‘ఆట’కట్టు!
‘ఆట’కట్టు!
Published Sun, Sep 4 2016 5:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
* దాచేపల్లి పేకాట క్లబ్‌కు తాళం
* ఎమ్మెల్యే పీఆర్కే సవాల్‌తో క్లబ్‌పై దృష్టిసారించిన పోలీసు ఉన్నతాధికారులు
* ఓ సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న క్లబ్
* మాజీ ఎమ్మెల్యే జంగాపై డీఎస్పీ అనుచిత ప్రవర్తనపై ఐజీ ఆగ్రహం
* తీరు మార్చుకోవాలంటూ డీఎస్పీకి క్లాస్
సాక్షి, గుంటూరు: పల్నాడు ప్రాంతంలో నెల రోజులుగా నడుస్తున్న పేకాట క్లబ్‌కు తాళాలు పడ్డాయి. గత నెల 29న నడికుడి మార్కెట్ యార్డులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అవినీతి, అక్రమ మైనింగ్, పేకాట క్లబ్ వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో 144 సెక్షన్ విధించడం, అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు ఎమ్మెల్యే పీఆర్కేను గృహ నిర్బంధం చేయడం, మాజీ ఎమ్మెల్యే, బీసీ నేత జంగా కృష్ణమూర్తిపై గురజాల డీఎస్పీ చేయిచేసుకోవడం వంటి సంఘటనలతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టి పల్నాడులోని అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలపై పడింది.
పేకాట క్లబ్‌ను ఎందుకు మూయించలేదు?
పేకాట క్లబ్ నడుస్తున్నా స్థానిక పోలీసు అధికారులు ఎందుకు మూయించలేదంటూ పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దానిని మూయించినట్లు తెలుస్తోంది. ఈ నెల ఒకటో తేదీన గురజాల డీఎస్పీ నాగేశ్వరరావును తన కార్యాలయానికి పిలిపించిన గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ పల్నాడు ప్రాంతంలో నడుస్తున్న పేకాట క్లబ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత నెల 29న దాచేపల్లి పోలీస్‌స్టేçÙన్‌లో పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలపై డీఎస్పీ అమానుషంగా దాడిచేసి, లాఠీతో కొట్టిన విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు ఐజీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పల్నాడు ప్రాంతానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐజీ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. పోలీసు బాధ్యతలను ఏవిధంగా నిర్వర్తించాలి.. ప్రజాప్రతినిధులతో ఎలా నడుచుకోవాలనే విషయంపై డీఎస్పీకి ఐజీ క్లాస్ పీకినట్లు తెలిసింది. మొత్తానికి జిల్లాలో ఓ డివిజనల్ స్థాయి అధికారిని ఐజీ తన కార్యాలయానికి పిలవడంతో పాటు అనధికారికంగా నడుస్తున్న పేకాట క్లబ్‌ను మూయించాలంటూ ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఓ సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లో ‘క్లబ్’
పల్నాడు ప్రాంతంలో పేకాట క్లబ్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మధ్యలో కొంతకాలం మూతపడ్డా గత నెల మొదటి వారంలో మళ్లీ తెరిచి యధేచ్ఛగా పేకాట ఆడిస్తున్నారు. ఓ సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లో పేకాట క్లబ్ నడుస్తుండటంతో పోలీసులు సైతం దీనిజోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఎమ్మెల్యే పీఆర్కే సవాల్..
పేకాట క్లబ్ కారణంగా రైతులు, యువకులు డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోరాటం చేయడంతో పాటు పేకాట క్లబ్ వద్దకు వచ్చి బండారం బట్టబయలు చేస్తానంటూ సవాల్ చేయడంతో జిల్లావ్యాప్తంగా చర్చ మొదలైంది. దీంతో పేకాట క్లబ్‌పై దృష్టి సారించిన పోలీసు ఉన్నతాధికారులు క్లబ్‌ను మూయించాలంటూ ఆదేశాలు ఇవ్వడంతోనే గురువారం సాయంత్రం క్లబ్‌కు తాళాలు పడినట్లు చెబుతున్నారు. అయితే రోజుకు రూ.లక్షల్లో ఆదాయం వస్తున్న క్లబ్ మూతపడటంతో మళ్లీ దాన్ని తెరిపించేందుకు సదరు సీనియర్ ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో అనేక మంది పోలీసులు క్లబ్‌ను మూయించినప్పటికీ తిరిగి తెరిపించిన ఆ ఎమ్మెల్యే ఈసారి కూడా పేకాట క్లబ్‌ను తెరిపించి జిల్లాలో తన పరపతిని కాపాడుకోవాలని పరితపిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement