తగ్గేదేలే... ఈడ కాదంటే.. ఆడ ఆడతాం..! | Organizers Started Gambling On Interstate Borders In Telangana | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే... ఈడ కాదంటే.. ఆడ ఆడతాం..!

Published Sat, Nov 6 2021 3:08 AM | Last Updated on Sat, Nov 6 2021 12:33 PM

Organizers Started Gambling On Interstate Borders In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు మళ్లీ జోరందుకున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఆడితే ఇబ్బందేంటని భావించిన పేకాట నిర్వాహకులు ఏకంగా అక్కడ భూములు కొనుగోలు చేసి క్లబ్బులుగా మార్చేశారు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసుకుని మరీ దందా సాగిస్తున్నారు. వారంలో మూడు రోజులు పేకాట రాయుళ్లకు అన్ని రకాల వసతులు కల్పించి లక్షల్లో కమిషన్‌ పేరిట దోచుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో జరుగుతున్న పేకాట వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఇసుక కాంట్రాక్టర్లదే హవా.. 
మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయడం లేదా లీజుకు తీసుకుని పెద్ద రేకులతో కంచెలు నిర్మించి, లోపల విశాలమైన హాళ్లు, పడక గదులు నిర్మించి పేకాటకు తెరతీశారు. రాష్ట్రంలోని మంచిర్యాల, చెన్నూర్‌ ప్రాంతాల్లో ఇసుక దందా నిర్వహిస్తున్న కొందరు ప్రముఖులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతం, మహారాష్ట్రలోని సిరోంచ, అమ్రావతి, కంబాల్‌పేట ప్రాంతాల్లో క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో అక్కడి స్థానిక మాఫియా ఏర్పాటు చేసిన క్లబ్బులను లోకల్‌ పోలీసులు మూసేయించారు.

ఆరు నెలల కింద తెలంగాణకు చెందిన ఓ బడా ఇసుక కాంట్రాక్టర్‌ ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని క్లబ్బు ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకున్నాడు. అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో చేతులు కలిపి రీక్రియేషన్, స్పోర్ట్స్‌ క్లబ్బుల పేరిట పేకాట నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ముగ్గురు క్రషర్, బీడీ ఆకు కాంట్రాక్టర్లు కలసి మూడు ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ ప్రాంతాల్లోని బడా వ్యక్తులంతా ఆగస్టు నుంచి పేకాటకు వెళ్తున్నట్లు సమాచారం. 

కేరళపై మక్కువతో.. 
బడా బాబులు, ప్రముఖులకు కేరళ సిండికేట్‌ బ్యాచ్‌ ఆహ్వానం అందిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం విమానం ఎక్కడం, శని, ఆదివారాలు అక్కడే ఉండటం లక్షల్లో సమర్పించుకుని వస్తున్నట్లు ఇటీవల పోలీసులుకు పట్టబడ్డ సుమన్‌ చౌదరి విచారణలో తేలింది. అయితే రాయిచూర్‌ కేంద్రంగా సాగుతున్న పేకాట కేంద్రాల నిర్వాహకుల సిండికేటే కేరళలోనూ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. పేకాటలో పెట్టే డబ్బులు కాకుండా కేవలం ఎంట్రీ ప్యాకేజీ కోసం రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి వారం 50 నుంచి 70 మంది కేరళ వెళ్తున్నట్లు తెలిసింది. 

రష్యా వెళ్లాలనుకునే వారికి..  
వీవీఐపీల కోసం ప్రత్యేకంగా చార్టర్డ్‌ ఫ్లైట్‌ ఏర్పాటు చేసి మరీ రష్యాకు పంపేందుకు సుమన్‌ చౌదరితో పాటు కేరళ సిండికేట్‌ బ్యాచ్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఏకంగా అక్కడి మాఫియాతో చేతులు కలిపి వీవీఐపీ బ్యాచ్‌కు వారం పాటు మూడు ముక్కలాట ఆడిస్తోందని చెబుతున్నారు. రెండు నెలల కింద 18 మంది ప్రముఖులు రష్యా వెళ్లి వచ్చినట్లు సుమన్‌ చౌదరి విచారణలో బయటపడింది. ప్రముఖుల వివరాలు మాత్రం పోలీసులు బయటకు రానివ్వట్లేదు.  

పాత నిర్వాహకులకు అడ్డా.. 
ఇక్కడ పేకాట నిర్వహణలో చేయితిరిగిన వ్యక్తి తన అనుచరులతో కలసి కర్ణాటక సరిహద్దు అయిన రాయిచూర్‌లో నాలుగు పేకాట కేంద్రాలను ఏర్పాటు చేశాడు. 2019 ఏప్రిల్‌లో కరోనా వల్ల మూతపడ్డ క్లబ్బును ఇటీవలె మళ్లీ తెరిచినట్లు పోలీసు వర్గాలకు తెలిసింది. గతంలో బోయిన్‌పల్లితో పాటు నల్లకుంట, బంజారాహిల్స్, బేగంపేటలో క్లబ్బులు నిర్వహించిన వాళ్లంతా ఇప్పుడు సిండికేట్‌గా మారి రాయిచూర్‌ నుంచి భగాల్‌కోట్‌ వెళ్లే మార్గంలో ఏర్పాటుచేసిన పేకాట కేంద్రాలకు ప్రతి వారం 300 మందికి పైగా వెళ్తున్నట్లు తెలిసింది.

పేకాట కేంద్రాల నిర్వాహకులే ఏసీ బస్సులు ఏర్పాటు చేసి రాయిచూర్‌ తీసుకెళ్తున్నట్లు తెలిసింది. వీళ్లకు ఐడీ కార్డులు ఇచ్చి ఎంత మేరకు ఆడుతారో వాటికి సంబంధించి డబ్బులు తీసుకుని కాయిన్స్‌ ఇస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ నుంచి రాయిచూర్‌ వెళ్లేలోపు వీళ్లకు కావాల్సిన ఏర్పాట్లు, కాయిన్స్, ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిసింది.  
(చదవండి: Amrabad Tiger Reserve: అమ్రాబాద్‌కు ‘వైల్డ్‌’ ఎంట్రీ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement