సాక్షి, హైదరాబాద్: ఎక్కడో నేరం చేసిన వాళ్లు నగరానికి వచ్చి తలదాచుకుంటున్నారు.. ఇక్కడ నేరం చేయడానికి వచ్చినవాళ్లూ కొన్నాళ్లు మకాం వేస్తున్నారు.. ఇలాంటి వారికి సిటీలో ఉన్న కొన్ని లాడ్జీలు, హాస్టళ్లు ఆశ్రయం కల్పిస్తున్నాయి. మరోపక్క ఏ హాస్టల్‌లో ఎవరు ఉంటున్నారు? వాళ్లు ఎక్కడి వాళ్లు, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు? ఇలా ఏ విషయమూ పోలీసులకు తెలియట్లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఎస్సార్‌నగర్ ఠాణా అధికారులు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.సైదులు ఆలోచన, కృషి ఫలితంగా కొన్ని రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుంది.
గూగుల్ ద్వారా అందుబాటులోకి..
ప్రస్తుతం తుది మెరుగులు దిద్ది ఈ యాప్‌ను గూగుల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడానికి ఎస్సార్‌నగర్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. పోలీసు విభాగం అధీనంలో పని చేసే దీన్ని హాస్టళ్లు, లాడ్జీల నిర్వాహకులు తమ స్మార్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో ఉన్న కేటగిరీల ఆధారంగా బాయ్స్, మెన్స్, ఉమెన్స్ హాస్టల్స్, లాడ్జీలను ఎంచుకుంటారు. బస చేస్తున్న వ్యక్తి పేరు, ఆధార్, ఫోన్ నంబర్లతో పాటు ఎక్కడ నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఏం చేస్తుంటాడు? గతంలో ఎక్కడ ఉండేవాడు? ప్రస్తుతం ఏ రూమ్‌లో ఉంటున్నాడు? తదితర వివరాలన్నీ నమోదు చేస్తారు.
వీటితో పాటు అతడి ఫొటో, ఆధార్‌కార్డునూ క్యాప్చర్ చేసి అదే యాప్ ద్వారా సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. ప్రతీ హాస్టల్, లాడ్జీ యజమాని ఈ వివరాలన్నీ యాప్‌తో సేకరించడం కచి్చతం చేస్తున్నారు. ఇది కేవలం ఒత్తిడి చేయడం ద్వారా కాకుండా యజమానులు, నిర్వాహకులకు వారంతట వారుగా వినియోగించేలా ఎస్సార్‌నగర్ పోలీసులు యోచించారు.
ఓటీపీతో ఫోన్ నంబర్ వెరిఫికేషన్..
బస చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ యాప్‌లో ఎంటర్ చేసిన వెంటనే దానికి ఓటీపీ వెళ్తుంది. ఇది కూడా పొందుపరిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా యాప్‌ను డిజైన్ చేస్తున్నారు. ఫలితంగా నకిలీ ఫోన్ నంబర్లకు అడ్డుకట్ట వేయొచ్చు. ఈ యాప్‌నకు సంబంధించిన సర్వర్‌లో వాంటెడ్ వ్యక్తులు, పదేపదే నేరాలు చేసే వారి వివరాలతో కూడిన డేటాబేస్‌ను అనుసంధానించనున్నారు. ఎవరైనా బస చేయడానికి వస్తే... ఆ వివరాలు పొందుపరిచిన వెంటనే యాప్ దానంతట అదే అలర్ట్ ఇచ్చేలా సాఫ్ట్‌వేర్ డిజైన్ చేస్తున్నారు.
విస్తరిస్తేనే పూర్తి స్థాయి ఫలితాలు...
ఈ యాప్ ఎస్సార్‌నగర్ పోలీసుల చొరవతో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతానికి ఆ ఠాణా పరిధిలోని హాస్టళ్లు, లాడ్జీల్లో ఉంటున్న వారి వివరాలు తెలుసుకోవడానికి, బస చేసిన వ్యక్తి పూర్వాపరాలు గుర్తించడానికి, ఆ పరిధిలో వాంటెడ్ వ్యక్తులకు చెక్ చెప్పడానికి ఉపకరించనుంది. దీనివల్ల పూర్తి స్థాయి ఫలితాలు రావాలంటే మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా రాజధానిలోని మూడు కమిషనరేట్లకు ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ అమలును కచ్చితం చేయడంతో పాటు ప్రోత్సహించాల్సిన అవసరముంది.
Comments
Please login to add a commentAdd a comment