శ్రీకాకుళం, టెక్కలి: పెద్ద పెద్ద నగరాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతూ గుట్టు చప్పుడు కాకుండా విస్తరిస్తున్న పేకాట వ్యాపారం ఇప్పుడు జిల్లా కేంద్రంలో పాగా వేసింది. పేకాట ఆడాలనే ఆసక్తి ఉంటే చాలు నిర్వాహకులు వేల రూపాయలు చెల్లించి వాహనాలు ఏర్పాటు చేసి మరీ పేకాట ప్రియులను శిబిరాల వద్దకు చేర్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి సమీప ప్రాంతాల్లోని తోటల్లో మూడుముక్కలాట, సూట్ వంటి పేకాటల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. నిన్నటి వరకు డివిజన్ కేంద్రమైన టెక్కలిలో కొనసాగిన పేకాట వ్యవహారంపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలతో జూదరులు జిల్లా కేంద్రంలోని బడా పేకాట శిబిరాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి పెద్ద ఎత్తున ఈ పేకాట వ్యాపారాన్ని కొనసాగిస్తూ రోజుకు కోట్ల రూపాయలు చేతులు మారుస్తున్నట్లు వినికిడి.
ఈ వ్యాపారంలో భాగంగా మంత్రి కార్యాలయంలో కీలకంగా ఉన్న ఓ వ్యక్తికి నెలవారీ లక్షల రూపాయలు ముట్టజెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాపారానికి అడ్డం అనుకునే ప్రతీ వ్యక్తి అది పోలీస్ అయినా మీడియా అయినా.. కొంత మొత్తాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఓ బాధితుడికి సంబంధించి మహిళా జిల్లా పోలీసులకు సమాచారం ఇస్తే మంత్రి కార్యాలయంలో కీలక వ్యక్తి ఆదిలోనే అడ్డుకున్నట్లు సమాచారం. బడా పేకాట శిబిరంలో పెద్ద పెద్ద తలకాయలు ఉండడంతో పోలీస్ యంత్రాంగం ఆ వైపు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలు సామాన్యులతో పాటు పేకాట వ్యాపారాన్ని కొనసాగిస్తున్న నిర్వాహకుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment