శ్రీకాకుళం, టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలికి ఆనుకుని కొన్ని పరిసర ప్రాంతాల్లో పేకాట జోరుగా కొనసాగుతోంది.. ప్రతి రోజూ సుమారు 5 నుంచి 8 లక్షల రూపాయల మేరకు పేకాటలో డబ్బులు చేతులు మారుతున్నట్లు సమాచారం. పేకాట ఆడాలనే కాంక్ష ఉన్న వారికి గాలం వేస్తూ ఆయా శిబిరాల వద్దకు చేర్చడం.. వారితో లక్షల రూపాయల మేరకు పేకాట ఆడించడం..ఎవరికైనా అప్పు కావాలంటే అక్కడే అందజేయడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. పేకాట ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా జూదం సమాచారాలు తెలియజేయడం, వాటిపై ఆసక్తి ఉన్న వారికి ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లడం వీరి పని.
టెక్కలి నుంచి మెళియాపుట్టి రోడ్డులో మారుమూల తోటల్లోనూ, సీతాపురం నుంచి గిరిజన గ్రామాలకు వెళ్లే మార్గంలోనూ ప్రతి రోజూ లక్షల రూపాయల్లో పేకాట జరుగుతున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది ప్రముఖులు ఉండడంతో పోలీసులు అటు వైపు దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల కొండ ప్రాంతాల్లోని తోటల్లో ఒక్కోసారి మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు జూదం జరుగుతున్నట్లు సమాచారం. ఈ చతుర్ముఖ పారాయణం వల్ల ఇప్పటికే ఎంతో మంది సామాన్య వర్గాలకు చెందిన వారు ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పో లీస్ యంత్రాంగం ప్రత్యేక నిఘా వేసి జూదానికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment