగు చోట్ల, రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామలోని కోటిపల్లి రోడ్డులో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ భవనాల్లో, తోటపేటలోని ఒక ప్రవేటు భవనంలో ప్రతి రోజూ పేకాటలను నిర్వహిస్తున్నారు. కె.గంగవరంలో కూళ్ల, కె.గంగవరం, కాజలూరు మండలంలోని గొల్లపాలెం, కాజులూరు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుల నేపథ్యంలో నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు రామచంద్రపురం మండలంలోని చోడవరంలో, నరసాపురపుపేటలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి మరీ పేకాట క్లబ్‌లను నిర్వహించగా, జిల్లా స్థాయి పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేసి అరికట్టారు. రెండు, మూడు నెలలుగా తిరిగి నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లు జోరందుకున్నాయి. ఆయా క్లబ్‌లకు వెళ్లే వారి నుంచి పేకాట ఆడేందుకు ప్రతి ఒక్కరూ 24 గంటలకు రూ.వెయ్యి ఫీజు కట్టాలి. ఇలా ప్రతి క్లబ్‌ల నుంచి ప్రతి రోజూ రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. రామచంద్రపురం పట్టణంతో పాటుగా ద్రాక్షారామలోని క్లబ్‌ల నుంచి ప్రతి రోజూ సుమారు రూ.లక్ష వరకు ప్రవేశ రుసుంగా వసూలు చేస్తుండగా, ప్రతి నెలా రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల వరకు క్లబ్‌ల ద్వారా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. దీంట్లో పోలీసులకు ప్రతినెలా రూ.నాలుగు లక్షల వరకు అందించగా క్లబ్‌ల నిర్వహణకు రూ.ఐదు లక్షల వరకు తీసి మిగిలిన సొమ్ములను అధికార పార్టీకి చెందిన కొంత మంది నేతలు ఒక్కొక్కరూ రూ.మూడు లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు పంచుకుంటున్నారు. పేకాడుతున్న వారి నుంచి దోచుకుంటున్నారు. ప్రతి నెలా పోలీసులకు మామూలుగానే డివిజన్ స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇస్తున్నామని; అందుకే ఇంత స్వేచ్ఛగా ఆడుకోగలుగుతున్నామని పేకాటరాయుళ్లే అంటుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. దగ్గరుండి మరీ ఆడిస్తున్నారా? వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు రోజు వారీ కూలీలు కూడా ఈ పేకాట క్లబ్‌లను వెళుతూ కుటుంబాలను వీధిన పడేస్తుంటే వాటిని అరికట్టాల్సిన అధికార పార్టీ నేతలు వాటిని దగ్గరుండి మరీ ఆడిస్తున్న తీరు విస్తుపోయేలా చేస్తుందని నియోజకవర్గ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలు నాశనం అవుతుంటే క్లబ్‌లపై దాడులు చేసి అరికట్టాల్సిన పోలీసులు తీరుపై పేకాటతో నష్టపోయిన కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు మేల్కొని పేకాట క్లబ్‌లను అరికట్టాలని కోరుతున్నారు. -
షాడో మినిస్టర్
పేకాట క్లబ్ నిర్వహణ... ఇసుక, మద్యం మాఫియాలకు కొవ్వూరు నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్‌గా తయారైంది. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పేరుకు జవహర్ మంత్రి అయినా పెత్తనమంతా ఈయనే చక్కపెడుతుంటారని ఆయన అనుయాయులు చెప్పుకుంటారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొవ్వూరులో పేకాట క్లబ్‌ల నిర్వహణ, ఇసుక ర్యాంపుల్లో వాటాలు, మద్యం దుకాణాల సిండికేట్ మొత్తం ఆ నేత కనుసన్నల్లోనే జరుగుతుంటుంది. నెలవారీగా మామూళ్లు ముట్టజెప్పుతూ నియోజకవర్గంలోని అధికారులను తన చెప్పు చేతల్లో పెట్టుకుంటారని సమాచారం. ఈ నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా నాయకులు ఆయన్ని ప్రసన్నం చేసుకోవాల్సిందే. మొదటి నుంచి మంత్రి వెనుక ఉండి షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మంత్రి సైతం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. మంత్రిగారు కూడా ఆయన మాట జవదాటరనే ప్రచారం ఉంది. అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు, ఆ పనులపై పర్సంటేజీలు అన్నీ ఆయన కనుసైగల్లోనే సాగుతాయి. ఈయనపెత్తనం ఎక్కువ అవ్వడంతో మిగిలిన వర్గాలు మంత్రికి దూరంగా జరిగారు. ఇప్పుడు నియోజకవర్గంలో కీలక భూమిక పోషిస్తున్న ఈ నేతకి వ్యతి రేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేయడంతో పాటు ఇక్కడ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. క్లబ్ నిర్వహణతో నెలకు రూ.కోటికిపైగా ఆదాయం పట్టణం నడిబొడ్డులో పేకాట క్లబ్ ద్వారా నెలకి రూ.కోటి రూపాయల వరకు దండుకుంటున్నట్టు చెబుతున్నారు. దీనిలో ముఖ్య ప్రజాప్రతినిధికి కూడా వాటాలు అందుతున్నట్టు ప్రచారం ఉంది. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన నాయకులే ఈ క్లబ్ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు నాయకులు చెబుతున్నారు. జవహర్ మంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి క్లబ్లో పేకాట జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇసుక ర్యాంపుల్లో వాటాలు నియోజకర్గంలో కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో ఉన్న ఇసుక ర్యాంపుల్లో ఈ నేతకు వాటలు పంపితేనే ర్యాంపులు నడుస్తాయి. మామూళ్లు అందకపోతే ఏవేవో కారణాలు చూపి కొర్రీలు పెట్టి ర్యాంపులు మూయించి వేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రధానంగా సీతంపేట నుంచి పశ్చిమ డెల్టా కాలువలో ఇసుక పడవలు నడుపుకోవడానికి నెలకి ఒక్కో పడవ నిర్వాహకుడు రూ.20 వేలు చొప్పున మామూళ్లు ఇస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇక్కడ నలభై పడవలు వరకు నడుస్తున్నాయని చెబుతున్నారు. తాళ్లపూడి మండలం తాడిపూడిలో డ్రెడ్జర్ల సాయంతో గత ఏడాది తవ్వకాలు సాగించారు. ఆ సమయంలో రోజుకి రూ.ఐదు లక్షలు చొప్పున మామూళ్లు తీసుకునే వారని సమాచారం. ఇది కాకుండా అవసరమైనప్పుడల్లా ర్యాంపుల్లో నిర్వాహకులు ఇసుక కేటాయించాల్సిందే. ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు రాష్ట్రంలో ఎక్కడ ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయాలు సాగినా ఈ నియోజకవర్గంలో మాత్రం క్వార్టర్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అదనంగా చెల్లించాల్సిందే. ఈ నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్న నియోజకవర్గాల్లో కూడా అన్ని మద్యం దుకాణాలు ఈయన అధీనంలో ఉన్న సిండికేట్‌లోనే ఉన్నాయి. వీటితో పాటు దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం తదితర మండలాల్లో కొన్ని దుకాణాలను ఈయన కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. అబ్కారీ శాఖ మంత్రి నియోజకవర్గం కావడంతో మంత్రిని అడ్డుపెట్టుకుని అడ్డు అదుపు లేకుండా బెల్టుషాపులు నడుపుతున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పోలీసులు ఈ బెల్టు దుకాణాల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు. ఏదైనా ఫిర్యాదులు అంది నప్పుడో, ప్రతికల్లో కథనాలు వచ్చిన సందర్భాలోను మొక్కుబడిగా కేసు నమోదు చేస్తున్నారు. సినిమా టిక్కెట్లనూ వదలడం లేదు సినిమాలపై కూడా ఈ నేతదే పెత్తనం. ఆయన సొంత థియేటర్లతో పాటు మిగిలిన థియేటర్లలో కూడా ఏదైనా ప్రముఖ హీరో సినిమా విడుదలైందంటే టిక్కెట్లు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు, మూడు రెట్లు అధిక రేట్లు పెట్టి మరీ గుం జుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రేక్షకుల జేబు లకు చిల్లు పడుతోంది. రోజు వారీ టిక్కెట్లు సైతం రెట్టింపు రేట్లుకి విక్రయాలు సాగిస్తున్నా, రాత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఇక్కడి అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదు. థియేటర్ కోసం సిమెంటు రోడ్డు నియోజకవర్గంలో నేటికీ అనేక ప్రాంతాల్లో సరైన రోడ్లు, డ్రెయిన్లు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవేం పట్టించుకోకుండా ఆ నేత వాటాదారుడిగా ఉన్న సినిమాహాలు కోసం ఇటీవల తాళ్లపూడిలో జనావాసాలు లేని చోట సుమారు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు వేయడం విమర్శలకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ గ్రాంట్, ఉపాధిహామీ, గ్రామ పంచాయతీ నిధులతో ఈ రోడ్డు నిర్మించారు. కొవ్వూరులో కూడా ఆయన థియేటర్ వీధిని విస్తరించి, సెంట్రల్ లైటింగ్‌తో సుందరంగా తయారు చేసుకున్నారు. -
నాయుడుగారి తోటలో..!
శ్రీకాకుళం, టెక్కలి: పెద్ద పెద్ద నగరాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతూ గుట్టు చప్పుడు కాకుండా విస్తరిస్తున్న పేకాట వ్యాపారం ఇప్పుడు జిల్లా కేంద్రంలో పాగా వేసింది. పేకాట ఆడాలనే ఆసక్తి ఉంటే చాలు నిర్వాహకులు వేల రూపాయలు చెల్లించి వాహనాలు ఏర్పాటు చేసి మరీ పేకాట ప్రియులను శిబిరాల వద్దకు చేర్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి సమీప ప్రాంతాల్లోని తోటల్లో మూడుముక్కలాట, సూట్ వంటి పేకాటల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. నిన్నటి వరకు డివిజన్ కేంద్రమైన టెక్కలిలో కొనసాగిన పేకాట వ్యవహారంపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలతో జూదరులు జిల్లా కేంద్రంలోని బడా పేకాట శిబిరాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి పెద్ద ఎత్తున ఈ పేకాట వ్యాపారాన్ని కొనసాగిస్తూ రోజుకు కోట్ల రూపాయలు చేతులు మారుస్తున్నట్లు వినికిడి. ఈ వ్యాపారంలో భాగంగా మంత్రి కార్యాలయంలో కీలకంగా ఉన్న ఓ వ్యక్తికి నెలవారీ లక్షల రూపాయలు ముట్టజెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాపారానికి అడ్డం అనుకునే ప్రతీ వ్యక్తి అది పోలీస్ అయినా మీడియా అయినా.. కొంత మొత్తాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఓ బాధితుడికి సంబంధించి మహిళా జిల్లా పోలీసులకు సమాచారం ఇస్తే మంత్రి కార్యాలయంలో కీలక వ్యక్తి ఆదిలోనే అడ్డుకున్నట్లు సమాచారం. బడా పేకాట శిబిరంలో పెద్ద పెద్ద తలకాయలు ఉండడంతో పోలీస్ యంత్రాంగం ఆ వైపు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలు సామాన్యులతో పాటు పేకాట వ్యాపారాన్ని కొనసాగిస్తున్న నిర్వాహకుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. -
జోరుగా జూదం..!
శ్రీకాకుళం, టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలికి ఆనుకుని కొన్ని పరిసర ప్రాంతాల్లో పేకాట జోరుగా కొనసాగుతోంది.. ప్రతి రోజూ సుమారు 5 నుంచి 8 లక్షల రూపాయల మేరకు పేకాటలో డబ్బులు చేతులు మారుతున్నట్లు సమాచారం. పేకాట ఆడాలనే కాంక్ష ఉన్న వారికి గాలం వేస్తూ ఆయా శిబిరాల వద్దకు చేర్చడం.. వారితో లక్షల రూపాయల మేరకు పేకాట ఆడించడం..ఎవరికైనా అప్పు కావాలంటే అక్కడే అందజేయడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. పేకాట ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా జూదం సమాచారాలు తెలియజేయడం, వాటిపై ఆసక్తి ఉన్న వారికి ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లడం వీరి పని. టెక్కలి నుంచి మెళియాపుట్టి రోడ్డులో మారుమూల తోటల్లోనూ, సీతాపురం నుంచి గిరిజన గ్రామాలకు వెళ్లే మార్గంలోనూ ప్రతి రోజూ లక్షల రూపాయల్లో పేకాట జరుగుతున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది ప్రముఖులు ఉండడంతో పోలీసులు అటు వైపు దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల కొండ ప్రాంతాల్లోని తోటల్లో ఒక్కోసారి మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు జూదం జరుగుతున్నట్లు సమాచారం. ఈ చతుర్ముఖ పారాయణం వల్ల ఇప్పటికే ఎంతో మంది సామాన్య వర్గాలకు చెందిన వారు ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పో లీస్ యంత్రాంగం ప్రత్యేక నిఘా వేసి జూదానికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
మా ఆటకు రండి..
‘ఫలానా తోటల సందులో గురువారం పేకాట శిబిరం నిర్వహిస్తున్నాం. మా ఆటకు రండి. మా ఆటకు వస్తే పోలీసులకు భయపడాల్సిన పనిలేదు. వచ్చి పందెం కట్టండి.. నోట్ల కట్టలతో వెళ్లండి. అన్నింటికీ మేమే పూచి’ అంటూ వినూత్నంగా పేకాట శిబిరాల నిర్వాహకులు ఫోన్ ద్వారా ఆహ్వానాలు పలుకుతున్నారు. ఇదే మంచి తరుణమంటూ పేకాట ప్రియులు నాలుగు ముక్కలాటకు జై కొడుతూ శిబిరాల వైపు పరుగు తీస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము కాస్తా పేకాటలో పోగొట్టుకుని వెళ్తున్నారు. నిర్వాహకులు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనంతపురం, యల్లనూరు: యల్లనూరు మండల పరిధిలోని పాతపల్లి, కూచివారిపల్లి గ్రామాలు పేకాట స్థావరాలుగా మారాయి. ఈ స్థావరాలకు మండలంలోని పేకాట రాయుళ్లే కాకుండా పుట్లూరు, నార్పల, తాడిమర్రి, మండలాల వారితో పాటు ఎక్కువగా వైఎస్సార్ జిల్లాకు చెందిన వారు రోజూ భారీ సంఖ్యలో వస్తున్నట్లు సమాచారం. పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులకు తాడిపత్రి ప్రాంతానికి చెందిన కొంత మంది బడా నేతల అండదండలు ఉన్నాయి. పాతపల్లి కేంద్రంగా.. పాతపల్లికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త గ్రామ పరిసర ప్రాంతాల్లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. పాతపల్లి నుంచి వెన్నపూసపల్లికి వెళ్లే దారి మధ్యలో ఉన్న వంక పరివాహక ప్రాంతంలో, పాలపల్లి, జంగంపల్లి గ్రామాల మధ్య ఉన్న నల్లావంక ప్రాంతంలో, వెన్నపూసపల్లి గ్రామ దగ్గర పొలాల మధ్య ఉన్న కాలువ దగ్గర పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఈ ప్రాంతాలలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పేకాట రాయుళ్లకు నిర్వాహకుడు తెలియజేస్తాడు. దీంతో ప్రతి రోజూ సుమారుగా 60 నుంచి 80 మంది దాకా పేకాట రాయుళ్లు వస్తారు. దాదాపు రూ.50 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. పేకాట రాయుళ్ల వద్ద నుంచి నిర్వాహకుడు రోజుకు రూ. 60 వేల నుంచి రూ.80 వేల వరకు మేజు రూపంలో వసూలు చేస్తున్నారు. కూచివారిపల్లి పరిసర ప్రాంతాల్లో.. కూచివారిపల్లికి చెందిన ఓ టీడీపీ నేత మొన్నటి వరకు ఇంట్లోనే పేకాట శిబిరం నిర్వహించాడు. ప్రస్తుతం స్థావరాన్ని గ్రామ సమీపంలోని కొండలో ఉన్న తుమ్మలోని వంక దగ్గర, అలాగే కొండ సమీపంలో ఉన్న గంగమ్మతల్లి ఆలయ పరిసర ప్రాంతాల్లోను, పుట్లూరు మండలంలోని కుండుగారి కుంట గ్రామ పోలాల పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఈ పేకాట శిబిరానికి కూడా రోజుకు 30 నుంచి 45 మంది దాక పేకాట రాయుళ్లు బయట నుంచి వస్తున్నారు. వచ్చిన వారు పేకాటలో దాదాపు రూ.30 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా పేకాట నిర్వహకుడు వచ్చిన పేకాట రాయుళ్ల అందరి వద్ద నుంచి రోజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు మేజు రూపంలో వసూల్ చేస్తున్నారు. నిర్వాహకులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు ఎదురు చెప్పకుండా పరోక్షంగా సహకారం అందిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాట వినని పోలీసు సిబ్బంది ఎవరైనా ఉంటే తాడిపత్రి ప్రాంతానికి చెందిన కొంత మంది అధికార పార్టీ నాయకుల ద్వారా ఫోన్లు చేయించి వారి దారిలోకి తెచ్చుకుంటున్నట్లు సమాచారం. సరైన సమాచారం లేదు యల్లనూరు మండలంలో కొన్నిచోట్ల పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే సరైన సమాచారం లేదు. ఇప్పటికే పేకాట శిబిరాలను కనుగొనడం కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. పక్క సమాచారం తెలిసిన వెంటనే శిబిరాలపై దాడులు నిర్వహిస్తాం. పేకాట శిబిరాలను నిర్వహించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేదిలేదు.– హారున్‌బాషా, ఎస్ఐ, యల్లనూరు -
జోరుగా జూదం!
సాక్షి, అమరావతిబ్యూరో : అది ఓ సోషల్ సర్వీస్ క్లబ్.. విశ్రాంత ఉద్యోగుల శారీరక, మానసిక ఉల్లాసం కోసం ఆ క్లబ్లో క్రీడలు నిర్వహించాలి. కానీ నిర్వాహకులు అక్కడ ఏనాడు అలాంటి క్రీడలు నిర్వహించిన దాఖలాలు లేకపోగా.. ఆ క్లబ్‌ను పేకాటకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. నిర్వాహకులకు రాష్ట్ర అమాత్యుడు అండదండలు ఉండటంతో మూడు పువ్వులు ఆరుకాయలుగా సర్వీస్ క్లబ్ విరాజిల్లుతోంది. పోలీసుల బెడద లేకపోవడంతో సరిహద్దు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి వందలాది మంది జూదగాళ్లు యథేచ్ఛగా పేకాట ఆడేందుకు వస్తున్నారు. జరుగుతున్న ఈ తతంగమంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినా మంత్రి అండ ఉన్న కారణంగా చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజధాని నుంచి రాక.. తెలంగాణలో పేకాటపై నిషేధం ఉండడంతో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వందల సంఖ్యలో వాహనాల్లో ఇక్కడ పేకాట ఆడేందుకు వస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుడొకరు జిల్లాలో ఒక మంత్రి అండదండలతో ఈ క్లబ్‌ను నిర్వహిస్తుండడంతో పక్క రాష్ట్రంతో పాటు విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన జూదరులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. వీరంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, అపార్ట్మెంట్లలో మాకం వేసి రోజూ ఇక్కడకు వచ్చి ఆటలో పాల్గొంటూ రూ.కోట్లు చేతులు మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్కింగ్ చేసిన వాహనాలను బట్టి ఇక్కడికి వస్తున్న వారిలో అత్యధికులు ఇతర జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు స్పష్టమవుతోంది. చోద్యం చూస్తున్న పోలీసులు.. లంకల్లో, తోటల్లో చాటుమాటుగా ఆడుతున్న చిన్నాచితక పేకాటరాయుళ్లపై దాడులు చేసే పోలీసులు ఈ క్లబ్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఈ క్లబ్లో మొత్తం 12 టేబుళ్లలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఒక్కో టేబుల్లో పాయింట్‌కు రూ.1,000 నుంచి రూ.3000 చొప్పున జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇలా పేకాట నిర్వహిస్తూ రోజుకు రూ.5 లక్షల వరకు నిర్వాహకులు తమ జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అడ్డదారిలో సంపాదిస్తున్న సొమ్ములో అధికార పార్టీ ముఖ్యులకు షేర్ అందుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులకు, పోలీసులకు, నెలనెలా మామూళ్లు ఇస్తుండడం వల్లే ఇక్కడ పేకాట దందా జోరుగా సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. -
ధనాపేక్ష
పశ్చిమగోదావరి జిల్లా పేకాటక్లబ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. రిక్రియేషన్ ముసుగులో జూదక్రీడయథేచ్ఛగా జరిగిపోతోంది. ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రజాప్రతినిధులఅండతో ఈ జూదం సాగుతోంది.దీనికి పోలీసుల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలూ రావడం లేదు. సాక్షి టాస్క్‌ఫోర్స్: ఉంగుటూరు నియోజకవర్గంలో∙భీమడోలు, నారాయణపురంలో రెండు క్లబ్‌లు నడుస్తున్నాయి. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడులో ఒక పేకాట క్లబ్ నడుస్తోంది. ప్రతినెలా క్లబ్ లాభాల్లో 30 శాతం వాటా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ముట్టచెబుతుండగా, పెద్దమొత్తంలో పోలీసులకు కమీషన్లు వెళ్తుండటంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే! ప్రజాప్రతినిధులు అక్రమ ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లాలో పేకాటను ప్రజాప్రతినిధులే తమ అనుచరులతో నిర్వహింపజేస్తున్నారు. గతంలో కైకలూరులో తన కార్యాలయంలోనే పేకాట క్లబ్‌ను ఏలూరు ఎంపీ మాగంటి బాబు నిర్వహించిన సంగతి తెలిసిందే. గోపాలపురం నియోజకవర్గంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన ఒక పోలీసు అధికారిని వీఆర్‌లో పెట్టడం, తర్వాత వేరే కారణాలు చూపించి సస్పెండ్ చేయడం జరిగి పోయింది. దీంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలతో సాగుతున్న పేకాటవైపు పోలీసులు తొంగిచూడటం లేదు. చిన్నచిన్న పేకాట స్థావరాలపై దాడులకు పరిమితమవుతున్నారు. తాజాగా ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో పేకాట క్లబ్‌లలో కోతముక్క ఆట యథేచ్ఛగా జరిగిపోతోంది. ఉంగుటూరు నియోజకవర్గంలో భీమడోలు, నారాయణపురంలో పేకాట సాగుతోంది. గతంలో నారాయణపురంలోని పేకాట క్లబ్‌ను సాక్షిలో వచ్చిన కథనాల వల్ల కొంతకాలం నిలిపివేశారు. ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధి భరోసా ఇవ్వడంతో మళ్లీ మొదలుపెట్టారు. అర్ధరాత్రి వరకూ..! భీమడోలు టౌన్‌హాలులో ప్రతి రోజూ ఉదయం నుంచి అర్ధరాతి వరకూ పేకాట సాగుతోంది. పేకాట రాయుళ్ల నుంచి ఎంట్రీ ఫీజుగా రూ.200 వసూలు చేస్తున్నారు. వీరికి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో 12 బోర్డులలో ఆటజరుగుతోంది. ఇక్కడ పెద్ద మొత్తంలో ఆడేవారికే అవకాశం ఇస్తున్నారు. ప్రతి ఆటలోనూ తీత పేరుతో కమీషన్ తీసుకుంటారు. ఈ విధంగా వచ్చే కమీషనే ఒక్కో క్లబ్లో రోజుకు మూడు లక్షల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. వచ్చిన డబ్బుల్లో ఖర్చులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని వాటాలుగా పంచుకుంటున్నారు. దీనిలో స్థానిక ప్రజాప్రతినిధికి 50 శాతం వరకూ చెల్లిస్తున్నారని సమాచారం. 20 శాతం మిగిలిన మొత్తాన్ని క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు కోశాధికారి తీసుకుంటుండగా, మిగిలిన మొత్తాన్ని పోలీసులకు వాటా ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఒక అధికారికి మూడు నెలలకు రూ.పది లక్షలు ఇస్తుండగా స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి 25 వేల రూపాయల వరకూ కిందిస్థాయి వరకూ వాటాలు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాము మామూళ్లు ఇస్తున్నందున తమపై దాడులు జరగవని నిర్భయంగా పేకాట అడుకోవచ్చంటూ నిర్వాహకులు పేకాట రాయుళ్లకు అభయం ఇస్తున్నారు. దీంతో ప్రతిరోజూ 150 మంది నుంచి రెండు వందల మంది వరకూ విజయవాడ, ఖమ్మం, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లు తరలి వస్తున్నారు. దీంతో ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కార్లు అక్కడ దర్శనమిస్తున్నాయి. ఇటీవల పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న టౌన్‌హాళ్లు, క్లబ్‌లపై దాడులు జరిపిన సమయంలో కూడా వీటిపై దాడులు చేయకపోవడం, వీటివైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
పల్నాడులో ‘పే’కాట క్లబ్!
సాక్షి, గుంటూరు: జిల్లాలో పేకాట క్లబ్బులు ఒక్కొక్కటిగా తెరుచుకోనున్నాయి. ఏడాది క్రితం మూతపడిన దాచేపల్లి పేకాట క్లబ్‌ను తెరిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. పల్నాడుప్రాంతానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లోనే మొదటి నుంచి ఈ పేకాట క్లబ్ నడిచిన విషయం విదితమే. అప్పట్లో వైఎస్సార్ సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి తదితరుల ఆందోళనతో పేకాట క్లబ్ మూతపడింది. కోర్టు అనుమతులు ఉన్నాయంటూ నిర్వాహకులు క్లబ్‌ను తెరవడంతో ఎలా అడ్డుకోవాలో తెలియక పోలీసులు మల్లగుల్లాలుపడ్డారు. క్లబ్‌కు ఎదురుగా అద్దంకి – నార్కెట్‌పల్లి ప్రధాన రహదారిపై రోడ్డుకు రెండు వైపులా పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీపేరుతో అడ్డుకునేందుకు యత్నించినా పేకాట జోరుగా సాగింది. అదే సమయంలో దాచేపల్లి చెక్‌పోస్ట్ వద్ద గంజాయి లోడుతో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకుని డ్రైవర్‌ను విచారించారు. పేకాట క్లబ్‌కు ఆ గంజాయిని తీసుకెళ్తున్నానని, గతంలో అనేక సార్లు సరఫరా చేశానని డ్రైవర్ అంగీకరించడంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న పోలీసు ఉన్నతాధికారులుదీన్ని అనుకూలంగా మలుచుకుని పేకాట క్లబ్‌ను మూసివేయించారు. నిర్వాహకులు సైతం చేసేది లేక తట్టాబుట్టా సర్దుకున్నారు. ఏడాది క్రితం మూతబడ్డ పేకాట క్లబ్‌ను మళ్లీ తెరిచేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటుండటంపై పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యనేత కనుసన్నల్లో పేకాట క్లబ్ పల్నాడుకు చెందిన అధికార పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో పేకాట క్లబ్ ఏర్పాటు అవుతోందనేది బహిరంగ రహస్యమే. రెండేళ్ల క్రితం పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయకపోవడంతో పేకాట క్లబ్ ముఖ్యనేత ఆదేశాలతో యథేచ్ఛగా నడిచింది. వైఎస్సార్ సీపీ నేతలు ఎన్నో ఆందోళనలు చేపట్టారు. అధికారపార్టీ ఎమ్మెల్యే అవినీతిని బయటపెడతానంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. క్లబ్ నిర్వహణపై వైఎస్సార్సీపీ జిల్లా నేతలంతా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అప్పట్లో ఈ పేకాట క్లబ్ మూతపడింది. ఆ తరువాత కోర్టు అనుమతి అంటూ అధికార పార్టీ ముఖ్యనేత పేకాట క్లబ్ పంచాయితీని చినబాబు వద్ద పెట్టి ఏడాదిన్నర క్రితం మళ్లీ తెరిచారు. రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు సీరియస్‌గా తీసుకుని మూసివేయించారు. అక్రమ మైనింగ్ వ్యవహారం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్వారీలు మూతపడ్డాయి. దీంతో అక్రమ ఆదాయానికి అలవాటుపడ్డ అధికారపార్టీ ముఖ్యనేత చినబాబు ఆశీస్సులతో మళ్లీ పేకాట క్లబ్‌ను తెరిపించేందుకు సమాయత్తమయ్యారు. క్లబ్‌కు మరమ్మతులు చేస్తున్నారు. రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు త్వరలో బదిలీ అవుతారని, ఆ తరువాత క్లబ్‌ను నడుపుతామని పేకాటరాయుళ్లకు నిర్వాహకులు చెబుతున్నట్లు తెలిసింది. పల్నాడులో రెండేళ్లుగా పంటలు దెబ్బతిని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కూలిపనులు లేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో దాచేపల్లి పేకాట క్లబ్ తెరుచు కుంటే పల్నాడు యువత పేకాడి అప్పుల పాలై కుటుం బాలను రోడ్డున పడేసే ప్రమాదం ఉంది. గతంలో సైతం అనేక కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. జిల్లాలో మరికొన్ని... పల్నాడు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత అండతో దాచేపల్లిలో పేకాట క్లబ్ తెరుచుకోవడంతో జిల్లాలోని చిలకలూరిపేట, మంగళగిరి, గుంటూరులో పేకాట క్లబ్‌ల ఏర్పాటుకు ఓ మంత్రి కనుసన్నల్లో వ్యూహరచన జరుగుతోందని సమాచారం. గతంలో సైతం సదరు మంత్రి పోలీస్ ఉన్నతాధికారులపై తెచ్చిన ఒత్తిడితో వారు సీఎం వద్ద పంచాయితీ పెట్టడం, అది టీడీపీలో చిచ్చు రగిల్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే స్థాయి నేత పేకాట క్లబ్ ఏర్పాటు చేస్తే తామేం తక్కువ తిన్నామా అన్నట్లు మిగతా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పోటీపడుతున్నట్లు సమాచారం. -
లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు
నగరంలో రుద్రంపేటలో లోటస్‌గ్రాండ్ లాడ్జిలో ఈ నెల 17న పేకాట ఆడుతున్న 16 మందిని నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.78,300 స్వాధీనం చేసుకున్నారు. గతంలో నగరంలో త్రీస్టార్ హోటల్ మాసినేని గ్రాండ్ హోటల్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై వన్‌టౌన్ పోలీసులు దాడులు చేసి దాదాపు 20 మందిని అరెస్ట్ చేసి, రూ.లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో శ్రీకంఠం సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే దారిలో పలు లాడ్జీలు ఎప్పటినుంచే వ్యభిచారానికి అడ్డాగా మారాయి. ఆ దారి వెంబడి కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్లాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. కొంతమంది మహిళలు రోడ్లపై నిల్చుని యువకులను కవ్విస్తూ కనిపిస్తుంటారు. అర్ధరాత్రి అయితే మరీ ఎక్కువ. వీరంతా లాడ్జీలనే కేరాఫ్‌గా మార్చుకున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అనంతపురం సెంట్రల్: అనంతపురంలో పలు లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఆదాయమే పరమావధిగా పనిచేస్తున్న కొంతమంది లాడ్జి యజమానులు శాంతిభద్రతలతో పనిలేకుండా సంఘ విద్రోహకశక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. దీంతో లాడ్జీలు పేకాట, మట్కా, వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నగరంలో ఒకప్పుడు 50లోపు లాడ్జీలు ఉండగా.. ప్రస్తుతం 70కు పైగా పెరిగాయి. ఎక్కువ శాతం లాడ్జీల యజమానులు నిబంధనలను పాటించడం లేదు. లాడ్జీలకు ఎవరు వచ్చి వెళుతున్నారనే విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నగరంలో అద్దెకు ఇళ్లు దొరకాలంటే గగనం. సవాలక్ష వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతనే ప్రజలు ఇళ్లు అద్దెకు ఇస్తున్నారు. కానీ లాడ్జీల్లో ఇవేమీ అక్కర్లేదు. వారు అడిగినంత డబ్బులిస్తే ఏం చేసుకున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటకెక్కిన లాడ్జి మానిటరింగ్ సిస్టం యాప్ లాడ్జీల్లో వరుస నేరాలు జరగుతుండడంతో టెక్నాలజీ సహకారంతో పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా ‘లాడ్జి మానిటరింగ్ సిస్టం’ యాప్ రూపొందించారు. లాడ్జిలోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళుతున్నారనే విషయాలు ఆధార్‌కార్డు ఆధారంగా తప్పనిసరిగా ఈ యాప్‌లో నమోదు చేయాలి. దీని వలన నేరస్తులు స్థావరంగా మార్చుకుని ఉంటే సులభంగా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక వేళ నేరం జరిగిపోయిన తర్వాత కూడా దర్యాప్తు చేయడానికి వీలుంటుంది. అయితే దీని వలన ఆదాయం కోల్పోతామనే దురుద్దేశంతో లాడ్జి యజమానులు యాప్‌ను అటకెక్కించారు. నామమాత్రంగా వివరాల నమోదు లాడ్జీల్లో నామమాత్రంగా మాత్రమే వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఒక్కోలాడ్జిలో 20 నుంచి 30 మంది ఒక రూం అద్దెకు తీసుకుంటూ పేకాట ఆడుతున్నా పట్టించుకోకపోవడం. కొన్ని లాడ్జీలో ఆటకు ఇంత ఇవ్వాలనే బేరం కుదుర్చుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు కొన్ని లాడ్జీల్లో గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందుతున్నా వారి వివరాలు తేలడం లేదు. గత నెలలో శ్రీకంఠం సర్కిల్లోని ఓ లాడ్జిలో వ్యక్తి మృతి చెందితే ఇప్పటికీ సదరు వ్యక్తి ఎవరన్నది దర్యాప్తులో తేలలేదు. లాడ్జి మానిటరింగ్ యాప్ పక్కాగా అమలైతే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిఘా మరింత కట్టుదిట్టం లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీల్లేదు. నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తాం. ఇటీవల లాడ్జీల యజమానులతో సమావేశం నిర్వహించి గట్టిగా ఆదేశాలు జారీ చేశాం. లాడ్జి మానిటరింగ్ యాప్‌ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకున్నాం. నేరాలను ప్రోత్సహిస్తే లాడ్జి యజమానులపై కేసులు నమోదు చేస్తాం. – వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం -
పాల వ్యాపారి ఆడుతూ.. ఆడించేశాడు!
సాక్షి, సిటీబ్యూరో: పేకాటకు బానిసగా మారిన ఓ పాల వ్యాపారి ఆర్థికంగా నష్టపోయాడు. ఈ అప్పులు తీర్చుకునేందుకు తానే ఓ పేకాట శిబిరం ఏర్పాటు చేశాడు. పరిచయస్తులు, స్నేహితులను ఆహ్వానించి మూడుముక్కలాట ఆడిస్తూ డబ్బు వసూలు చేయడం మొదలెట్టాడు. ఈ వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి చేశారు. నిర్వాహకుడి సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. వివరాల్లోకి వెళితే..సీతాఫల్‌మండిలోని బీడ్లబస్తీకి చెందిన సతీష్‌కుమార్ వృత్తిరీత్యా పాల వ్యాపారి. పేకాటకు బానిసగా మారిన ఇతను ఆర్థికంగా నష్టపోయి అప్పులపాలయ్యాడు. వీటి నుంచి బయటపడటంతో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం తానే ఓ పేకాట శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా చిలకలగూడ ఎస్బీహెచ్ కాలనీలోని తన బంధువు ఇంట్లో ఓ పోర్షన్ అద్దెకు తీసుకున్నాడు. తన ‘సహచర పేకాటరాయుళ్ల’తో పాటు ఆసక్తి ఉన్న వారినీ ఇక్కడకు ఆహ్వానిస్తున్నాడు. ఒక్కొక్కరి నుంచి రోజుకు రూ.800 చొప్పున వసూలు చేస్తూ మూడు ముక్కలాట ఆడిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం బుధవారం దాడి చేసింది. సతీష్‌తో పాటు ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసి రూ.25 వేల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. హుక్కా సెంటర్లపై దాడి... వెస్ట్‌జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న రెండు హుక్కా పార్లర్లపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసు లు బుధవారం దాడులు చేశారు. మొత్తం ముగు ్గరు నిందితులను అరెస్టు చేసి హుక్కా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. బంజారాహిల్స్ లో కేఫ్ 4 రస్తా కాఫీ షాప్ పేరుతో హుక్కా సెంటర్‌పై దాడి చేసి యజమాని సీహెచ్ సత్యతేజ, మేనేజర్ మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్‌లను, జూబ్లీహిల్స్‌లోని ఏరియా 1070 కాఫీ షాప్ పేరుతో ఉన్న హుక్కా కేంద్రంపై దాడి చేసి మేనేజర్ షేక్ అల్తాఫ్‌లను అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని స్థానిక పోలీసుస్టేషన్లకు అప్పగించారు. -
పేకాట పంచాయితీ
గుంటూరు నగరంలోని నార్త్ క్లబ్‌పై పోలీసులు దాడిచేసి 247 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.20.28 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడంతో అధికార తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు భగ్గు మన్నాయి. ఒక వర్గం ఆధ్వర్యంలోనడుస్తున్న నార్త్ క్లబ్పైనే పోలీసులు దాడి చేయడం, మరో వర్గం ఆధ్వర్యంలో ఉన్న రెండు క్లబ్బులపై పోలీసులు దృష్టిసారించకపోవడంపై ఆ పార్టీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ మంత్రి ఒత్తిడితోనే నార్త్ క్లబ్‌పై పోలీసులు దాడి చేశారన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, గుంటూరు: జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య కొన్నేళ్లుగా పేకాట పంచాయితీ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని దాచేపల్లిలో పేకాట క్లబ్ నడుస్తుండటంతో తాము క్లబ్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ మంత్రి నేరుగా గతంలో పనిచేసిన పోలీసు బాస్‌ను అడిగారు. దీంతో పోలీస్‌బాస్ ఆగ్రహించి సీఎం వద్ద పంచాయితీ పెట్టడంతో కొంతకాలం దాచేపల్లి క్లబ్ మూతపడింది. గుంటూరు నగరంలో సైతం మూడు క్లబ్‌ల్లో యథేచ్ఛగా పేకాడిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలతోనే ఈ క్లబ్బులన్నీ నడుస్తుండటంతో పోలీసులు వాటి జోలికి వెళ్లకుండా వదిలేశారు. అయితే క్లబ్‌ల నిర్వహణలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నార్త్ క్లబ్‌పై పలు మార్లు పోలీసులు దాడులు నిర్వహించి, పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మంగళవారం మరోమారు పోలీసులు పక్కా ప్రణాళికతో నార్త్ క్లబ్‌పై దాడులు నిర్వహిం చారు. 247 మందిని పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి నుంచి రూ.20.28 లక్షల నగదు, 17 వాహనాలను స్వాధీనం చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. రాజధాని ప్రాంతంలో క్లబ్‌పై దాడులు జరగడం, పెద్ద ఎత్తున పేకాటరాయుళ్లను అరెస్టు చేయడంతోపాటు, భారీగా డబ్బు పట్టుబడడం చూస్తుంటే పోలీసులు ఏస్థాయిలో వ్యూహం పన్నారో అర్థంచేసుకోవచ్చు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ నగరంలో మరో వర్గం టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు పేకాట క్లబ్‌ల జోలికి పోలీసులు ఎందుకు వెళ్లడం లేదంటూ నార్త్ క్లబ్ నిర్వాహకులకు అండదండలు అందిస్తున్న అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆదాయం కోసం పేకాట గుంటూరు నగరంలో రాజధాని స్థాయి అభివృద్ధి జరగలేదు కానీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట క్లబ్‌లు మాత్రం జోరుగా నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యం. నగరంలో నడుస్తున్న మూడు క్లబ్‌ల్లో ఎల్వీఆర్, గుంటూరు క్లబ్లుఅధికార పార్టీ ముఖ్య నేతల నాయకత్వంలో నడుస్తున్నాయి. నార్త్ క్లబ్ సైతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నప్పటికీ వేరే సామాజిక వర్గాలవారు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీలోని ఓ వర్గం తరచూ ఆ క్లబ్‌పై దాడులు చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నార్త్ క్లబ్‌పై నాలుగు సార్లు పోలీసులు దాడులు చేశారు. మిగతా రెండు క్లబ్‌లపై మాత్రం కన్నెత్తి చూడలేదంటూ అధికార పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. క్లబ్‌ల్లో పేకాడించడం వల్ల భారీ ఎత్తున ఆదాయం వస్తుండటంతో అధికార పార్టీ నేతలు క్లబ్‌ల నిర్వహణకోసం పోటీలు పడుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు వర్గాలుగా మారి వాటాల కోసం తన్నుకుంటున్నారు. మంత్రి ఒత్తిడితోనే.. నగరంలోని మూడు క్లబ్బుల్లో రిక్రియేషన్ పేరుతో తాత్కాలిక సభ్యత్వాలు ఇస్తూ రోజుకు రూ.లక్షల్లో ఆదాయాన్ని రాబడుతున్నారు. నార్త్ క్లబ్‌పై మంగళవారం జరిగిన దాడులు సైతం ఓ మంత్రి ఒత్తిడి వల్లే జరిగాయని సొంత పార్టీనేతలే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ క్లబ్‌పై పోలీసులు దాడులు చేయగా, పేకాడుతూ ఒక్కరూ కూడా దొరకలేదు. ఈ సారి మాత్రం పక్కా వ్యూహంతో దాడులు చేశారని చెప్పుకుంటున్నారు. రాజధాని నగరంలో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులే పేకాట క్లబ్‌లు నిర్వహిస్తూ వాటాల కోసం తన్నుకోవడం చూసి ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఎవరినీ ఉపేక్షించం నగరంలో రిక్రియేషన్ ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా పేకాట నిర్వహిస్తే సహించేది లేదు. నార్త్ క్లబ్ నిర్వాహకులు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ చెబుతున్నారే తప్ప, వాటిని పాటించడం లేదు. వారానికి ఒకసారి సీసీ పుటేజ్‌లు సంబంధిత పోలీసు స్టేషన్లో అందించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. మెంబర్షిప్ రికార్డు సక్రమంగా నిర్వహించడం లేదు. ఎల్వీఆర్, గుంటూరు క్లబ్‌లు నిబంధనలకు అనుగుణంగా మాకు రికార్డులు అందిస్తున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరినీ వదిలేది లేదు. – విజయరావు, అర్బన్ ఎస్పీ -
జోరుగా జూదం
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి పట్టణంలో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. లక్షల్లో కరెన్సీ చేతులు మారుతోంది. స్థానికులే కాకుండా దూరప్రాంతాల నుంచి వస్తున్న పేకాటరాయుళ్లతో పట్టణంలోని హోటళ్లు జూదానికి కేంద్రాలుగా మారుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంపై పోలీసుల నిఘా పెద్దగా ఉండదన్న ధైర్యంతో నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. సెల్ఫోన్లతో సమాచారం అందించి ఎంపిక చేసుకున్న హోటళ్లు, లాడ్జిలు, రెస్ట్ హౌస్‌లలో యథేచ్చగా జూదం నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : జూదాన్ని వ్యసనంగా మార్చుకున్న కొంత మంది బడా బాబులకు తిరుపతి నగరం సురక్షిత ప్రాంతంగా కనిపించింది. ఎందుకంటే..ఈ పట్టణానికి నిత్యం వేలాది మంది యాత్రికులు వచ్చి పోతుంటారు. హోటళ్లు, లాడ్జిలన్నీ యాత్రికులు, పర్యాటకులతో నిండి ఉంటాయి. ఇక్కడి హోటళ్లలో జూదం ఆడితే పోలీసులు పెద్దగా పట్టించుకునే వీలుండదన్నది జూదరుల భావన. దీంతో పట్టణంలోని ఒక్కో లాడ్జిని ఒక్కో రోజు ఎంపిక చేసుకుంటూ పేకాట సాగిస్తున్నారు. సరదాగా పేకాట ప్రారంభించి వ్యసనంగా చేసుకున్న వారు కొందరైతే, అదే వృత్తిగా చేసుకున్న వారు మరికొందరు ఉన్నారు. ఆరు నెలలుగా పరిశీలిస్తే...ఐదారుసార్లు పోలీసులు దాడులు చేసి రూ.20 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ జూదం ఆగలేదు. సోమవారం రాత్రి తిరుచానూరు రోడ్డులోని ఓ పేరున్న స్టార్ హోటల్‌పై దాడిచేసిన పోలీసులు 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తూ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ప్రాంతాన్ని గుర్తిం చడం, అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేయడం, ఆటతో సంబంధం ఉన్న వారికి ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడమనే మూడు ప్రక్రియల్లో జూదం సాగుతోంది. తిరుపతిలోని కీలక హోటళ్లను వీరు ఎంపిక చేసుకుంటున్నారు. ఆరు నెలల కిందట బస్టాండ్ దగ్గర ఓ స్టార్ హోటల్లో పోలీసులు దాడిచేసి పది మందికిపైగా జూదరులను పట్టుకున్నారు. ఆ తరువాత కొర్లగుంట, లక్ష్మీపురం, బస్టాండ్ సెంటర్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో దాడులు జరిగాయి. మరి కొంతమంది జూదరులను, నిర్వాహకులనూ పోలీ సులు అరెస్టు చేశారు. రియల్ వ్యాపారులు, బిల్డర్లు, పొలిటికల్ లీడర్లు వీరిలో ఉన్నారు. ఒకప్పుడు చెన్నై, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో నిర్వహించే క్లబ్బుల్లో ఆడే ఆటగాళ్లు కొందరు అక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో మకాం తిరుపతికి మార్చుకున్నారు. పోలీసులతో మంచి సంబంధాలు కలిగిన కొంత మంది కీలక వ్యక్తులు పేకాట స్థావరాలను మేనేజ్ చే స్తున్నారు. ఆటకింతని డబ్బు తీసి సొంతంగా నిఘా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. పోలీసులకూ తెలుసు.. ఏ రోజు ఎక్కడ జూదం నడుస్తుందో పోలీసులకూ తెలుస్తుందనీ, అయితే విషయం ఎస్పీ దాకా వెళ్లే అవకాశం ఉందని పసిగట్టినపుడే దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. చిన్నాచితకా స్థావరాలపై దాడులు జరపకుండా నెలవారీ మామూళ్లు అందుకుంటున్న పోలీసులూ ఉన్నారు. దీనివల్ల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికే విచ్చలవిడి మద్యం దుకాణాలతో కంపుకొట్టే నగరం జూదానికి కేంద్రంగా మారితే అసాంఘిక శక్తులు హెచ్చుమీరే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో నిఘా ఉంది నగరంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంది. ప్రధానంగా పేకాట స్థావరాలను ఎప్పటికప్పుడు గుర్తించేలా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీనికితోడు సమర్థవంతమైన సమాచార వ్యవస్థ కూడా ఉంది. ఎవర్నీ వదలిపెట్టం. హోటళ్లకు లీగల్ నోటీసులు పంపుతున్నాం. ఇకపై ఏదైనా జరిగితే యజమానులు బాధ్యత వహిం చాల్సి ఉంటుందని చెబుతాం. – మునిరామయ్య, ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ, తిరుపతి -
పేకాట పాట @రూ. 20 లక్షలు
ఊళ్లల్లో జరిగే జాతరలు, పండుగలు, ఉత్సవాల్లో పేకాట శిబిరాలు వెలవడం సహజమే. పోలీసుల కళ్లుగప్పి.. లేదా వారికి మామూళ్లు ముట్టజెప్పి అప్పటికప్పుడు పేకాటలు ఆడుకునే తంతు మామూలే. కానీ మహాశివరాత్రిని పురస్కరించుకుని కశింకోట మండలం చీడ గ్రామంలో వెలసిన పేకాట శిబిరానికో ప్రత్యేకత ఉంది. ఏకంగా వరుసగా మూడురోజులపాటు నిరాటంకంగా నిర్వహించే పేకాట శిబిరానికి ఎమ్మెల్యే నుంచే గ్రీన్‌సిగ్నల్ పొందారు. అది కూడా ఊరికే మాట సాయంగా కాదు.. ఏకంగా రూ.17 లక్షలు సమర్పించుకుని. ఇందుకోసం పోటీ పడ్డ నిర్వాహకుల మధ్య వేలంపాట కూడా నిర్వహించారు. పాటలో అత్యధికంగా ఎమ్మెల్యే గారికి రూ.17 లక్షలు ఇస్తానన్న ఓ టీడీపీ కార్యకర్తకు పేకాట శిబిరాల నిర్వహణ బాధ్యత దక్కింది. ఒకింత నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ చీడలో గత రెండురోజులుగా యథేచ్ఛగా జరుగుతున్న పేకాట శిబిరాల సాక్షిగా ఇది వాస్తవమే. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : కశింకోట మండలం చీడ గ్రామంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజులపాటు పోతురాజుబాబు ఉత్సవం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. సందట్లో సడేమియా మాదిరిగా అక్కడి కొందరు పెద్దల మధ్య పేకాట శిబిరాల నిర్వహణ ప్రస్తావనకు వచ్చింది. ఎంతిచ్చినా పోలీసులు సంతృప్తిపడరు.. ఎమ్మెల్యే గారికి వాటా ఇచ్చి ఆయనతో చెప్పిస్తే గానీ పనికాదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎవరికి నిర్వహణ దక్కాలనే దానిపై ‘పాట’ పెట్టుకున్నారు. పేకాట వేలంపాటలో పొరుగూరికి చెందిన ఓ టీడీపీ చోటా కార్యకర్త ఎమ్మెల్యేకి ఏకంగా రూ.17 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమన్నాడు. అంతే.. అతగాడికి మూడురోజులపాటు ఆ ఉత్సవాల్లో పేకాట శిబిరాల నిర్వహణ బాధ్యతను అప్పజెప్పేశారు. పోలీసుల అహం కూడా దెబ్బతినకుండా వారికో రూ.3 లక్షలు ముట్టజెప్పాలని నిర్ణయించుకున్నారు. మొత్తంగా రూ.20 లక్షలకు పాట ఫైనల్ చేసుకున్నారు. అంటే కేవలం పేకాటల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ కోసమే 20 లక్షలు ఖర్చు చేశారంటే... నిర్వహణ ద్వారా అంతకు మించి వారికి మిగలాలి. రూ.20 లక్షలకు మించి మిగలాలంటే... ఎంత మొత్తంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అందుకే చీడ గ్రామ పరిసర తోటలు, పొలాల్లో శివరాత్రి నాడైన మంగళవారం మొదలైన శిబిరాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. పేకాటతోపాటు గుండాట, కోతాట... ఇలా అన్నిరకాల జూదాలను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ‘స్పెషల్’ పర్మిషన్ ? మునుపెన్నడూ లేని విధంగా ఇలా యథేచ్ఛగా పేకాట శిబిరాల నిర్వహణ ‘ధైర్యం’ వెనుక జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఓ పోలీసాయన పాత్ర ఉన్నట్టు చెబుతున్నారు.. ఆ ఊరి పెద్దకు బంధుత్వం ఉన్న సదరు పోలీసాయన సలహా మేరకే ‘పాట’ పెట్టుకుని ఎవరికివ్వాల్సింది వారికిచ్చి జూద క్రీడలకు తెరలేపినట్టు తెలుస్తోంది. -
మంత్రి ప్రత్తిపాటి అండతో పేకాట క్లబ్‌లు
చిలకలూరిపేట టౌన్: జిల్లాలోని చిలకలూరిపేటలో పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున కోతముక్క నిర్వహిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ ఆరోపించారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దల కాలక్షేపం కోసం నిర్మించిన సీఆర్ రిక్రియేషన్ క్లబ్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి, గురజాల క్లబ్‌లను మూయించి, పేటలో పేకాట నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు రూ.2 కోట్లకుపైగా కోత ముక్కాటలో చేతులు మారుతున్నాయని, దీంతో క్లబ్‌కి రూ.2 లక్షలకుపైగా ఆదాయం లభిస్తుందని తెలిపారు. నల్లధనానని తెల్లధనంగా మార్చుకునేందుకు మంత్రి స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసి క్లబ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవల పేరుతో దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. గతంలో కరెంట్ బిల్లు చెల్లిండానికే క్లబ్‌కి ఆదాయం ఉండేది కాదని, నేడు ఏటా రూ.10 కోట్ల విరాళాలు ఇచ్చేలా అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నారనివిమర్శించారు. మద్యం దుకాణాలు, జాదం నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో వైద్య శిబిరాలు, ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఇక్కడకు చేరుకుంటున్న జాదరులు మంత్రి అండతో యథేచ్ఛగా ఆడుతున్నారని పేచర్కొన్నారు. క్లబ్ ఆదాయ వనరులు, వాటి వివరాల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవీఎం సుభాని ఉన్నారు. -
‘ఆట’కట్టు!
* దాచేపల్లి పేకాట క్లబ్‌కు తాళం * ఎమ్మెల్యే పీఆర్కే సవాల్‌తో క్లబ్‌పై దృష్టిసారించిన పోలీసు ఉన్నతాధికారులు * ఓ సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న క్లబ్ * మాజీ ఎమ్మెల్యే జంగాపై డీఎస్పీ అనుచిత ప్రవర్తనపై ఐజీ ఆగ్రహం * తీరు మార్చుకోవాలంటూ డీఎస్పీకి క్లాస్ సాక్షి, గుంటూరు: పల్నాడు ప్రాంతంలో నెల రోజులుగా నడుస్తున్న పేకాట క్లబ్‌కు తాళాలు పడ్డాయి. గత నెల 29న నడికుడి మార్కెట్ యార్డులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అవినీతి, అక్రమ మైనింగ్, పేకాట క్లబ్ వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో 144 సెక్షన్ విధించడం, అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు ఎమ్మెల్యే పీఆర్కేను గృహ నిర్బంధం చేయడం, మాజీ ఎమ్మెల్యే, బీసీ నేత జంగా కృష్ణమూర్తిపై గురజాల డీఎస్పీ చేయిచేసుకోవడం వంటి సంఘటనలతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టి పల్నాడులోని అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలపై పడింది. పేకాట క్లబ్‌ను ఎందుకు మూయించలేదు? పేకాట క్లబ్ నడుస్తున్నా స్థానిక పోలీసు అధికారులు ఎందుకు మూయించలేదంటూ పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దానిని మూయించినట్లు తెలుస్తోంది. ఈ నెల ఒకటో తేదీన గురజాల డీఎస్పీ నాగేశ్వరరావును తన కార్యాలయానికి పిలిపించిన గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ పల్నాడు ప్రాంతంలో నడుస్తున్న పేకాట క్లబ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత నెల 29న దాచేపల్లి పోలీస్‌స్టేçÙన్లో పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలపై డీఎస్పీ అమానుషంగా దాడిచేసి, లాఠీతో కొట్టిన విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు ఐజీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పల్నాడు ప్రాంతానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐజీ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. పోలీసు బాధ్యతలను ఏవిధంగా నిర్వర్తించాలి.. ప్రజాప్రతినిధులతో ఎలా నడుచుకోవాలనే విషయంపై డీఎస్పీకి ఐజీ క్లాస్ పీకినట్లు తెలిసింది. మొత్తానికి జిల్లాలో ఓ డివిజనల్ స్థాయి అధికారిని ఐజీ తన కార్యాలయానికి పిలవడంతో పాటు అనధికారికంగా నడుస్తున్న పేకాట క్లబ్‌ను మూయించాలంటూ ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఓ సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లో ‘క్లబ్’ పల్నాడు ప్రాంతంలో పేకాట క్లబ్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మధ్యలో కొంతకాలం మూతపడ్డా గత నెల మొదటి వారంలో మళ్లీ తెరిచి యధేచ్ఛగా పేకాట ఆడిస్తున్నారు. ఓ సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లో పేకాట క్లబ్ నడుస్తుండటంతో పోలీసులు సైతం దీనిజోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే పీఆర్కే సవాల్.. పేకాట క్లబ్ కారణంగా రైతులు, యువకులు డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోరాటం చేయడంతో పాటు పేకాట క్లబ్ వద్దకు వచ్చి బండారం బట్టబయలు చేస్తానంటూ సవాల్ చేయడంతో జిల్లావ్యాప్తంగా చర్చ మొదలైంది. దీంతో పేకాట క్లబ్‌పై దృష్టి సారించిన పోలీసు ఉన్నతాధికారులు క్లబ్‌ను మూయించాలంటూ ఆదేశాలు ఇవ్వడంతోనే గురువారం సాయంత్రం క్లబ్‌కు తాళాలు పడినట్లు చెబుతున్నారు. అయితే రోజుకు రూ.లక్షల్లో ఆదాయం వస్తున్న క్లబ్ మూతపడటంతో మళ్లీ దాన్ని తెరిపించేందుకు సదరు సీనియర్ ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో అనేక మంది పోలీసులు క్లబ్‌ను మూయించినప్పటికీ తిరిగి తెరిపించిన ఆ ఎమ్మెల్యే ఈసారి కూడా పేకాట క్లబ్‌ను తెరిపించి జిల్లాలో తన పరపతిని కాపాడుకోవాలని పరితపిస్తున్నట్లు తెలుస్తోంది.