కంచికచర్లలోని ఓ సర్వీస్ క్లబ్ వద్ద పార్క్ చేసి ఉన్న పేకాటరాయుళ్ల వాహనాలు
సాక్షి, అమరావతిబ్యూరో : అది ఓ సోషల్ సర్వీస్ క్లబ్.. విశ్రాంత ఉద్యోగుల శారీరక, మానసిక ఉల్లాసం కోసం ఆ క్లబ్‌లో క్రీడలు నిర్వహించాలి. కానీ నిర్వాహకులు అక్కడ ఏనాడు అలాంటి క్రీడలు నిర్వహించిన దాఖలాలు లేకపోగా.. ఆ క్లబ్‌ను పేకాటకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. నిర్వాహకులకు రాష్ట్ర అమాత్యుడు అండదండలు ఉండటంతో మూడు పువ్వులు ఆరుకాయలుగా సర్వీస్ క్లబ్ విరాజిల్లుతోంది. పోలీసుల బెడద లేకపోవడంతో సరిహద్దు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి వందలాది మంది జూదగాళ్లు యథేచ్ఛగా పేకాట ఆడేందుకు వస్తున్నారు. జరుగుతున్న ఈ తతంగమంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినా మంత్రి అండ ఉన్న కారణంగా చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాజధాని నుంచి రాక..
తెలంగాణలో పేకాటపై నిషేధం ఉండడంతో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వందల సంఖ్యలో వాహనాల్లో ఇక్కడ పేకాట ఆడేందుకు వస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుడొకరు జిల్లాలో ఒక మంత్రి అండదండలతో ఈ క్లబ్‌ను నిర్వహిస్తుండడంతో పక్క రాష్ట్రంతో పాటు విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన జూదరులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. వీరంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో మాకం వేసి రోజూ ఇక్కడకు వచ్చి ఆటలో పాల్గొంటూ రూ.కోట్లు చేతులు మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్కింగ్ చేసిన వాహనాలను బట్టి ఇక్కడికి వస్తున్న వారిలో అత్యధికులు ఇతర జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
చోద్యం చూస్తున్న పోలీసులు..
లంకల్లో, తోటల్లో చాటుమాటుగా ఆడుతున్న చిన్నాచితక పేకాటరాయుళ్లపై దాడులు చేసే పోలీసులు ఈ క్లబ్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఈ క్లబ్‌లో మొత్తం 12 టేబుళ్లలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఒక్కో టేబుల్‌లో పాయింట్‌కు రూ.1,000 నుంచి రూ.3000 చొప్పున జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇలా పేకాట నిర్వహిస్తూ రోజుకు రూ.5 లక్షల వరకు నిర్వాహకులు తమ జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అడ్డదారిలో సంపాదిస్తున్న సొమ్ములో అధికార పార్టీ ముఖ్యులకు షేర్ అందుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులకు, పోలీసులకు, నెలనెలా మామూళ్లు ఇస్తుండడం వల్లే ఇక్కడ పేకాట దందా జోరుగా సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment