gambling camp
-
తగ్గేదేలే... ఈడ కాదంటే.. ఆడ ఆడతాం..!
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు మళ్లీ జోరందుకున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఆడితే ఇబ్బందేంటని భావించిన పేకాట నిర్వాహకులు ఏకంగా అక్కడ భూములు కొనుగోలు చేసి క్లబ్బులుగా మార్చేశారు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసుకుని మరీ దందా సాగిస్తున్నారు. వారంలో మూడు రోజులు పేకాట రాయుళ్లకు అన్ని రకాల వసతులు కల్పించి లక్షల్లో కమిషన్ పేరిట దోచుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో జరుగుతున్న పేకాట వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇసుక కాంట్రాక్టర్లదే హవా.. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయడం లేదా లీజుకు తీసుకుని పెద్ద రేకులతో కంచెలు నిర్మించి, లోపల విశాలమైన హాళ్లు, పడక గదులు నిర్మించి పేకాటకు తెరతీశారు. రాష్ట్రంలోని మంచిర్యాల, చెన్నూర్ ప్రాంతాల్లో ఇసుక దందా నిర్వహిస్తున్న కొందరు ప్రముఖులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతం, మహారాష్ట్రలోని సిరోంచ, అమ్రావతి, కంబాల్‌పేట ప్రాంతాల్లో క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో అక్కడి స్థానిక మాఫియా ఏర్పాటు చేసిన క్లబ్బులను లోకల్ పోలీసులు మూసేయించారు. ఆరు నెలల కింద తెలంగాణకు చెందిన ఓ బడా ఇసుక కాంట్రాక్టర్ ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని క్లబ్బు ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకున్నాడు. అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో చేతులు కలిపి రీక్రియేషన్, స్పోర్ట్స్ క్లబ్బుల పేరిట పేకాట నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ముగ్గురు క్రషర్, బీడీ ఆకు కాంట్రాక్టర్లు కలసి మూడు ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లోని బడా వ్యక్తులంతా ఆగస్టు నుంచి పేకాటకు వెళ్తున్నట్లు సమాచారం. కేరళపై మక్కువతో.. బడా బాబులు, ప్రముఖులకు కేరళ సిండికేట్ బ్యాచ్ ఆహ్వానం అందిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం విమానం ఎక్కడం, శని, ఆదివారాలు అక్కడే ఉండటం లక్షల్లో సమర్పించుకుని వస్తున్నట్లు ఇటీవల పోలీసులుకు పట్టబడ్డ సుమన్ చౌదరి విచారణలో తేలింది. అయితే రాయిచూర్ కేంద్రంగా సాగుతున్న పేకాట కేంద్రాల నిర్వాహకుల సిండికేటే కేరళలోనూ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. పేకాటలో పెట్టే డబ్బులు కాకుండా కేవలం ఎంట్రీ ప్యాకేజీ కోసం రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి వారం 50 నుంచి 70 మంది కేరళ వెళ్తున్నట్లు తెలిసింది. రష్యా వెళ్లాలనుకునే వారికి.. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి మరీ రష్యాకు పంపేందుకు సుమన్ చౌదరితో పాటు కేరళ సిండికేట్ బ్యాచ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఏకంగా అక్కడి మాఫియాతో చేతులు కలిపి వీవీఐపీ బ్యాచ్‌కు వారం పాటు మూడు ముక్కలాట ఆడిస్తోందని చెబుతున్నారు. రెండు నెలల కింద 18 మంది ప్రముఖులు రష్యా వెళ్లి వచ్చినట్లు సుమన్ చౌదరి విచారణలో బయటపడింది. ప్రముఖుల వివరాలు మాత్రం పోలీసులు బయటకు రానివ్వట్లేదు. పాత నిర్వాహకులకు అడ్డా.. ఇక్కడ పేకాట నిర్వహణలో చేయితిరిగిన వ్యక్తి తన అనుచరులతో కలసి కర్ణాటక సరిహద్దు అయిన రాయిచూర్‌లో నాలుగు పేకాట కేంద్రాలను ఏర్పాటు చేశాడు. 2019 ఏప్రిల్‌లో కరోనా వల్ల మూతపడ్డ క్లబ్బును ఇటీవలె మళ్లీ తెరిచినట్లు పోలీసు వర్గాలకు తెలిసింది. గతంలో బోయిన్‌పల్లితో పాటు నల్లకుంట, బంజారాహిల్స్, బేగంపేటలో క్లబ్బులు నిర్వహించిన వాళ్లంతా ఇప్పుడు సిండికేట్‌గా మారి రాయిచూర్ నుంచి భగాల్‌కోట్ వెళ్లే మార్గంలో ఏర్పాటుచేసిన పేకాట కేంద్రాలకు ప్రతి వారం 300 మందికి పైగా వెళ్తున్నట్లు తెలిసింది. పేకాట కేంద్రాల నిర్వాహకులే ఏసీ బస్సులు ఏర్పాటు చేసి రాయిచూర్ తీసుకెళ్తున్నట్లు తెలిసింది. వీళ్లకు ఐడీ కార్డులు ఇచ్చి ఎంత మేరకు ఆడుతారో వాటికి సంబంధించి డబ్బులు తీసుకుని కాయిన్స్ ఇస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి రాయిచూర్ వెళ్లేలోపు వీళ్లకు కావాల్సిన ఏర్పాట్లు, కాయిన్స్, ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిసింది. (చదవండి: Amrabad Tiger Reserve: అమ్రాబాద్‌కు ‘వైల్డ్’ ఎంట్రీ) -
జోరుగా జూదం
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి పట్టణంలో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. లక్షల్లో కరెన్సీ చేతులు మారుతోంది. స్థానికులే కాకుండా దూరప్రాంతాల నుంచి వస్తున్న పేకాటరాయుళ్లతో పట్టణంలోని హోటళ్లు జూదానికి కేంద్రాలుగా మారుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంపై పోలీసుల నిఘా పెద్దగా ఉండదన్న ధైర్యంతో నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. సెల్ఫోన్లతో సమాచారం అందించి ఎంపిక చేసుకున్న హోటళ్లు, లాడ్జిలు, రెస్ట్ హౌస్‌లలో యథేచ్చగా జూదం నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : జూదాన్ని వ్యసనంగా మార్చుకున్న కొంత మంది బడా బాబులకు తిరుపతి నగరం సురక్షిత ప్రాంతంగా కనిపించింది. ఎందుకంటే..ఈ పట్టణానికి నిత్యం వేలాది మంది యాత్రికులు వచ్చి పోతుంటారు. హోటళ్లు, లాడ్జిలన్నీ యాత్రికులు, పర్యాటకులతో నిండి ఉంటాయి. ఇక్కడి హోటళ్లలో జూదం ఆడితే పోలీసులు పెద్దగా పట్టించుకునే వీలుండదన్నది జూదరుల భావన. దీంతో పట్టణంలోని ఒక్కో లాడ్జిని ఒక్కో రోజు ఎంపిక చేసుకుంటూ పేకాట సాగిస్తున్నారు. సరదాగా పేకాట ప్రారంభించి వ్యసనంగా చేసుకున్న వారు కొందరైతే, అదే వృత్తిగా చేసుకున్న వారు మరికొందరు ఉన్నారు. ఆరు నెలలుగా పరిశీలిస్తే...ఐదారుసార్లు పోలీసులు దాడులు చేసి రూ.20 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ జూదం ఆగలేదు. సోమవారం రాత్రి తిరుచానూరు రోడ్డులోని ఓ పేరున్న స్టార్ హోటల్‌పై దాడిచేసిన పోలీసులు 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తూ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ప్రాంతాన్ని గుర్తిం చడం, అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేయడం, ఆటతో సంబంధం ఉన్న వారికి ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడమనే మూడు ప్రక్రియల్లో జూదం సాగుతోంది. తిరుపతిలోని కీలక హోటళ్లను వీరు ఎంపిక చేసుకుంటున్నారు. ఆరు నెలల కిందట బస్టాండ్ దగ్గర ఓ స్టార్ హోటల్లో పోలీసులు దాడిచేసి పది మందికిపైగా జూదరులను పట్టుకున్నారు. ఆ తరువాత కొర్లగుంట, లక్ష్మీపురం, బస్టాండ్ సెంటర్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో దాడులు జరిగాయి. మరి కొంతమంది జూదరులను, నిర్వాహకులనూ పోలీ సులు అరెస్టు చేశారు. రియల్ వ్యాపారులు, బిల్డర్లు, పొలిటికల్ లీడర్లు వీరిలో ఉన్నారు. ఒకప్పుడు చెన్నై, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో నిర్వహించే క్లబ్బుల్లో ఆడే ఆటగాళ్లు కొందరు అక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో మకాం తిరుపతికి మార్చుకున్నారు. పోలీసులతో మంచి సంబంధాలు కలిగిన కొంత మంది కీలక వ్యక్తులు పేకాట స్థావరాలను మేనేజ్ చే స్తున్నారు. ఆటకింతని డబ్బు తీసి సొంతంగా నిఘా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. పోలీసులకూ తెలుసు.. ఏ రోజు ఎక్కడ జూదం నడుస్తుందో పోలీసులకూ తెలుస్తుందనీ, అయితే విషయం ఎస్పీ దాకా వెళ్లే అవకాశం ఉందని పసిగట్టినపుడే దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. చిన్నాచితకా స్థావరాలపై దాడులు జరపకుండా నెలవారీ మామూళ్లు అందుకుంటున్న పోలీసులూ ఉన్నారు. దీనివల్ల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికే విచ్చలవిడి మద్యం దుకాణాలతో కంపుకొట్టే నగరం జూదానికి కేంద్రంగా మారితే అసాంఘిక శక్తులు హెచ్చుమీరే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో నిఘా ఉంది నగరంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంది. ప్రధానంగా పేకాట స్థావరాలను ఎప్పటికప్పుడు గుర్తించేలా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీనికితోడు సమర్థవంతమైన సమాచార వ్యవస్థ కూడా ఉంది. ఎవర్నీ వదలిపెట్టం. హోటళ్లకు లీగల్ నోటీసులు పంపుతున్నాం. ఇకపై ఏదైనా జరిగితే యజమానులు బాధ్యత వహిం చాల్సి ఉంటుందని చెబుతాం. – మునిరామయ్య, ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ, తిరుపతి -
ఆటాడుకుందాం రా...!
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతమంది వ్యక్తులు టెక్నాలజీని అందిపుచ్చుకుని నిషేధిత పేకాటను ఆడుతున్నారు. అత్యాశకు పోయిన పలువురు పత్తాల ఆటలో ఉన్నదంతా పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమిషనరేట్ పరిధిలో రోజుకు రూ. లక్షలు చేతులు మారుతున్నాయంటే ఈ జూదం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల కనుసన్నల్లో పేకాట రాయుళ్లు తమ ఆటను దర్జాగా కొనసాగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు హోటళ్లలో ఆటలు.. నగరంలో పేరున్న పలు ప్రధాన హోటళ్లలో హైదరాబాద్‌కు చెందిన కొంతమంది తొలుత తమ పేరిట ఆన్లైన్లో గదులు బుక్ చేసుకుం టున్నారు. తర్వాత పేకాట ఆడేవారికి హోటల్ పేరు, రూమ్ నంబర్ ను వాట్సప్‌లో మేసేజ్ చేస్తున్నట్లు సమాచారం. అక్కడికి ఎవరెవరు రావాలో.. ఆ మేసేజ్‌లో తెలుపుతున్నట్లు తెలిసింది. వారు హోటల్‌కు రాగానే సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఆటను ప్రారంభిస్తారు. మధ్యాహ్న సమయంలో భోజనాలు కూడా రూమ్‌కే తెప్పించుకుని తింటున్నట్లు తెలుస్తోంది. హోటళ్లలో ఆడేవారు రూ.50 వేల నుంచి రూ. లక్ష వర కు ఆడుతున్నట్లు సమాచారం. ఇటీవల హన్మకొండ హరిత హోటల్లో రెండుసార్లు పేకాటరాయుళ్లు పోలీసులకు దొరకడం గమనార్హం. రూ. లక్షలు తారుమారు.. నగరంలో పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆడే ఆటల్లో రూ. లక్షలు పెడుతున్నారు. లిక్కర్ బిజినెస్‌లో పేరున్న ఓ వ్యక్తి, రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వివిధ పార్టీల నాయకులు, గతంలో జిల్లాలో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి ఇలా... ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు వారంలో మూడు నుంచి నాలుగు రోజులపాటు రహస్య ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం. వీరి శిబిరంలో 5 నుంచి 8 మంది ఆట ఆడుతున్నట్లు తెలుస్తోంది. టేబుల్ క్యాష్‌గా ప్రతి ఒక్కరూ రూ. 5 లక్షలు చూపించాలి. అప్పుడు మాత్రమే వారిని ఆటకు అనుమతి ఇస్తారు. వీరంత రాత్రి పూట అయితే అపార్ట్మెంట్స్, పగలు అయితే పండ్ల తోటలు, నగర సరిహద్దు ప్రాంతాల్లో ఆట ఆడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిహద్దులో స్థావరాలు.. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పేకాట స్థావరాలు ఏర్పాటు చేసుకుని కూడా కొందరు తమ ఆటను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు తెలు స్తోంది. జిల్లాలో నూతనంగా కలిసిన ఓ మండల సరిహద్దులో పోలీ సుల అనుమతితో ఓ పేకాట శిబిరం ఇటీవల పురుడు పోసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ వ్యక్తి ఆటను దర్జాగా ముందుకు నడిపిస్తున్నాడు. పోలీసులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఓ సర్పంచ్‌ని మధ్యవర్తిగా పంపించి ‘డీల్’ సెట్ చేసుకున్నట్లు స్థానికులు చెబుతు న్నారు. పోలీసులు పేకాట శిబిరం వైపు రాకుండా ఉండేందుకు నెలకు రూ. లక్ష ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో ఆ మండలంలో ఆట జోరుగా ముందుకు సాగుతుంది. నగరంలో... వీఐపీలు, ప్రజాప్రతినిధులతో నిత్యం అప్రమత్తంగా ఉండే సుబేదారి ప్రాంతంలో కూడా పలువురు పేకాట ఆడుతున్నట్లు సమాచారం. కొందరు గదులను అద్దెకు తీసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు ఆటలో మునిగితేలుతున్నారు. హన్మకొండ గుడిబండల్లో ఏకంగా గదినే అద్దెకు తీసుకున్నారు. గీసుగొండ మండలం ధర్మారంలోని ఓ చెరువు వద్ద పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వస్తున్నారనే సమాచారంతో పెద్ద ముఠా పరారైంది. ఈనెల 2న కడిపికొండలోని ఓ శిబిరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 9 మందిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి 9 సెల్ఫోన్లు, రూ.75,670ను స్వాధీనం చేసుకున్నారు. గీసుగొండ మండలంలో కోల్డ్‌స్టోరేజ్ ప్రాంతం, ఎన్టీఆర్ నగర్, లేబర్‌కాలనీ, ప్రశాం త్‌నగర్, మామునూర్ క్యాంపులో ఎక్కువగా ఆడుతున్నట్లు సమాచారం. తుతూ మంత్రంగా చర్యలు.. వరంగల్ కమిషనరేట్ ప్రాంతంలో ఆడే పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు తూతూమంత్రంగానే ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నా యి. గతేడాది కమిషనరేట్ పరిధిలో 68 కేసులు నమోదయ్యాయి. పేకాట రాయుళ్ల నుంచి రూ.16 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కొన్ని స్టేషన్ల పరిధిలో పోలీసుల సహకారంతో శిబిరాలు నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పేకాట శిబిరంపై దాడి: 8మంది అరెస్ట్
మాగనూర్(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ జిల్లా మాగనూర్ మండల పరిధిలోగల మారుతీనగర్‌లో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి, 8మందిని అదుపులోకి తీసుకున్నారు. మారుతీ నగర్‌లోని బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారని సమాచారంతో మంగళవారం వేకువజామున ఎస్.ఐ. ఫరాద్ హుసేన్ తన సిబ్బందితో దాడి చేశారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.32, 440 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.