జోరుగా జూదం | Gambling Camps in Tirupati | Sakshi
Sakshi News home page

జోరుగా జూదం

Published Wed, Mar 7 2018 9:31 AM | Last Updated on Wed, Mar 7 2018 9:31 AM

Gambling Camps in Tirupati - Sakshi

ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి పట్టణంలో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. లక్షల్లో కరెన్సీ చేతులు మారుతోంది. స్థానికులే కాకుండా దూరప్రాంతాల నుంచి వస్తున్న పేకాటరాయుళ్లతో పట్టణంలోని హోటళ్లు జూదానికి కేంద్రాలుగా మారుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంపై పోలీసుల నిఘా పెద్దగా ఉండదన్న ధైర్యంతో నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. సెల్‌ఫోన్లతో సమాచారం అందించి ఎంపిక చేసుకున్న హోటళ్లు, లాడ్జిలు, రెస్ట్‌ హౌస్‌లలో యథేచ్చగా జూదం నిర్వహిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి : జూదాన్ని వ్యసనంగా మార్చుకున్న కొంత మంది బడా బాబులకు తిరుపతి నగరం సురక్షిత ప్రాంతంగా కనిపించింది. ఎందుకంటే..ఈ పట్టణానికి నిత్యం వేలాది మంది యాత్రికులు వచ్చి పోతుంటారు. హోటళ్లు, లాడ్జిలన్నీ యాత్రికులు, పర్యాటకులతో నిండి ఉంటాయి. ఇక్కడి హోటళ్లలో జూదం ఆడితే పోలీసులు పెద్దగా పట్టించుకునే వీలుండదన్నది జూదరుల భావన. దీంతో పట్టణంలోని ఒక్కో లాడ్జిని ఒక్కో రోజు ఎంపిక చేసుకుంటూ పేకాట సాగిస్తున్నారు. సరదాగా పేకాట ప్రారంభించి వ్యసనంగా చేసుకున్న వారు కొందరైతే, అదే వృత్తిగా చేసుకున్న వారు మరికొందరు ఉన్నారు. ఆరు నెలలుగా పరిశీలిస్తే...ఐదారుసార్లు పోలీసులు దాడులు చేసి రూ.20 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ జూదం ఆగలేదు. సోమవారం రాత్రి తిరుచానూరు రోడ్డులోని ఓ పేరున్న స్టార్‌ హోటల్‌పై దాడిచేసిన పోలీసులు 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి వస్తూ..
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ప్రాంతాన్ని గుర్తిం చడం, అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేయడం, ఆటతో సంబంధం ఉన్న వారికి ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడమనే మూడు ప్రక్రియల్లో జూదం సాగుతోంది. తిరుపతిలోని కీలక హోటళ్లను వీరు ఎంపిక చేసుకుంటున్నారు. ఆరు నెలల కిందట బస్టాండ్‌  దగ్గర ఓ స్టార్‌ హోటల్‌లో పోలీసులు దాడిచేసి పది మందికిపైగా జూదరులను పట్టుకున్నారు. ఆ తరువాత కొర్లగుంట, లక్ష్మీపురం, బస్టాండ్‌ సెంటర్, ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో దాడులు జరిగాయి. మరి కొంతమంది జూదరులను, నిర్వాహకులనూ పోలీ సులు అరెస్టు చేశారు. రియల్‌ వ్యాపారులు, బిల్డర్లు, పొలిటికల్‌ లీడర్లు వీరిలో ఉన్నారు. ఒకప్పుడు చెన్నై, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో నిర్వహించే క్లబ్బుల్లో ఆడే ఆటగాళ్లు కొందరు అక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో మకాం తిరుపతికి మార్చుకున్నారు. పోలీసులతో మంచి సంబంధాలు కలిగిన కొంత మంది కీలక వ్యక్తులు పేకాట స్థావరాలను మేనేజ్‌ చే స్తున్నారు. ఆటకింతని డబ్బు తీసి సొంతంగా నిఘా వ్యవస్థను నిర్వహిస్తున్నారు.

పోలీసులకూ తెలుసు..
ఏ రోజు ఎక్కడ జూదం నడుస్తుందో పోలీసులకూ తెలుస్తుందనీ, అయితే విషయం ఎస్పీ దాకా వెళ్లే అవకాశం ఉందని పసిగట్టినపుడే దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. చిన్నాచితకా స్థావరాలపై దాడులు జరపకుండా నెలవారీ మామూళ్లు అందుకుంటున్న పోలీసులూ ఉన్నారు. దీనివల్ల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికే విచ్చలవిడి మద్యం దుకాణాలతో కంపుకొట్టే నగరం జూదానికి కేంద్రంగా మారితే అసాంఘిక శక్తులు హెచ్చుమీరే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తిస్థాయిలో నిఘా ఉంది
నగరంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంది. ప్రధానంగా పేకాట స్థావరాలను ఎప్పటికప్పుడు గుర్తించేలా పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీనికితోడు సమర్థవంతమైన సమాచార వ్యవస్థ కూడా ఉంది. ఎవర్నీ వదలిపెట్టం. హోటళ్లకు లీగల్‌ నోటీసులు పంపుతున్నాం. ఇకపై ఏదైనా జరిగితే యజమానులు బాధ్యత వహిం చాల్సి ఉంటుందని చెబుతాం.  – మునిరామయ్య, ఈస్ట్‌ సబ్‌ డివిజనల్‌ డీఎస్పీ, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement