జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. పోలీసులు కఠినచర్యలు చేపడుతున్నా జూదరుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. గతంలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యా పారి సుమారు రూ.3 కోట్ల ఆస్తులను అమ్మి, పేకాటకు పెట్టి నష్టాల ఊబిలో కూరుకుపోయా డు.
మరో మద్యం వ్యాపారి సుమారు రూ.కోటి మేరకు ఆన్‌లైన్‌లో పేకాట ఆడి, అప్పులపాలయ్యాడు. కుటుంబసభ్యులు లబోదిబోమంటూ తమ ఆస్తులమ్మి తీర్చారు. జూదంతో జిల్లాలో ఎందరివో కాపురాలు కూలిపోయాయి.
మూడేళ్లలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 2021లో పోలీసులు 207 కేసులు నమోదు చేసి, 295 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.32.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 2022లో 109 కేసులు నమోదు చేసి, 536 మందిని అరెస్టు చేశారు. రూ.16.91 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 20 కేసుల్లో 133 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయినా పోలీసుల కళ్లుగప్పి నిత్యం జూదం కొనసాగుతుండటంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. కొంతమంది పేకాట కోసం ఆస్తులు, బంగారం తాకట్టు పెడుతుండటంతో వారి బతుకులు తారుమారు అవుతున్నాయి.
ఇళ్లు, మామిడితోటలే అడ్డాలు..
చాలా మంది పేకాటరాయుళ్లు ఇళ్లు, మామిడితోటలు, ఫామ్‌హౌస్‌లు, అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, రోడ్ల వెంట ఇన్‌ఫార్మర్లను పెట్టుకొని, జూదం ఆడుతున్నారు.
నెలకు సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేర సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో రెండంతస్తుల భవనాలను అద్దెకు తీసుకొని, కింది అంతస్తులో కుటుంబాలను అద్దెకు ఉంచుతూ రెండో అంతస్తులో జూదం నిర్వహిస్తున్నారు.
ఇతర జిల్లాల నుంచి వస్తున్న జూదరులు
జగిత్యాల జిల్లాలోని పేకాట స్థావరాలకు ఇతర జి ల్లాల నుంచి కూడా జూదరులు పెద్ద ఎత్తున వస్తున్నారు. పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నా వారు వెనుకడుగు వేయడం లేదు. పేకాడుతున్న సమయంలో పోలీసులు దాడులు చేస్తే చాలామంది జూదరులు వారి కళ్లుగప్పి, పారిపోతున్నారు.
అడ్డుకట్ట పడేదెలా?
జిల్లా వ్యాప్తంగా పేకాటను అడ్డుకునేందుకు పో లీసులు చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదు. జూదం ఆడేవారికి కోర్టులో కఠిన శిక్షలు లేకపోవడంతో చాలా మంది పట్టుబడినా తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు. బయటకు వచ్చి, మళ్లీ పే కాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెస్తే తప్ప జూదానికి అడ్డుకట్ట పడేలా లేదు.
పేకాటపై ప్రత్యేక నిఘా
జగిత్యాల జిల్లాలో పేకాటను అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. చాలా మందిపై కేసులు నమోదు చేస్తూ అరెస్టు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో కఠినచర్యలు తీసుకుంటున్నాం.
– ఎగ్గడి భాస్కర్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment