వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతమంది వ్యక్తులు టెక్నాలజీని అందిపుచ్చుకుని నిషేధిత పేకాటను ఆడుతున్నారు. అత్యాశకు పోయిన పలువురు పత్తాల ఆటలో ఉన్నదంతా పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమిషనరేట్ పరిధిలో రోజుకు రూ. లక్షలు చేతులు మారుతున్నాయంటే ఈ జూదం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల కనుసన్నల్లో పేకాట రాయుళ్లు తమ ఆటను దర్జాగా కొనసాగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పలు హోటళ్లలో ఆటలు..
నగరంలో పేరున్న పలు ప్రధాన హోటళ్లలో హైదరాబాద్‌కు చెందిన కొంతమంది తొలుత తమ పేరిట ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకుం టున్నారు. తర్వాత పేకాట ఆడేవారికి హోటల్ పేరు, రూమ్ నంబర్ ను వాట్సప్‌లో మేసేజ్ చేస్తున్నట్లు సమాచారం. అక్కడికి ఎవరెవరు రావాలో.. ఆ మేసేజ్‌లో తెలుపుతున్నట్లు తెలిసింది. వారు హోటల్‌కు రాగానే సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఆటను ప్రారంభిస్తారు. మధ్యాహ్న సమయంలో భోజనాలు కూడా రూమ్‌కే తెప్పించుకుని తింటున్నట్లు తెలుస్తోంది. హోటళ్లలో ఆడేవారు రూ.50 వేల నుంచి రూ. లక్ష వర కు ఆడుతున్నట్లు సమాచారం. ఇటీవల హన్మకొండ హరిత హోటల్‌లో రెండుసార్లు పేకాటరాయుళ్లు పోలీసులకు దొరకడం గమనార్హం.
రూ. లక్షలు తారుమారు..
నగరంలో పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆడే ఆటల్లో రూ. లక్షలు పెడుతున్నారు. లిక్కర్ బిజినెస్‌లో పేరున్న ఓ వ్యక్తి, రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వివిధ పార్టీల నాయకులు, గతంలో జిల్లాలో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి ఇలా... ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు వారంలో మూడు నుంచి నాలుగు రోజులపాటు రహస్య ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం. వీరి శిబిరంలో 5 నుంచి 8 మంది ఆట ఆడుతున్నట్లు తెలుస్తోంది. టేబుల్ క్యాష్‌గా ప్రతి ఒక్కరూ రూ. 5 లక్షలు చూపించాలి. అప్పుడు మాత్రమే వారిని ఆటకు అనుమతి ఇస్తారు. వీరంత రాత్రి పూట అయితే అపార్ట్‌మెంట్స్, పగలు అయితే పండ్ల తోటలు, నగర సరిహద్దు ప్రాంతాల్లో ఆట ఆడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సరిహద్దులో స్థావరాలు..
జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పేకాట స్థావరాలు ఏర్పాటు చేసుకుని కూడా కొందరు తమ ఆటను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు తెలు స్తోంది. జిల్లాలో నూతనంగా కలిసిన ఓ మండల సరిహద్దులో పోలీ సుల అనుమతితో ఓ పేకాట శిబిరం ఇటీవల పురుడు పోసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ వ్యక్తి ఆటను దర్జాగా ముందుకు నడిపిస్తున్నాడు. పోలీసులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఓ సర్పంచ్‌ని మధ్యవర్తిగా పంపించి ‘డీల్’ సెట్ చేసుకున్నట్లు స్థానికులు చెబుతు న్నారు. పోలీసులు పేకాట శిబిరం వైపు రాకుండా ఉండేందుకు నెలకు రూ. లక్ష ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో ఆ మండలంలో ఆట జోరుగా ముందుకు సాగుతుంది.
నగరంలో...
వీఐపీలు, ప్రజాప్రతినిధులతో నిత్యం అప్రమత్తంగా ఉండే సుబేదారి ప్రాంతంలో కూడా పలువురు పేకాట ఆడుతున్నట్లు సమాచారం. కొందరు గదులను అద్దెకు తీసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు ఆటలో మునిగితేలుతున్నారు. హన్మకొండ గుడిబండల్‌లో ఏకంగా గదినే అద్దెకు తీసుకున్నారు. గీసుగొండ మండలం ధర్మారంలోని ఓ చెరువు వద్ద పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వస్తున్నారనే సమాచారంతో పెద్ద ముఠా పరారైంది. ఈనెల 2న కడిపికొండలోని ఓ శిబిరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 9 మందిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి 9 సెల్‌ఫోన్లు, రూ.75,670ను స్వాధీనం చేసుకున్నారు. గీసుగొండ మండలంలో కోల్డ్‌స్టోరేజ్ ప్రాంతం, ఎన్‌టీఆర్ నగర్, లేబర్‌కాలనీ, ప్రశాం త్‌నగర్, మామునూర్ క్యాంపులో ఎక్కువగా ఆడుతున్నట్లు
సమాచారం.
తుతూ మంత్రంగా చర్యలు..
వరంగల్ కమిషనరేట్ ప్రాంతంలో ఆడే పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు తూతూమంత్రంగానే ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నా యి. గతేడాది కమిషనరేట్ పరిధిలో 68 కేసులు నమోదయ్యాయి. పేకాట రాయుళ్ల నుంచి రూ.16 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కొన్ని స్టేషన్ల పరిధిలో పోలీసుల సహకారంతో శిబిరాలు నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment